న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బ్రిజ్ భూషణ్ తన పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఆదివారం జరిగే రెజ్లింగ్ సమాఖ్య అత్యవసర సమావేశంలో బ్రిజ్ భూషణ్ తన పదవికి రాజీనామా ప్రకటించే అవకాశాలున్నాయి. బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై అనుచితంగా వ్యవహరిస్తున్నాడని, అతన్ని తక్షణమే అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం భారత స్టార్ రెజ్లర్లు రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ ఆందోళనలో వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫొగాట్ సహా పలువురు ఇతర రెజ్లర్లు పాల్గొన్నారు. కాగా, గురువారం రెండో రోజు కూడా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళనను కొనసాగించారు. బ్రిబ్ భూషణ్‌ను తక్షణమే రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, అతనిపై వచ్చిన ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలావుండగా బ్రిజ్ భూషణ్ తనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే స్పందించారు.
ఈ ఆరోపణాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలావుండగా బ్రిజ్ భూషణ్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి స్థితిలో భారత రెజ్లింగ్ సమాఖ్య అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఈ సమావేశంలోనే బ్రిజ్ భూషన్ తన పదవికి రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.