న్యూస్‌డెస్క్: తెలంగాణ వంటలంటే తనకు భయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కర్లీ టేల్స్ అనే ఫుడ్ అండ్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌తో ఇష్టాగోష్ఠిగా రాహుల్ మాట్లాడారు. భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో సాగినపుడు తన కంటెయినర్ వెలుపల ఆయన ఇచ్చిన ఇంటర్వూ వీడియోను కాంగ్రెస్ అదివారం తన అధికారిక సామాజిక మాధ్యమంలో విడుదల చేసింది. తన ఆహారపు అలవాట్లు, తన ఇష్టాయిష్టాల గురించి రాహుల్ ఈ ఇంటర్వూలో మాట్లాడారు. తెలంగాణ వంటలు చాలా కారంగా ఉంటాయని రాహుల్ చెప్పారు. తెలంగాణ వంటల్లో కారం నషాలాని కంటుతుందని, తాను కారం ఎక్కువగా తిననని ఆయన చెప్పారు.
తాను ఆహారం గురించి పెద్దగా పట్టించుకోనని, అయితే బఠానీ, పనస పండు అంటే తనకు ఇష్టం లేదని ఆయన తెలిపారు. తాను ఇంట్లో మాత్రం కచ్ఛితంగా డైట్ పాటిస్తానని ఆయన అన్నారు. ఇంట్లో మధ్యాహ్నం లంచ్ దేశీ వంటకాలే ఉంటాయని, రాత్రి డిన్నర్ మాత్రం కాంటినెంటల్ ఫుడ్ ఉంటుందని ఆయన తెలిపారు. స్వీట్లు తాను పెద్దగా ఇష్టపడనని ఆయన వివరించారు. తాను మాంసాహారిగా ఉండటానికే ఇష్టపడతానని, చికెన్, మటన్, సీఫుడ్ వంటివన్నీ ఇష్టంగా తింటానని రాహుల్ చెప్పారు. ప్రత్యేకంగా చికెన్ టిక్కా, సీక్ కబాబ్, ఎగ్ ఆమ్లెట్ అంటే ఇష్టమని ఆయన చెప్పారు. ఢిల్లీలో మోతీ మహల్, సాగర్, స్వాగత్, శరవణ భవన్ తనకు ఇష్టమైన హోటళ్లని ఆయన తెలిపారు.