న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. లెఫ్టినెంట్ గవర్నర్ ముందు దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారించాల్సి ఉంది. లేకపోతే మరిన్ని అంజలి తరహా దుర్ఘటనలు జరుగుతాయని ఆప్ నేత కేజ్రీవాల్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. సిఎం కేజ్రీవాల్ తనపై తప్పుడు, అమర్యాదకర వ్యాఖ్యలకు దిగుతున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పడంపై కేజ్రీవాల్ స్పందించారు. సూర్యుడు, చంద్రుడు తమ తమ పరిధిలో వ్యవహరిస్తేనే విశ్వం సవ్యంగా ఉంటుందని, సిఎంగా తనపని తాను సవ్యంగా చేసుకునే అవకాశం సక్సేనా కల్పించాల్సి ఉందని, దీని వల్ల ఢిల్లీలో పరిస్థితి బాగుంటుందని తెలిపారు.
ఇటీవలే లెప్టినెంట్ గవర్నర్ సక్సేనా సిఎం కేజ్రీవాల్‌కు ఓ లేఖ పంపించారు. రాజ్‌భవన్‌కు ఇటీవల ప్రదర్శనగా వచ్చినప్పుడు కురిపించిన విమర్శలు పూర్తిగా అనుచితంగా ఉన్నాయని, తనను రాజకీయాల్లోకి లాగేలా ఉన్నాయని పేర్కొంటూ ఏదైనా ఉంటే మాట్లాడకుందాం రండి అని కేజ్రీవాల్‌ను ఆహ్వానించారు. దీనికి కేజ్రీవాల్ స్పందిస్తూ తనను చర్చలకు పిలిచినందుకు సంతోషిస్తున్నానని , తాను ఒక్కడిని రాలేనని, మంత్రులు, ఎమ్మెల్యేలను తీసుకుని వస్తానని ఏది ఏమైనా లెఫ్టినెంట్ గవర్నర్ ముందు శాంతిభద్రతల పరిస్థితిని చక్కదిద్దితే మంచిదని సలహా ఇచ్చారు.