Saturday, November 23, 2024

కేంద్రం సంకుచిత దృష్టి

- Advertisement -
- Advertisement -

 

సంపాదకీయం: ఉన్నత న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ప్రస్తుతమున్న కొలీజియం వ్యవస్థపై వివాదం ఒక వైపు కొనసాగుతుండగానే సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన ముగ్గురి పేర్లను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించి తిప్పి పంపడం తాజాగా మరో పేచీకి దారి తీసింది. వీరిని న్యాయమూర్తులుగా నియమించి తీరాల్సిందేనని సిజెఐ (భారత ప్రధాన న్యాయమూర్తి) వైవి చంద్రచూడ్ నాయకత్వంలోని త్రిసభ్య కొలీజియం భీష్మించుకొన్నది. కేంద్రం తిప్పి పంపిన ముగ్గురిలో ఒకరు సౌరభ్ కిర్పాల్ అనే స్వలింగ సంపర్కుడు. ఢిల్లీ హైకోర్టు న్యాయవాది. లెస్బియన్లు, స్వలింగ సంపర్కులు, ఉభయ లింగులు, లింగ మార్పిడి చేసుకొన్నవారి (ఎల్‌జిబిటి) హక్కుల రక్షణ కోసం తరచూ వాదిస్తుంటారు. తాను స్వలింగ సంపర్కుడినని ఈయన స్వయంగా ప్రకటించుకొన్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన వ్యక్తి తన జీవిత భాగస్వామి అని కూడా చెప్పుకొన్నారు. జెండర్‌ను బట్టి నియామక అర్హత అనర్హతలను నిర్ధారించడం తప్పని స్పష్టం చేస్తూ కిర్పాల్ విషయంలో కేంద్రం అభ్యంతరాన్ని సుప్రీం కొలీజియం తోసిపుచ్చింది.

ఈ ముగ్గురి విషయంలో కేంద్రం వెలిబుచ్చిన వ్యతిరేకాభిప్రాయాలను బయటపెట్టింది. కొలీజియం ఇలా చేయడం అరుదు. కిర్పాల్ జీవిత భాగస్వామి స్విట్జర్లాండ్‌కు చెందిన వ్యక్తి కాబట్టి దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదమున్నదని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ (రా) విభాగం కేంద్రానికి తెలియజేసింది. దేశంలో స్వలింగ సంబంధాలు పెట్టుకోడాన్ని నేరంగా పరిగణించనప్పటికీ స్వలింగ వివాహాన్ని గుర్తించడం లేదనే సంగతిని కేంద్రం కొలీజియం దృష్టికి తెచ్చింది. కిర్పాల్ స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పని చేస్తున్నందున న్యాయమూర్తిగా ఆయన నిష్పాక్షిక దృష్టిని అది దెబ్బతీసే అవకాశముందని కూడా పేర్కొన్నది. కిర్పాల్‌తో పాటు ఆర్ జాన్ సత్యన్ అనే మద్రాస్ హైకోర్టు న్యాయవాది పేరును, సోమశేఖర్ సుందరేశన్ అనే బొంబాయి అడ్వొకేట్ పేరును కూడా కేంద్రం ఆమోదించలేదు. ఈ ముగ్గురి విషయంలో కేంద్ర న్యాయశాఖ వెలిబుచ్చిన అభ్యంతరాలకు సుప్రీం కొలీజియం దృష్టి కోణానికి తీవ్ర వైరుధ్యం సుస్పష్టం.

సుప్రీం కొలీజియం విశాలమైన ప్రజాస్వామిక దృష్టితో వీరి పేర్లను న్యాయమూర్తి పదవులకు సిఫారసు చేయగా, కేంద్రం వారి వ్యక్తిగత స్థితిగతుల ఆధారంగా వారిని అనర్హులుగా పేర్కొని తిప్పి పంపించింది. సామాజిక మాధ్యమాల్లో వారు వెలిబుచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఆర్ జాన్ సత్యన్, సోమశేఖర్ సుందరేశన్‌ల పేర్లను ప్రభుత్వం తిరస్కరించినట్టు స్పష్టపడుతున్నది. ఒక వెబ్ సైట్‌లో ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ వచ్చిన వ్యాసాన్ని ఇతరులతో పంచు(షేర్) కోడమే సత్యన్ చేసిన నేరం. అలాగే ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొన్న చొరవలను, అనుసరిస్తున్న విధానాలను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెట్టడం సోమశేఖర్ సుందరేశన్ పేరు తిరస్కరించడానికి కారణంగా న్యాయశాఖ చూపించింది.

ఇందుకు సుప్రీం కొలీజియం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఇద్దరు న్యాయవాదులకు రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కు వుందని గట్టిగా స్పష్టం చేసింది. ఒక వ్యక్తికి తనను నియమించబోయే పదవిలో పని చేయగల సామర్థం, ప్రతిభ, శీల సమగ్రత వున్నాయా లేవా అనేదే ముఖమని అభిప్రాయపడింది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఒకేలా వుంటుందని, వారి వారి వ్యక్తిగత అభిప్రాయాల కారణంగా ఎవరినీ రాజ్యాంగ పదవుల్లో నియామకానికి తిరస్కరించరాదని చెప్పింది. న్యాయమూర్తులుగా నియామకాల విషయంలో కేంద్రం సంకుచిత కారణాలు చూపించి తిరస్కరిస్తున్నదని సందేహాతీతంగా రుజువైంది. అటువంటి ప్రభుత్వం తన ప్రతినిధులను కూడా కొలీజియంలో చేర్చుకోవాలని తాజాగా ప్రతిపాదించింది.

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఈ మధ్య ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. కొలీజియంకు బదులు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ పట్టు, అదుపాజ్ఞలు వుండే న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి)ను పునరుద్ధరిస్తే ఉన్నత న్యాయమూర్తులుగా ఎటువంటి వారు నియమితులవుతారో దీనిని బట్టి ఊహించవచ్చు. అందుకే మన పౌర సమాజం పూర్తి పరిణతిని సాధించని కారణంగా న్యాయమూర్తుల నియామక విషయాల్లో రాజకీయ అధినేతలతో చర్చించడం, సంప్రదించడం సరైనది కాదని ఎన్‌జెఎసిని రద్దు చేస్తూ 2015 లో ఇచ్చిన తీర్పులో రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

న్యాయ వ్యవస్థ కంటే ప్రజలెన్నుకునే పార్లమెంటే గొప్పదని, అది రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేసిన ఎన్‌జెఎసి వ్యవస్థను రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ చేసిన విమర్శ నిలబడదు. ఎందుకంటే పార్లమెంటు గాని, సుప్రీంకోర్టు గాని ప్రజలు కోరి నిర్మించుకొన్న రాజ్యాంగానికి లోబడవలసినవే. అందుచేత రాజ్యాంగ ధర్మాసనం ఎన్‌జెఎసిని రద్దు చేస్తూ కొలీజియంను తిరిగి నెలకొల్పడంలోని విజ్ఞతను అందరూ గ్రహించి తీరాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News