హైదరాబాద్: ప్రస్తుత రోజుల్లో సైబర్ సెక్యూరిటీ ఎంత బలంగా ఉన్నా తరచూ కొందరి సోషల్ అకౌంట్లను హ్యాకర్లు హ్యాక్ చేస్తూనే ఉంటారు. సంస్థలు, ప్రముఖ వ్యక్తులు దీనికి అతీతమేమీ కాదు. ఇప్పుడీ ఖాతాలో టిఎస్ఆర్టిసి కూడా చేరింది. ఆదివారం రాత్రి 9:30 టిఎస్ఆర్టిసి@ టిఎస్ఆర్టిసి ఎండిఆఫీసు ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు ఆర్టిసి యాజమాన్యం ప్రకటించింది. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించడానికి ట్విట్టర్‌తో కలిసి మాట్లాడామని సోమవారం తెల్లవారుజామున సమస్య పరిష్కారమైందని వెల్లడించింది. ప్రస్తుతం ఆర్టిసి ట్విటర్ ఖాతా యధావిధిగా పనిచేస్తుందని ఆర్టిసి స్పష్టం చేసింది.
ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన వారిని మాత్రం ఇంకా గుర్తించలేదు. ప్రయాణికుల నుంచి సూచనలు, సలహాలు, ఆర్టిసిలో ఎదురయ్యే ఇబ్బందులు, సంస్థ అభివృద్ధికి ఉపయోగపడే సలహాలు, సంస్థ లోపాలపై ఫిర్యాదులు సేకరించడానికి టిఎస్ఆర్టిసి ఎండి విసి సజ్జనార్ ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. ఆర్టీసీ పరంగా ఏమైనా లోపాలు ఉంటే ట్విటర్ ఖాతా ద్వారా ఆన్లైన్ తెలియజేయవచ్చని గతంలో సూచించారు. ప్రస్తుతం లక్షా 13వేల 6 మంది ఈ ఖాతాను పాలో అవుతున్నారు.