హైదరాబాద్ ః బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ర్యాగింగ్ పేరుతో ఓ విద్యార్ధిని తీవ్రంగా కొట్టి గాయపరిచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. సాయి భగీరథ్ , అతని స్నేహితులు కలిసి బాధిత విద్యార్థిని పత్రికల్లో రాయలేని భాషలో ప్రాంతం పేరుతో దూషించడం, ఎరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంత్రికి చెప్పినా నన్నేం పీకలలేరంటూ రంకెలు వేశాడు. ఇదిలావుండగా బండి సాయి భగీరథ్‌పై మహేంద్రా యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదులో యూ/ఎస్ 341, 323, 504, 506 ఆర్ / డబ్లూ 34 ఐపిసి కె సెక్షన్ల కింద దుండుగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సాయి భగీరథ్ సాటి విద్యార్థిపై రౌడీలా దాడి చేయడంపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతుంది. తన తండ్రి అండతో సాయి భగీరథ్ అరాచకంగా ప్రవర్తిస్తున్నాడని పలువురు విద్యార్ధి సంఘాల నేతలు మండిపడుతున్నారు. తొలి నుంచి వివాదాస్పదుడిగా బండి సాయి భగీరథ్‌కు పేరుంది. గతంలో కూడా ఢిల్లీలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో చదువుకుంటూ ఇలాగే గొడవలు చేస్తున్నాడని ఆ విద్యాసంస్థ నుంచి యాజమాన్యం బయటకు పంచించినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మహీంద్రా యానివర్సిటీలో చదువుతున్నా బండి సాయి భగీరథ్ తోటి విద్యార్థిని చితకబాది మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.
సాయి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలి ః ఎస్‌ఎఫ్‌ఐ
మహీంద్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ చేసిన బండి సాయి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మహీంద్ర యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రవేశం పొందిన ఓ విద్యార్థిని ర్యాగింగ్ చేసి, బూతులు తిట్టి, భౌతికంగా దాడి చేసిన సాయి భగీరథ్, అతనికి సహకరించిన మిత్రులను తక్షణమే అరెస్టు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. ఎల్. మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చట్టాలను అమలు చేయని మహీంద్రా యూనివర్సిటీపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు.