Saturday, January 18, 2025

ఓటరు విజ్ఞతే ప్రజాస్వామ్యానికి రక్ష

- Advertisement -
- Advertisement -

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. ఇది దేశం దశ దిశను మార్చే అస్త్రం. ఓటు అనే రెండక్షరాలకు దేశ పరిపాలన గతిని మార్చే శక్తి ఉంది. కేంద్ర, రాష్ట్ర చట్టసభలలో, స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులకు ఓటు హక్కు నాంది పలికింది. బ్రిటిష్ పాలనలో పరిమిత స్థాయిలోనే భారతీయులకు ఓటు హక్కు కల్పించబడింది. 1909 మింటో- మార్లే సంస్కరణల చట్టం కొద్ది మంది ఉన్నత సంపన్న వర్గాల వారికి ఓటు హక్కు కల్పించింది. 1919 లో అమల్లోకి వచ్చిన మౌంటెంగ్ -చెమ్స్ ఫర్డ్ సంస్కరణలు ఓటు హక్కును కొంతమేర విస్తృత పరిచాయి. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఓటు హక్కును 10.6 శాతం ప్రజలకు పెంచారు. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల సందర్భంగా 28.5 శాతం భారత పౌరులకు దీనిని విస్తరింపచేశారు. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగం పౌరులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది.

ప్రజాస్వామ్యానికి మూలమైన సమానత్వ సూత్రాన్ని అనుసరించి రాజ్యాంగంలోని 326 అధికరణం కింద కుల, మత, జాతి, వర్గ, లింగ విచక్షణ లేకుండా వయోజనులైన భారతీయ పౌరులందరికీ ఓటు హక్కు కల్పించబడింది. దేశంలో 1950 నుండి అమలులోకి వచ్చిన సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఎంతో విప్లవాత్మకమైనది. భారతదేశంలో ఓటు హక్కు అమలులోకి వచ్చే నాటికి అనేక దేశాల్లో కొన్ని వర్గాల వారికే ఓటు హక్కు ఉండేది. భారత రాజ్యాంగ నిర్మాతలు దూర దృష్టితో ఓటు హక్కును వయోజనులందరికీ కల్పించడం భారతీయ ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ప్రారంభం లో 21 ఏళ్లు నిండిన యువతి, యువకులకు ఓటు హక్కు ప్రసాదించబడింది. 1988లో 61 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు పయో పరిమితిని 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు కుదించారు.

దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ద్వారా 1950 జనవరి 25న భారత ఎన్నికల కమిషన్ ఏర్పాటు అయింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో వయోజన ఓటు హక్కు ప్రాతిపదికగా మొదటి సారిగా సాధారణ ఎన్నికలు దేశ వ్యాప్తంగా 1951- 52 లోకసభకు, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం 2011లో నిర్ణయించింది. 2010 జనవరి 25 నాటికి ఎన్నికల సంఘం ఏర్పాటు కాబడి 60 ఏళ్లు నిండిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం 2011 జనవరి 25 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం ఏర్పాటును గుర్తుకు తేవడం, ఓటు హక్కు ప్రాధాన్యత, సక్రమ వినియోగం, ఎన్నికలపై అవగాహన, 18 ఏళ్ల వయోజనులు ఓటరుగా నమోదు మొదలగు లక్ష్యాలతో జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతి ఏటా నిర్వహించబడుతోంది.

భారత ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విజయం, పటిష్టత ఎన్నికలలో ఓటరు ప్రవర్తన పైనే ఆధారపడి ఉంది. ప్రజలు తమ ప్రతినిధులను ఐదేళ్ల నిర్ణీత కాలానికి ఎన్నుకొని చట్టసభలకు పంపుతున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతుల్లో దేశ భవిష్యత్తును, తమ భవిష్యత్తును ఓటర్లు పెడుతున్నారు. నిజాయితీపరులు, సమర్ధులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్ల పైనే ఉంది. అటువంటి వారిపైనే దేశ భవిష్యత్తుకు, తమ భవిష్యత్తుకు ఎటువంటి ప్రమాదం ఉండదని గుర్తెరగాలి. నేరగాళ్లకు, లంచగొండులకు, అవినీతిపరులకు, ఫిరాయింపుదారులకు చట్టసభల్లో స్థానం కల్పిస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఓటరు తన ఓటును నిజాయితీతో, విజ్ఞతతో వినియోగించినప్పుడే దానికి సార్ధకత చేకూరి, ప్రగతికి ఆధారమవుతుంది.

ఎన్నికల కమిషన్ ఓటింగ్ శాతాన్ని పెంపొందించడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్న ప్రయోజనం కనిపించడం లేదు. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికల్లో 67 శాతం మాత్ర మే ఓటింగ్ నమోదయింది. దేశంలో ప్రజాస్వామిక ఫలాలు అధికంగా అనుభవిస్తున్న విద్యావంతులు, పట్టణ ప్రాంతాలు, మహానగరాల్లోని సంపన్న వర్గాలు ఓటింగ్ పట్ల అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీనికి భిన్నంగా ప్రజాస్వామ్య ప్రయోజనాలకు దూరంగా ఉన్న వర్గాల ప్రజలే ఓటు వేయడానికి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నారు. అనేక దేశాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పనిసరి. బెల్జియం, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఓటు వేయనట్లయితే జరిమానాలు విధిస్తారు. భారత దేశంలో కూడా నిర్బంధ ఓటింగ్ విధానం ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. తప్పనిసరిగా అందరూ ఓటింగ్ లో పాల్గొంటారు. ఫలితంగా ఎన్నికల్లో ప్రభావం చూపుతున్న కులం, మతం, ధనం లాంటి అంశాల ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ఓటు విలువ తెలియక కొంత మంది ఓటింగ్‌కు దూరం అవుతుంటే, ఓటు ప్రాముఖ్యత తెలిసినా నిర్లక్ష్యంతో మరికొంత మంది ఓటు వేయటానికి అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో, విద్యావంతులు నివసించే ప్రాంతాల్లో 50 శాతం ఓటు నమోదు కావడమే గగనమైపోతోంది. అభ్యర్థులు ఎవరూ నచ్చక ఓటు వేయడానికి దూరంగా ఉండే వాళ్ళని పోలింగ్ కేంద్రాలకు రప్పించడానికి ఎన్నికల సంఘం ‘పై అభ్యర్థులు ఎవరూ కాదు (None of the above- NOTA) ఆప్షన్ చేర్చిన ప్రయోజనం కానరావడం లేదు.

ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఉన్నతమైన చట్టసభలలో నిజాయితీపరులు, సమర్ధులు, సేవా గుణం ఉన్నవారు పోటీ చేసి గెలుపొందడం వల్ల రాజ్యాంగ నిర్మాతలు కలలు కన్న దేశ భవిష్యత్తుకు, సమాజ నిర్మాణానికి పునాదులు పడతాయి. దురదృష్టవశాత్తు స్వాతంత్య్రం సిద్ధించి నాలుగు దశాబ్దాల తర్వాత రాజకీయాలలో నేర స్వభావం ఉన్న వారి ప్రమేయం పెరుగుతూ వస్తోంది. నేడు రాజకీయాలలో సచ్ఛీలురులకు స్థానమే లేకుండాపోతోంది. నేరచరిత్ర కలిగిన వారు పార్లమెంటుకు, వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికయ్యే సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. 2004లో లోకసభకు ఎన్నికైన వారి లో 24 శాతం సభ్యులపై క్రిమినల్ కేసులు ఉండగా, 2009లో ఆ సంఖ్య మరో ఆరు శాతానికి పెరిగి 30 శాతానికి పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత లోకసభలో 43 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫారమ్స్ (ఎడిఆర్) జరిపిన అధ్యయనంలో వెల్లడింది.

మొత్తం 533 మంది లోక్‌సభకు ఎన్నిక కాగా ఇందులో 233 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. నేర చరితులు, కార్పొరేట్లు, పార్టీ ఫిరాయింపుదారులు చట్టసభలకు ఎన్నికైతే ప్రజాసేవను పక్కనపెట్టి చేసిన నేరాల నుంచి బయట పడటానికి, ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి, అక్రమ ఆస్తులు పోగేసుకోవడానికి తమ పదవులు వాడుకుంటూ చట్టసభల విశిష్టతను దెబ్బ తీయటానికి ఆస్కారం ఉంది. దేశంలో తాజా, మాజీ ఎంపిలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4442 కేసులు ఉన్నట్లు సుప్రీంకోర్టు 2020 సెప్టెంబర్‌లో ఓ నివేదిక ద్వారా తెలిపింది. దేశంలో పార్టీ ఫిరాయింపులు పెరిగిపోయి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. 2016- 20 సంవత్సరాల మధ్య 433 మంది ఎంపిలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారినట్లు వీరిలో 405 మంది ఎమ్మెల్యేలు, 12 మంది లోకసభ సభ్యులు, 16 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని ఎన్నికల సంస్కరణలు సూచించే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫారమ్స్ (ఎడిఆర్) నివేదిక స్పష్టం చేసింది. 2016- 2020 మధ్యకాలంలో మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటకలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు పడిపోవడానికి ఎమ్మెల్యేల ఫిరాయింపులే ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది.

భారత ఎన్నికల సంఘం ఏర్పాటై 70 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దాని పని విధానం, స్వయం ప్రతిపత్తిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 1990 -1996 మధ్య టిఎన్ శేషన్ మాత్రమే ఆరు సంవత్సరాలు సిఇసిగా ఉన్నారు. అనంతరం వచ్చిన ఏ వ్యక్తిని కూడా ఆరేళ్ల పూర్తి పదవి కాలానికి ఎంపిక చేయలేదు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమకు నచ్చిన వారిని ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సంఘం దేశంలో, వివిధ రాష్ట్రాలలో శాంతి భద్రతల పేరుతో ఎన్నికలు జరిగే తేదీలను, విడతలను నిర్ణయించడంలో అధికార పార్టీల ఆదేశాలకు అనుగుణంగానే నిర్ణయాలు జరుగుతున్నట్టు పలువురు భావిస్తున్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం సరికాదని కొలీజియం లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుత వ్యవస్థలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే తమకు అనుగుణంగా వ్యవహరించే వ్యక్తిని సిఇసిగా నియమిస్తోందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా 2022 డిసెంబర్ 31న పదవీ విరమణ చేయాల్సిన అరుణ్ గోయల్ నవంబర్ 18న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మరునాడే ఎన్నికల కమిషనర్‌గా నియమించబడిన విధానాన్ని జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తప్పు పట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రధానిపై సైతం చర్యలు తీసుకునేంత సత్తా ఉన్నవారే ఎన్నికల కమిషనర్ గా రావాలని అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా, స్వతంత్ర ప్రతిపత్తితో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికలలో పెరిగిపోతున్న కుల, మత, ధన ప్రాబల్యాన్ని, హింసను నిరోధించి మన ప్రజాస్వామ్య ప్రాభవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది.

బిల్లిపల్లి లక్ష్మారెడ్డి
9440966416

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News