Friday, November 22, 2024

బిబిసి డాక్యుమెంటరీకి మోకాలడ్డుతున్న ప్రభుత్వం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ అనే బిబిసి డాక్యుమెంటరీని కేంద్రం అడ్డుకుంటోంది. యూటూబ్‌లో ఉన్న అనేక వీడియోలు, ట్విట్టర్‌లో ఉన్న పోస్ట్‌లను బ్లాక్ చేయమని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర శుక్రవారం ఐటి రూల్స్ 2021లోని ఎమర్జెన్సీ పవర్స్‌ను ఉపయోగించి ఈ ఆదేశాలు జారీచేశారు.
విదేశాంగ వ్యవహారాల శాఖ, అనేక మంత్రిత్వ శాఖలు, గృహ వ్యవహారాల శాఖ, సమాచార ప్రసారాల శాఖ సహా వివిధ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు ఆ డాక్యుమెంటరీని పరిశీలించారని అభిజ్ఞవర్గాలు పేర్కొన్నాయి. సుప్రీం కోర్టు అధికారాలు, విశ్వసనీయతపై దుష్ప్రాచారం చేయడానికి, వివిధ భారతీయ వర్గాల మధ్య విభజన తీసుకురాడానికి, విదేశీ ప్రభుత్వాల చర్యలపై నిరాధారమైన ఆరోపణలు ఇండియాలో చేయడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. భారత సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను తక్కువ చేయడానికే ఈ డాక్యుమెంటరీ పూనుకుందన్నారు. ఈ డాక్యుమెంటరీ స్నేహ సంబంధాలున్న విదేశాలతో, దేశంలోని ప్రజా జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపగలదని పేర్కొన్నారు.

యూటూబ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు వీడియోలను, పోస్ట్‌లను బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. సామాజిక మాధ్యమాలు ఆదేశాలకు లోబడి ఉండాలని పేర్కొన్నారు. దీనికి ముందు విదేశీ వ్యవహారాల శాఖ బిబిసి డాక్యుమెంటరీని ‘ఓ ప్రచారం’ అని పేర్కొనడమేకాక, దానికో లక్ష్యంలేదని, అది వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది.

బిబిసి డాక్యుమెంటరీ రెండు భాగాలుగా ఉంది. అది 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై పరిశోధనాత్మక అంశాలను పేర్కొంది. నాడు గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా నేటి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. “ఇది ఒక నిర్దిష్ట అపఖ్యాతి పాలైన కథనాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు రూపొందించిన ప్రచార భాగంగా మేము భావిస్తున్నాం. పక్షపాతం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద మనస్తత్వం ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బ్రిటిష్ మాజీ విదేశాంగ కార్యదర్శి జాక్ స్ట్రా అల్లర్లపై చేసిన వ్యాఖ్యలపై బాగ్చీ మాట్లాడుతూ ‘ఆయన కొన్ని యూకె ప్రభుత్వం అంతర్గత నివేదికలను రిఫర్ చేసి ఉంటారు’ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News