Monday, December 23, 2024

ముస్లిం సమాజాన్ని ప్రశ్నించిన ‘సారా’

- Advertisement -
- Advertisement -

ప్రముఖ కన్నడ అభ్యుదయ కలం యోధురాలు సారా అబూబకర్ ఈ నెల పదవ తేదీన కన్ను మూశారు. ముస్లిం సమాజంలో స్త్రీల పట్ల ఉన్న వివక్షను వ్యతిరేకిస్తూ ఆమె ఎన్నో రచనలు చేశారు. సాంప్రదాయిక మత పెద్దల నుండి వచ్చిన బెదిరింపులను ఆమె లెక్క చేయకుండా మరింత బాధ్యతగా మహిళల స్వేచ్ఛ కోసం తమ కలాన్ని ఉపయోగించారు. సనాతనుల నుండి వ్యతిరేకతతో పాటు ప్రగతి కాముకుల ప్రోత్సాహం, ప్రోద్బలం అందడంతో ఆమె రచనలు తగిన ప్రాచుర్యం పొందాయి. తురక ఆడ పిల్లలను బడికి పంపాలని, తల్లులు కూడా చదువుకోవాలని తమ అక్షరాల ద్వారా చూపిన బాటలో ఎన్నో కుటుంబాలు నడిచాయి. తమ కథలలో సారా ముస్లిం జీవన విధానంలోని పురుష పెత్తనాన్ని, విడాకుల విధానాన్ని మరియు బహు భార్యత్వాన్ని తీవ్రంగా ఖండించారు.

1936 లో కర్ణాటకలోని కాసర్ గడ్ తీర ప్రాంతంలోని చంద్రగిరిలో సారా అబూబకర్ జన్మించారు. ఉత్తర కేరళ, కర్ణాటక సరిహద్దులో ఈ గ్రామం ఉంటుంది. వారిది మలయాళీ ముస్లిం కుటుంబం. తమ ఊర్లో మలయాళీ స్కూల్ లేనందున చదువు కన్నడం లో సాగింది. వారి గ్రామంలో సారా యే స్కూలుకు వెళ్లిన తొలి ముస్లిం అమ్మాయి. మత పెద్దల మాటను ఖాతరు చేయకుండా సారాను ఆమె తండ్రి ఊర్లోని మెట్రిక్యులేషన్ దాకా చదివించారు. తండ్రి లాయర్ అయి ఉండి కూడా కూతురును బడికి పంపడానికి ఆ రోజుల్లో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 1953 లో పెళ్లయి సారా మంగళూరులో అత్తవారింటికి వెళ్లారు. భర్త ఇంజనీరు అయినా ఇంట్లో అంతా మత సాంప్రదాయ పద్ధతులే. అందరిలో చదువుకున్న మహిళ తానొక్కరే. ఇంటికి దినపత్రిక వచ్చినా లోపలి గదులకు చేరేది కాదు. బయటికి వెళ్లాలంటే బురఖా ధరించాల్సిందే. తనకు చదవడం పట్ల ఆసక్తి తెలిసిన భర్త చాటుమాటుగా లైబ్రరీ నుండి పుస్తకాలూ తెచ్చి సారాకి ఇచ్చేవాడు. మగాళ్లందరూ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నా ఆడవాళ్ళ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేనందుకు ఆమె ఎంతో చింతించేవారు.

అనుకోకుండా భర్తకు మరో ఊరికి బదిలీ కావడంతో సారా జీవితం ఆమె చేతుల్లోకి వచ్చింది. వేరే ఊర్లో సొంత ఇంట్లో ఆమెకు కోరిన స్వేచ్ఛ లభించింది. తానే స్వయంగా లైబ్రరీకి వెళ్లి పుస్తకాలూ తెచ్చుకొనేది. బురఖా ధరించే అవసరం లేదు.శివరామ కారంత్, ఎస్ ఎల్ బైరప్ప, అనంతమూర్తి తదితరుల రచనలు ఆమెను ప్రభావితం చేశాయి లైబ్రరీలో ఏర్పడ్డ పరిచయాలతో అక్కడి మహిళ సంఘాలతో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది. అలా రచనలపై ఆసక్తి పెరిగింది. తన సంస్కరణవాద ఆలోచనలతో ఎన్నో కథలు, వ్యాసాలు రాసి పత్రికలకు పంపేవారు. అయితే ఆమె మతపర విమర్శలను వేసుకునేందుకు ఏ పత్రిక ముందుకు రాలేదు. చాలా కాలం తరువాత బెంగుళూరులోని లంకేశ్ పత్రిక ఆమె రచనలను ప్రచురించింది. ఆ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేశ్ స్వయంగా సారా కి లేఖ రాసి మీలాంటి రచయిత్రుల అవసరం ఈ సమాజానికి ఎంతో ఉందని తెలిపారు. 1981 లో సారా తొలి నవల ’చంద్రగిరియా తీరదల్లి’ లంకేశ్ పత్రికలో సీరియల్ గా వచ్చింది.ఆ సీరియల్ వస్తున్న రోజుల్లో ఆ రచనపై సనాతన ముస్లిం సమూహాల నుండి వ్యతిరేకత వచ్చింది. మరో వైపు సీరియల్ ను సీరియల్ ను ఆహ్వానిస్తూ, ప్రశంసిస్తూ పత్రికకు ఉత్తరాలు వచ్చేవి. ఇలా సమాజంలోని ఒక వర్గం తోడు నిలవడంతో ఆ రచన నిర్విఘ్నం కొనసాగింది. 1984 లో పుస్తకంగా వచ్చిన ఆ ధారావాహిక హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, ఒరియా భాషల్లోని అనువదింపబడింది. కొన్ని యూనివర్సిటీలో ఆ నవలను పాఠ్యంశంగా తీసుకున్నాయి. కర్ణాటక సాహిత్య అకాడమీ ఉత్తమ నవల పురస్కారం అందించింది. భర్తల కోపం, నిర్లక్ష్యంతో కూడిన తొందరపాటు నిర్ణయాల వల్ల విడాకులు పొందిన ముస్లిం మహిళల జీవన వ్యధలను ఇందులో ఆమె సమర్థవంతంగా చిత్రించారు.

సారా రచనలు ప్రధానంగా ముస్లిం మహిళల జీవనకోణంలోనే సాగాయి. వరుస పెళ్లిళ్ళపై ’హుట్టు’ అనే కథ, వరుస గర్భధారణలపై ’మూలే ముట్టిద హులు’ అనే కథ రాసారు. సమాజంలో స్త్రీ పురుష సంబంధాల, అర్హతల, బాధ్యతల సమీకరణాల పట్ల ఆమె రచనలు సాగాయి. మత ఘర్షణలు, పేదల జీవిత అభద్రత, లంచగొండితనంపై కూడా కథలు రాశారు. నాలుగు దశాబ్దాల రచన కాలంలో సారా 10 నవలలు, 6 కథ సంపుటాలు, 5 నాటికలు రాశారు. ఆమెకు 1995 లో కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు లభించింది. 2008 లో మంగళూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2009 లో తొలి ముస్లిం రచయిత్రిగా రాష్ట్ర ప్రభుత్వ సన్మానం దక్కింది. 2012 లో నృపతుంగ అవార్డును స్వీకరించిన ఆమె ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాల్ని పంచుకున్నారు.

తాను మలయాళంలో రచనలు చేస్తే జనాదరణ ఇంకా ఉండేదని, కర్ణాటకలో పోల్చితే కేరళలో మత సామరస్యం ఎక్కువ అని, సమాజంలో స్త్రీలను జంతువులుగా, పిల్లలు పుట్టించే యంత్రాలుగా చూస్తున్నారన్నారు. జమాతే ఇస్లామికి చెందిన రచయితల నుండి తనకు బెదిరింపులు వచ్చేవని తెలిపారు. ఈ మధ్య కర్ణాటక ప్రభుత్వం ఆమె రాసిన బ్యూటీ అండ్ బీస్ట్ అనే పాఠ్యంశాన్ని సిలబస్ నుండి తొలగించింది. దీని పట్ల అక్కడి సాహిత్య శ్రేణుల నుండి విమర్శ కూడా వచ్చింది. నోటి క్యాన్సర్ తో బాధ పడుతున్న సారాకి ఆరు నెలల కింద శస్త్ర చికిత్స కూడా జరిగింది. మంగళూరులో యూనిటీ హాస్పిటల్ లో ఆమె 87 వ ఏట తుదిశ్వాస విడిచారు. మతాచారాల కారణంగా మహిళగా తాను అనుభవించిన, పరిశీలించిన అసమానతలను నిర్భయంగా రచనల ద్వారా బహిర్గతం చేసిన సారా అబూబకర్ ముమ్మాటికీ ప్రపంచ మహిళా లోక ప్రతినిధి. ఆమె రచనలు, వాటి స్ఫూర్తి సారాను మరిచిపోనియ్యవు.

బి.నర్సన్- 9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News