మన తెలంగాణ/నర్సంపేట: జిల్లాలో కేవలం నర్సంపేట నియోజకవర్గ రైతులకే సబ్సిడీ కరెంటు మోటారు పథకం అవశాకం లభించిందని దీనిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలను రూప కల్పన చేయడం జరుగుతుంది. నియోజకవర్గానికి ప్రత్యేకంగా సబ్సిడీ కరెంటు మోటారు పథకం మంజూరు చేయించడం జరిగిందని, ఈ పథకం కేవలం నర్సంపేట నియోజకవర్గంలోనే అమలుచేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు కోసం రూ. 3.9 కోట్లు కేటాయించడమైంది. విద్యుత్ మోటారు పంపు సెట్లు అర్హత గల రైతులకు 50 శాతం సబ్సిడీపై(రూ. 15 వేలు మించకుండా) సరఫరా చేయబడతాయి.
ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రైతులు కూడా అర్హులే అన్నారు. రైతులు మీ సేవా కేంద్రాల్లో పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సంబంధిత పత్రాలను ఉద్యాన అధికారులకు సమర్పించాలన్నారు. దరఖాస్తు చేసిన రైతులకు తప్పనిసరిగా బోరు లేదా బావి కలిగి ఉండాలన్నారు. బిందు లేదా తుంపర సేధ్యం కలిగిన రైతులకు పథకం అమలులో ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. నీటి వనరులను ఉద్యాన అధికారి ద్వారా జియో ట్యాగింగ్ చేయబడుతుంది. గుర్తించిన లబ్ధిదారులను గ్రామపంచాయతీ ద్వారా ఆమోదించబడి జిల్లా కమిటీ ద్వారా మంజూరు చేయబడుతుంది. సబ్సిడీ మోటార్ల రైతులకు సంబంధిత రైతు వేదిక లేదా మండల కేంద్రం వద్ద కంపనీ ద్వారా మోటార్లు సరఫరా చేయబడతాయి. కావున పై సబ్సిడీ కరెంటు మోటార్లు, పైపులైన యూనిట్లను నియోజకవర్గంలోని రైతులందరూ సద్వినియోగపర్చుకోవాలని తెలిపారు.