న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ ఐటి కంపెనీలు కూడా లేఆఫ్(ఉద్యోగుల తొలగింపు) జాబితాలో చేరాయి. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జనవరిలో ఇప్పటివరకు చూస్తే, రోజుకు సగటున 3000 టెక్ ఉద్యోగులను ఇంటికి పంపారు. ప్రపంచ ఆర్థిక మందగమనం, మాంద్యం భయాల నేపథ్యంలో ఈ ఉద్యోగుల తొలగింపు ఎపిసోడ్ మరింత ఊపందుకుంది. ఇప్పటి వరకు 166 టెక్ కంపెనీల్లో 65 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కూడా తన వర్క్‌ఫోర్స్‌లో 6 శాతం మంది సిబ్బందిని, అంటే 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
గత వారం మైక్రోసాఫ్ట్ చైర్మన్, సిఇఒ సత్యనాదెళ్ల మాట్లాడుతూ, కంపెనీలో మార్పులు చేపడుతున్నామని, దీని ఫలితంగా మొత్తం ఉద్యోగుల్లో 10 వేల మందిని మూడో త్రైమాసికం ముగింపునాటికి తొలగించనున్నామని అన్నారు. అంతకుముందు అమెజాన్ కూడా 18 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించగా, దీనిలో దాదాపు 1000 మంది భారత్‌కు చెందినవారు ఉన్నారు. గతేడాదిలో(2022) దాదాపు 1000 కంపెనీలు సుమారు 1,54,336 మంది ఉద్యోగులను తొలగించాయి. ఈమేరకు లేఆఫ్ ట్రాకింగ్ సైట్ లేఆఫ్.ఎఫ్‌వైఐ డేటా తెలిపింది. గతేడాదిలో టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల లేఆఫ్‌లు కనిపించగా, ఇది 2023 సంవత్సరంలోనూ కొనసాగుతోంది. ఉద్యోగులను తొలగించిన సంస్థల్లో భారతీయ కంపెనీలు, స్టార్టప్‌లు కూడా ఉన్నాయి.
భారత్‌లో కంపెనీల తొలగింపులివే..
అనిశ్చితి మార్కెట్ పరిస్థితుల కారణంగా దేశీయ సోషల్ మీడియా సంస్థ షేర్‌చాట్(మోహల్లా టెక్ ప్రై.లి) దాదాపు 20 శాతం ఉద్యోగులను, అంటే 500 మంది సిబ్బందిని తొలగించింది.
అంతర్గత అసెస్‌మెంట్ టెస్ట్‌లలో పనితీరు సరిగ్గా లేకపోవడంతో ఐటి దిగ్గజం విప్రో 400 మంది ఫ్రెషర్ ఎంప్లాయీస్‌ను ఇంటికి పంపింది.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా బిజినెస్ నెమ్మదించడంతో 380 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు నిర్థారించింది.
ఎండ్ టు ఎండ్ డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ మెడిబుడ్డీ భారత్‌లో సుమారు 8 శాతం మంది ఉద్యోగులను అంటే 200 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
క్యాబ్ సేవల సంస్థ ఓలా 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
కాస్ట్ కటింగ్‌లో భాగంగా దేశీయ క్విక్ గ్రాసరీ డెలివరీ సంస్థ డుంజో 3 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని చెప్పింది.
సైబర్ సెక్యూరిటీ కంపెనీ సోఫోస్ 450 మంది ఉద్యోగులను భారత్ నుంచి తొలగించింది. ఇది వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం ఉంటుంది.