కీవ్ : రష్యా దురాక్రమణతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలిపోవడంతో ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారా ల మంత్రి డెనిస్ మోనాస్‌టిస్కీ సహా 18 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. రాజధాని నగరం కీవ్‌కు సమీపం లోని బ్రోవరీ ప్రాంతంలో కిండర్‌గార్డెన్ పాఠశాల, నివాస భవనాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ప్రమాద అనంతరం దృశ్యాలు వైరల్‌గా మారాయి. హెలికాప్టర్ కూలిపోవడం వల్ల భవనాలు దెబ్బతినడంతోపాటు కారు ధ్వంసమైంది. ‘దేశ అత్యవసర సేవలకు చెందిన హెలికాప్టర్ బ్రోవరీ వద్ద కూలిపోయింది.
ఈ ఘటనలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన మంత్రులు దుర్మరణం పాలయ్యారని ఉక్రెయిన్ పోలీస్ సర్వీస్ చీఫ్ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలో డెనిస్‌తోపాటు ఆయన సహాయ మంత్రి యెవ్‌జెనియ్ యెనిన్ కూడా మరణించినట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారని, అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారని కీవ్ రీజియన్ గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2021 నుంచి డెనిస్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీ పార్టీలో ఆయన కీలక సభ్యుడు.
ప్రస్తుతానికి సంఘటనకు గల కారణాలపై ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. అయితే ఆ దేశ వైమానిక రంగంలో ఈ తరహా ప్రమాదాలు జరుగుతుంటాయి. కాలం చెల్లిన అలాగే సోవియట్ కాలం నాటి మౌలిక వసతులు వాడడమే ఇందుకు కారణమౌతుంటాయి.