Monday, December 23, 2024

ఎల్లుండి నుంచి జెఇఇ మెయిన్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

రెండో రోజు పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల

హైదరాబాద్ : దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ తొలి విడత పరీక్షలు మంగళవారం(జనవరి 24) ప్రారంభం కానున్నాయి. శనివారం మొదటి రోజు పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేయగా, ఆదివారం రెండో పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) విడుదల చేసింది. మిగిలిన తేదీల్లో పరీక్షల అడ్మిట్ కార్డులను సోమవారం నుంచి విడుదల చేయనున్నట్లు ఎన్‌టిఎ తెలిపింది.

బిఇ,బి.టెక్ విభాగాల్లో జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్ష (పేపర్ 1, రెండు షిఫ్టుల్లో) ఈ నెల 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది. అలాగే, ఈ నెల 28న బి.ఆర్క్, బి.ప్లానింగ్ విభాగంలో పేపర్ -2ఎ, 2బి పరీక్ష మధ్యాహ్నం షిఫ్ట్ జరుగుతుందని పేర్కొంది. 24,25 తేదీలలో పరీక్ష జరిగిన అనంతరం మూడు రోజుల తర్వాత పరీక్షల జరగనుంది. దేశవ్యాప్తంగా మొత్తంగా 290 నగరాల్లో, దేశం వెలుపలి 25 నగరాల్లో జెఇఇ మెయిన్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఎన్‌టిఎ స్పష్టం చేసింది.

దేశంలోని ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జెఇఇ మెయిన్ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. మెయిన్‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ నిర్వహిస్తారు. అందులో వచ్చే ర్యాంకు ఆధారంగా ఐఐటిలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది జెఇఇ మెయిన్ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తున్న ఎన్‌టిఎ, రెండో విడత పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించనుంది.

అడ్మిట్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకునే విధానం

తొలుత jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
– ‘ అడ్మిట్ కార్డు లింక్‌ను క్లిక్ చేయాలి.
– విద్యార్థి రిజస్టర్డ్ ఐడీ, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాలి.
– జెఇఇ మెయిన్ అడ్మిట్ కార్డు స్ట్రీన్‌పై కనబడుతుంది.
– ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కార్డుపై విద్యార్థి పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ఏవైనా సమస్యలు ఉంటే 011 – 40759000 ఫోన్ లేదా jeemain@nta.ac.in మెయిల్ ద్వారా ఎన్‌టిఎ అధికారులను సంప్రదించాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News