2023లో తొమ్మిది రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికలకు కీలకం కావడంతో వాటన్నింటిలో గెలుపు సాధించాలని తాజాగా ఢిల్లీలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలలో పార్టీ నేతలు పిలుపిచ్చారు. ఈ సందర్భంగా 2024 ఎన్నికలకు 400 రోజులు ఉన్నాయని, ఇంకేమాత్రం ఏమరుపాటు లేకుండా ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేశారు. ఆ మరుసటి రోజే ఖమ్మంలో జరిగిన బిఆర్‌ఎస్ ఆవిర్భావ బహిరం సభలో రోజులు లెక్కబెడుతున్నారంటే తమ ప్రభుత్వానికి రోజులు దగ్గరకొచ్చాయని చెప్పడమే అంటూ పలు పక్షాల నేతలు ఎద్దేవా చేయడం వేరే విషయం. అయితే ఈ తొమ్మిది రాష్ట్రాలలో బిజెపికి అత్యంత కీలకమైనవి. మరో నాలుగు నెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల ఫలితాలు 2024 ఎన్నికలపై నిర్ణయాత్మకంగా ఉండే అవకాశం ఉంది.
అంతేకాదు, బిజెపి నేడు సంస్థాగతంగా ఎదుర్కొంటున్న గందరగోళ పరిస్థితులను కర్ణాటక ప్రధానంగా అద్దం పడుతున్నది. అక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుండి కన్నా సొంత పార్టీ వర్గాల నుండే కీలక సవాళ్లు ఎదుర్కొంటున్నది. బిజెపి ఓటమికి కాంగ్రెస్ కన్నా అంతర్గత శక్తులే ఎక్కువగా దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్‌కె అద్వానీ బిజెపి ఓ ‘భిన్నమైన’ పార్టీగా చెప్పుతూ ఉండేవారు. ఇతర పార్టీల మాదిరిగా నాయకత్వంపై కాకుండా సైద్ధాంతిక బలం, పార్టీ నిర్మాణంపై ఆధారపడి ఉండెడిది. నాయకులతో సంబంధం లేకుండా పార్టీ కోసం, నిస్వార్ధంగా పని చేసే కార్యకర్తల బలం ఉండెడిది. అయితే సుమారుగా గత తొమ్మిదేళ్లుగా పార్టీ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. భావాత్మక అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యత సైద్ధాంతిక పటుత్వం, సంస్థాగత నిర్మాణంకు ఇవ్వడం లేదు.
ఇప్పుడు బిజెపి దేశ వ్యాప్తంగా వ్యాపించినా ఇంకా ‘ఉత్తరాది’ పార్టీగా మాత్రమే జనం చూస్తున్నారు. అందుకనే ఎంతో ప్రజాకర్షణ ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ స్వయంగా వారణాసి నుండి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయితే గాని తన నాయకత్వానికి పూర్తి ఆమోదం లభించకపోవచ్చని భావించినట్లు కనిపిస్తుంది. అయితే, ఉత్తరాదిన పార్టీ గెలుపొంద గల సీట్లకు పరిమితి ఏర్పడింది. ఇంకా తగ్గిపోవడమే గాని పెరిగే అవకాశం లేదు. అందుకనే 2014లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి అమిత్ షా దక్షిణాది, తూర్పు రాష్ట్రాలపై దృష్టి సారించారు. కేవలం కర్ణాటకలో మాత్రమే బిజెపి రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇతర దక్షిణాది రాష్ట్రాల వైపు చూస్తున్నా కర్ణాటకలో ప్రభుత్వం నిలబెట్టుకోవడం అత్యవసరం. లేనిపక్షంలో ప్రతికూల సంకేతాలు ఇతర రాష్ట్రాలలో పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉంది.
ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాలలో పని చేసిన విధంగా కేవలం ప్రధాని మోడీ ఆకర్షణతో దక్షిణ, తూర్పు రాష్ట్రాలలో గెలుపొందలేమని ఎన్నో ఎన్నికలు నిరూపించాయి. పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం, కర్ణాటక, కేరళ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాని విస్తృతంగా పర్యటించినా చెప్పుకోదగిన ఫలితాలు రాకపోవడం తెలిసిందే. కర్ణాటకలో ఇప్పటి వరకు జరిగిన పలు సర్వేలు బిజెపి విజయావకాశాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకు ప్రధాన కారణంగా ప్రభుత్వంపై, పలువురు మంత్రులపై చెలరేగుతున్న అవినీతి ఆరోపణలతో పాటు పార్టీ నాయకుల అంతర్గత కుమ్ములాటలు. మంత్రులను, చివరకు ముఖ్యమంత్రిని సహితం కొందరు ఎంఎల్‌ఎలు దారుణంగా విమర్శిస్తున్న అదుపు చేయలేకపోతున్నారు. బహుశా బిజెపి అధికారంలో ఉన్న మరో రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు లేవు. దేశం మొత్తమ్మీద బిజెపిలో జనాకర్షణ గల ఇద్దరు, ముగ్గురు నాయకులలో బిఎస్ ఎడ్యూరప్ప ఒకరు. అయితే ఆయనకు పార్టీలో బలమైన నాయకులే వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బహిరంగంగా ఆయనకు వ్యతిరేకంగా పని చేశారు. చివరకు వయసు చూపి ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి దింపే వరకు విశ్రమించలేదు.
అయితే, అది పార్టీకి ఆత్మహత్యా సదృశ్యం అని గ్రహించి ఆయన చెప్పిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడంతో పాటు ఆయన వయసును లెక్కచేయకుండా పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా చేశారు.ఇప్పుడు దేశంలో ముఖ్యమంత్రులుగా ఉన్న బిజెపి నేతలు అందరిలో సౌమ్యుడిగా, మంచి రాజకీయ నేపథ్యం గల నేతగా, విలువలకు నిలబడే నాయకుడిగా బసవరాజ్ బొమ్మై పేరొందారు. అయితే ఆయన మాటకు ప్రభుత్వంలో గాని, పార్టీలో గాని విలువ లేకుండా చేయడంతో ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయారు. ప్రజల నుండి తిరుగుబాటు వస్తుందనే భయంతో యడ్యూరప్పను పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా చేసినా, కర్ణాటకలోని పార్టీ వ్యవహారాలకు ఆయనను దూరంగా ఉంచుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఎన్నికలలో పార్టీ భారీ మూల్యం చెల్లించుకునే స్థాయికి తీసుకు వెళ్లే అవకాశం ఏర్పడవచ్చని పార్టీ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పైగా, బిజెపి సంస్థాగత వ్యవహారాలు చూసే జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ స్వరాష్ట్రం కావడంతో ఎన్నికలపై ఆయన ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది.
తమ పరిపాలన చూసి ఓట్లు అడిగే స్థితిలో నేడు దేశంలో ఏ ప్రభుత్వం కూడా కనిపించడం లేదు. అందుకనే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వచ్చి తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు రూ. 2,000 నగదు బదిలీ చేస్తామని ప్రకటించిన కొద్ది గంటలకే ఇప్పుడే ప్రతి బిపిఎల్ కుటుంబానికి రూ. 2,000 బదిలీ చేస్తామని రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ ప్రకటించారు. అంటే ఓటర్లను ఆకర్షించుకోవడంలో పోటీ పడుతున్నారు. యడ్యూరప్ప నిష్క్రమణ తర్వాత ప్రధానంగా నాయకత్వం సంక్షోభం బిజెపి ఎదుర్కొంటున్నది. ఇతర రాష్ట్రాలలోవలే కేవలం ప్రధాని మోడీని చూపి గెలుపొందే పరిస్థితులు దక్షిణాది రాష్ట్రాలలో లేవు. అందుకనే ఒక దశలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ కోసం విశేషంగా ప్రయత్నం చేశారు. ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పలుసార్లు దాడులు జరిపిన సందర్భంగా ‘మీరు బిజెపిలో చేరితే మాకు, మీకు ఈ ఇబ్బందులు ఉండవు గదా’ అని నేరుగా సంకేతం ఇచ్చినట్లు చెబుతున్నారు.
మరోవంక, గత ఐదేళ్లలో జెడిఎస్ నాయకుడు హెచ్‌డి కుమారస్వామి ప్రభావం తగ్గుముఖం పట్టడం కూడా బిజెపికి ఆందోళన కలిగించే అంశమే. జెడిఎస్ బలహీనమయ్యే నియోజక వర్గాలలో బలం పుంజుకొని అవకాశం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది. కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య, శివకుమార్‌ల మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న కుమ్ములాటలు నుండి ప్రయోజనం పొందవచ్చని బిజెపి అంచనా వేస్తుంది.అయితే, బిజెపిలో కుమ్ములాటలు అంతకన్నా తీవ్రస్థాయిలో ఉన్నాయని మరువలేరు.
ఇంకోవైపు, కర్ణాటక బిజెపి రాజకీయాలను గందరగోళం స్థితికి చేర్చిన, అక్రమ గనుల తవ్వకం కేసులు ఎదుర్కొంటున్న గాలి జనార్ధనరెడ్డి ఇప్పుడు సొంతంగా ఓ ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికలలో పోటీ చేయడం బిజెపికి మరో సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. బిజెపిలోని కొందరు కీలక వ్యక్తుల ప్రోత్సాహంతోనే వేరేకుంపటి పెట్టారనే ప్రచారం జరుగుతుంది. జనార్ధన రెడ్డి చీల్చే ఓట్లు ప్రత్యక్షంగా బిజెపికి నష్టం కలిగించే అవకాశం ఉంది. సొంతంగా ఎన్ని సీట్లు గెల్చుకుంటారో గాని, బిజెపిని బలహీనం చేయడం ద్వారా పరోక్షంగా కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చిన్నట్లు కాగలదు.
కర్ణాటక, మహారాష్ట్రల మధ్య తీవ్రరూపం దాల్చిన సరిహద్దు వివాదం సహితం బిజెపిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటువంటి వివాదాలకు రాజకీయ పరిష్కారాలు మాత్రమే మార్గం చూపగలవు. న్యాయస్థానాల ద్వారా పరిష్కారం సాధ్యం కాదు. కర్ణాటక, మహారాష్ర్టలతో పాటు కేంద్రంలో కూడా బిజెపి అధికారంలో ఉండడంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నం చేసి ఉండవలసింది. ఆ విధంగా చేయకుండా రెండు రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలు స్థానిక ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించాయి. ఆ విధంగా చేయడం ద్వారా గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలకన్నా భిన్నమైన రీతిలో వ్యవహరింపలేకపోయాయి. నేడు బిజెపి ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య పార్టీ సిద్ధాంతాల పట్ల అకుంఠిత కట్టుబాటు గల శ్రేణులలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది.
పార్టీ ప్రభుత్వం, నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారిపై వస్తున్న అవినీతి ఆరోపణలు, అన్నింటికీ మించి అధికారం రాగానే వారి జీవనశైలిలో వస్తున్న మార్పులను చూసి తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్, జెడిఎస్ నేతలు అంతకన్నా ఘోరంగా వ్యవహరించినా ‘వారంతే’ అని సరిపెట్టుకుంటారు. కానీ ఒక సైద్ధాంతిక నేపథ్యంలో గలవారు ఈ విధంగా వ్యవహరించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. సైద్ధాంతికంగా బిజెపికి దగ్గరైనవారు ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం లేకపోయినా, ఇటువంటి అసమ్మతి కారణంగా వారు ఓటుకు దూరంగా ఉండే ప్రమాదం ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలను ఢిల్లీ నుండి నడిపించే కీలుబొమ్మ ప్రభుత్వాలుగా విమర్శిస్తూ ఉండేవాళ్ళం.అయితే యడ్యూరప్ప వంటి విశేష ప్రజాబలం గల నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గం ఏర్పా టు చేసుకోవడానికి, ఎంఎల్‌సి వంటి చిన్న చిన్న పదవులను భర్తీ చేయడానికి ఢిల్లీ నుండి అనుమతులకు నెలల తరబడి ఎదురు చూడవలసి రావడం గమనిస్తే ‘రిమోట్ కంట్రోల్’ రాజకీయాల పరాకాష్ట వెల్లడవుతుంది.
చలసాని నరేంద్ర
9849569050