న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ సర్జికల్ దాడులను ప్రశ్నించారు. సర్జికల్ స్రైక్స్‌పై కేంద్రం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని సోమవారం విమర్శించారు. జమ్ము కాశ్మీర్లో భారత్ యాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సమావేశంలో మధ్యప్రదేశ్ మాజీ సిఎం దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి విమానాల ద్వారా ప్రయాణించేందుకు సిఆర్‌పిఎఫ్ ప్రభుత్వాన్ని కోరినా అంగీకరించలేదు.
దీంతో పుల్వామాలో 2019లో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సైనికులు అమరులయ్యారు. జవాన్ల ప్రాణత్యాగానికి కారణమని ఆయన ఆరోపించారు. సర్జికల్ దాడులు జరిపి చాలామందిని హతమార్చామని చెపుతోంది. అయితే తగిన సాక్ష్యాలు మాత్రం అందజేయడం లేదు. సర్జికల్ స్ట్రైక్స్‌పై అబద్ధాలను ప్రచారం చేస్తూ పాలిస్తున్నారని అధికార బిజెపిపై ఎంపి మాజీ ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యలపై బిజెపి తీవ్రంగా స్పందించింది. ప్రధానమంత్రి మోడీపై ఉన్న ద్వేషంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ భద్రతా బలగాలను అవమానపరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో మాత్రమే రాహుల్‌గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. కానీ పార్టీ నేతలు దేశాన్ని విడదీసేందుకు పనిచేస్తున్నారు. రాహుల్ చేస్తన్న యాత్ర భారత్ జోడో యాత్ర కాదు భారత్ తోడో యాత్ర అని బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తెలిపారు.
సాయుధ బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశం సహించదని గౌరవ్ అన్నారు. కాగా, పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపు దాడులు చేసినట్లు భారత వైమానిక దళం ప్రకటించింది. ఈనేపథ్యంలో బిజెపి 2019లోక్‌సభ 300స్థానాలకు పైగా గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది.