న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అక్రమాలను బయటపెట్టకుండా ఉండేలా తనకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్‌ఎల్‌ఎ ఒకరు.. ఆ డబ్బులను శాసనసభకు తీసుకొచ్చి చూపించారు. దీనిపై తాను ఫిర్యాదు చేశానని , ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో ఆప్ ఎమ్‌ఎల్‌ఎ మహేందర్ గోయల్ మాట్లాడుతూఏ రోహిణి జిల్లా లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రిలో తాత్కాలిక సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఈ నియామకాల ప్రక్రియను ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు అప్పగించారని, ఆ కాంట్రాక్టరు ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిపై తాను డీసీపీ, చీఫ్ సెక్రటరీ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. దీంతో ఆ కాంట్రాక్టర్ తనతో డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నించి తనకు లంచం ఆఫర్ చేశారని ఆరోపించారు. ఆ లంచం డబ్బులు ఇవేనంటూ ఓ సంచిలో నుంచి తీసి శాసన సభ సభ్యులకు చూపించారు.
ఈ విషయంలో తాను మాట్లాడకుండా ఉండేందుకు కొందరు శక్తిమంతమైన వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారి నుంచి నా ప్రాణాలకు హాని ఉంది. నాకు రక్షణ కావాలి. అయితే ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి అని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ ఇది చాలా తీవ్రమైన విషయం. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి అని సంబంధిత అధికారులను ఆదేశించారు.