జగిత్యాల : జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించి జిల్లా కలెక్టర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన శ్రావణి ఎంఎల్ఎ సంజయ్‌కుమార్ వేధింపులు భరించలేకనే తన పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తాను చైర్‌పర్సన్ పదవి చేపట్టిన మూడేళ్ల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, అడుగడుగునా వేధింపులకు గురైనట్లు మీడియా ఎదుట కంటతడి పెట్టుకున్నారు. ఎన్ని అవమానాలకు గురి చేసినా జగిత్యాల పట్టణ అభివృద్దే లక్షంగా ముందుకు సాగినట్లు వివరించారు. పేరుకే చైర్‌పర్సన్‌గా ఉన్నానే తప్పా పెత్తనమంతా ఎమ్మెల్యేదేనని, ఏ ఒక్క అభివృద్ది పనిని కూడా నా చేతుల మీదుగా ప్రారంభించకుండా అడ్డుపడ్డారని ఆమె ఆరోపించారు.
ఏదైనా సమావేశంలో తాను స్వతంత్రంగా మాట్లాడే స్వేచ్చ కూడా ఇవ్వలేదని, ఎమ్మెల్యే ఇచ్చిన స్క్రిప్ట్‌ను మాత్రమే చదివేలా పరిమితి విధించారన్నారు. పట్టణంలోని సమస్యలను తెలుసుకునేందుకు తాను వార్డు సందర్శన చేస్తే కూడా సహించే వారు కాదని, నాకు చెప్పకుండా ఎలా సందర్శన చేస్తావంటూ తనను ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మానసిక క్షోభకు గురి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే పదవి ముందు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి అనేది చాల చిన్నదని, ఆ విషయాన్ని తెలుసుకుని మసులుకోవాలని కట్టడి చేసేవారని, జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ను కలవాలంటే నీ ప్రొటోకాల్ సరిపోదని తనపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వాపోయారు. మా వల్ల ఏదైనా తప్పు జరిగితే చెప్పాలని, తాము సరిదిద్దుకుంటామని వేడుకున్నా తమను కార్నర్ చేసి మానసికంగా హింసించారని ఆరోపించారు.
కౌన్సిలర్ల చేత అవిశ్వాసం అనే డ్రామా ఆడించింది కూడా ఎమ్మెల్యేనని, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చేయడం తగదన్నారు. బీసీ బిడ్డ రాజకీయంగా ఎదుగుతుందని ఓర్వలేకనే తనపై కక్షగట్టి ప్రతి పనికి అడ్డుపడ్డారని, మరో రెండేళ్లు చైర్‌పర్సన్ పదవిలో కొనసాగేందుకు డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఏదైనా పని విషయమై తన ఇంటికి కౌన్సిలర్లు వస్తే వారిని టార్చర్ చేసేవారన్నారు. చివరకు మీకు వ్యాపారాలు ఉన్నాయి… పిల్లలు ఉన్నారు జాగ్రత్త అంటూ ఎమ్మెల్యే బెదిరించారని చైర్‌పర్సన్ శ్రావణి ఆరోపించారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.