Wednesday, December 25, 2024

కేంద్రం పై కెసిఆర్ దుష్ప్రచారాన్ని ఎండగట్టాలి : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

భారత్‌ రాష్ట్ర సమితి వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే దిశగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మహబూబ్​నగర్‌లోని ఓ ప్రైవేటు గార్డెన్‌ వేదికగా మొదటి రోజు బండి సంజయ్ అధ్యక్షతన పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. కార్యవర్గ సమావేశంలో చర్చించే అంశాలు, ముసాయిదా తీర్మానాలపై చర్చించారు.

బండి సంజయ్ పదాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున పెద్దఎత్తున ఉద్యమించేలా కార్యక్రమాలు రూపొందించాలని కోరారు. కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదన్న కెసిఆర్ దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని కోరారు. పాదయాత్ర ద్వారా ప్రజల దృష్టిని బిజెపి ఆకర్షించిందని ఇకపై స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. బిఆర్​ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మోదీ ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాబోయే 3 నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణపైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఫిబ్రవరిలో 15 రోజులపాటు.. 9వేల శక్తి కేంద్రాల పరిధిలో కనీసంగా 200 మందితో వీధికూడలి సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కెసిఆర్ కుటుంబం అవినీతి నియంత పాలన, ప్రజలు కష్టాలను ఆ సమావేశాల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని గుర్తించి, మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వీధికూడలి సమావేశాలు జరగనున్నాయని, ఈ మేరకు రాష్ట్ర, అసెంబ్లీ స్థాయిలో సమస్యలను గుర్తించి కరపత్రాలు రూపొందించనున్నట్లు తెలిపారు.

ఒక్కొక్కరు 15 సమావేశాల చొప్పున 600మంది వక్తలను, 119 నియోజకవర్గాల్లో సామాజిక మాధ్యమాల ఇంఛార్జ్‌లను గుర్తించి కార్యశాల ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ నెల 28, 30, 31 తేదీల్లో అన్ని జిల్లాల కార్యవర్గ సమావేశాలు, ఫిబ్రవరి 5వ తేదీలోపు మండల కార్యవర్గ సమావేశాలను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో కనీసంగా 5 పాఠశాలల్లో ఈ నెల 27న పరీక్షా పే చర్చా నిర్వహించాలని వివరించారు. ఈ నెల 27న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని 900 మండలాల్లో చేపట్టాలని, తర్వాత శక్తి కేంద్రం, బూతు స్థాయిలో నిర్వహించాలని, ఏప్రిల్ నాటికి.. ప్రతి బూత్​లో నిర్వహించేలా విస్తరించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నిర్దేశించారు.

ఎన్నికలకు 9 నెలలు మాత్రమే సమయం ఉన్నందున ప్రతి 3 నెలలకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. తొలి 3నెలలు బూత్ కమిటీల నిర్మాణం పూర్తి చేసి వాటిని క్రీయాశీలం చేయడం తర్వాత మండల స్థాయి కార్యక్రమాలు చేపట్టాలని నిర్దేశించారు. రెండోదశలో నియోజకవర్గం నుంచి బూత్ స్థాయి వరకూ విస్తృత ప్రజా ఆందోళనలు మాస్ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మోదీ సర్కారుకు ధన్యవాదాలు తెలపడంతో పాటు మేధావులు, విద్యావేత్తలు, వైద్యులు, ఆచార్యులతో సదస్సులు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. పదాధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సహా రాజకీయ, వ్యవసాయ ముసాయిదా తీర్మానాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎస్సీ-ఎస్టీ-బీసీ వర్గాల సమస్యలపై ఇవాళ జరిగే కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు.

తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులు, రాష్ట్రానికి ప్రత్యేకంగా మంజూరు చేసిన పనులు, కార్యక్రమాలపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. ఇవాళ జరిగే సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బిజెపిరాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్.. బిజెపిజాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News