జిమ్ ట్రైనర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డిఐ ప్రభాకర్ తెలిపిన వివరాల మేరకు పటేల్ నగర్ కు చెందిన వెంకటేష్ గౌడ్ కుమారుడు రాకేష్ గౌడ్ (27) విద్యానగర్ లో జిమ్ ట్రైనర్ గా చేస్తున్నాడు. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక వేదనకు గురైన రాకేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఇంటికి తిరిగి వచ్చిన రాకేష్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉరేసుకున్నాడు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.