Friday, December 20, 2024

అమెజాన్ ఇష్క్ హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

ఎవియేషన్ రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెం దుతున్నదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ రంగంలో పెట్టుబడులను ప్రభుత్వం పె ద్దఎత్తున ప్రొత్సహిస్తోందన్నారు. ఫలితంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ పోర్ట్‌గా నిలిచిందన్నారు. హైదరాబాద్ గ్రీన్‌సిటి అవార్డును సైతం సొంతం చేసుకుందన్నారు. ఇన్నోవేషన్ ఇండెక్స్ లో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందన్నారు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో అమెజాన్ ఎయిర్ కార్గో విమానమైన ప్రైమ్ ఎయిర్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్‌లో అమెజాన్ తన వ్యాపారాన్ని చాలా వేగంగా విస్తరిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా బుకింగ్‌ను డెలివరీ చేసేందుకుగాను తాజాగా అమెజాన్ ప్రైమ్ ఎయిర్‌ను భారత్‌లో లాంచ్ చేసిందన్నారు.

ఈ సేవలను అమెరికా, యూరప్ తర్వా త హైదరాబాద్‌లో ప్రారంభించడం విశేషమన్నారు. ఇందుకు అమెజాన్ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రైమ్ ఎయిర్‌ను అందిస్తోన్న మూడో దేశంగా భారత్ అందులో పట్టణంగా హైదరాబాద్ ఉండడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. ఇక అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రూ.36,300 కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత విధానాల కారణంగానే దేశ, విదేశాలకు చెందిన బడా వ్యాపార వేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. దీని కారణంగానే గత ఏడేండ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఇటీవల తన దావోస్ పర్యటనలో సుమారు రూ.21వేల కోట్ల మేరు పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్‌తో అమెజాన్ లవ్‌స్టోరీ దినదినం అభివృద్ధి చెందుతోందని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

అంతకుముందు ఏరోస్పేస్ రంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను ఈ సందర్భంగా కెటిఆర్ వివరించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ప్రభుత్వం నుంచి ఏరోస్పేస్‌కు ఉత్తమ రాష్ట్ర అవార్డును గెలుచుకున్నదన్నారు. హైదరాబాద్‌లో ఎయిర్ కార్గో ట్రాఫిక్ కూడా 2021లో వాల్యూమ్‌లలో 35 శాతం వృద్ధిని సాధించిందన్నారు. హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఒక కొనసాగుతోంది. కారణంగానే ప్రతి సంవత్సరం అవార్డులను గెలుచుకుంటుందన్నారు. ఇక 2014 నుంచి రాష్ట్రంలో తలసరి రెండింతలు పెరిగిందన్నారు. 1.24 లక్షల నుండి 2.78 లక్షలకు చేరిందన్నారు. ఫలితంగా ప్రపంచ బ్యాంకు,భారత ప్రభుత్వం సంయుక్తంగా అందించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో మొదటి మూడు రాష్ట్రాలలో తెలంగాణ స్థానం సంపాదించుకుందని కెటిఆర్ వివరించారు.
ఇక శరవేగంగా కార్గో డెలివరీలు
వాయువేగంతో వ్యాపారంలో ముందుకు సాగేందుకు అమెజాన్ బెంగుళూరుకు చెందిన కార్గో ఎయిర్‌లైన్ క్విక్జెట్‌తో జతకట్టిందని కెటిఆర్ తెలిపారు. అలా కంపెనీ తన తొలి ఎయిర్ ఫ్రైట్ సర్వీసును ప్రారంభించిందని పేర్కొన్నారు. డెలివరీల కోసం ప్రత్యేకమైన ఎయిర్ నెట్‌వర్క్‌ను అందించడానికి థర్డ్-పార్టీ క్యారియర్‌తో భాగస్వామిగా మారిన ఈ-కామర్స్ కంపెనీగా అమెజాన్ మారిందన్నారు. ఇందులో భాగంగా ఈ..-కామర్స్ దిగ్గజం బోయింగ్ 737-…800 విమానాల పూర్తి కార్గో సామర్థ్యాన్ని ఉపయోగించాలని నిర్ణయించిందన్నారు. దీని ద్వారా ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో వేగవంతమైన డెలివరీలను అందించే అవకాశం ఉందన్నారు. కంపెనీ ప్రారంభిస్తున్న ఈ… సర్వీస్ రవాణా నెట్‌వర్క్‌ను మెరుగుపరచటంతో పాటు డెలివరీల వేగవంతాన్ని సులభతరం చేస్తుందన్నారు. ప్రస్తుతం అమెజాన్ ఎయిర్ ప్రస్తుతం రెండు కార్గో సర్వీసులను మాత్రమే నడుపుతోందని, వీటి సంఖ్యను మరింతగా పెంచాలని మంత్రి కెటిఆర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News