Monday, January 20, 2025

రైతులపై రాబడి పన్ను?

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: వ్యవసాయ రాబడిపై ఆదాయ పన్ను విధించాలని నీతి ఆయోగ్ సభ్యుడిగా వుండిన వివేక్ దేబ్రాయ్ 2017లో ఒక సూచన చేయగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దానిని కొట్టి పారేశాడు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని జైట్లీ స్పష్టం చేశారు. ఇప్పుడు అదే వివేక్ దేబ్రాయ్ మళ్ళీ వ్యవసాయ ఆదాయ పన్ను ప్రస్తావన తెచ్చారు. న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో గత శనివారం ప్రచురితమైన ఒక వ్యాసంలో దేబ్రాయ్ ఈ ప్రస్తావన చేశారు. భారత దేశంలోని గ్రామాలు భూ గ్రహం మీదే అత్యంత సంపన్నమైవని అనుకొంటున్న సమయంలో మన ప్రభుత్వాలు వ్యవసాయంపై ఆదాయ పన్ను విధించకపోడం తప్పని ఆయన అందులో వాదించారు. గతంలో నియమించిన చాలా కమిటీలు వ్యవసాయాదాయ పన్నును విధించాలని సూచించినట్టు ఆయన పేర్కొన్నారు. 1938 నుంచి 1955 వరకు బీహార్, అసోం, బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్, తిరువనంతపురం, కొచ్చిన్, మద్రాస్, పాత మైసూర్ రాష్ట్రాల్లో వ్యవసాయ ఆదాయ పన్ను వుండిందని రానురాను రైతుల ఓటు అవసరం రాజకీయ పార్టీలకు పెరిగినందున దానిని విడిచి పెట్టారని ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ హోదాలో దేబ్రాయ్ ఇప్పుడు వాదిస్తున్నారు.

ఈ ఆలోచన కేవలం ఆయన ఒక్కరి బుర్ర నుంచే ఊడిపడిందని అనుకోలేము. మోడీ ప్రభుత్వం చిట్టచివరి పూర్తి స్థాయి బడ్జెట్‌గా 202324 సంవత్సర పద్దును ప్రవేశపెట్టడానికి ముందు ఈ ఆలోచన ప్రచారంలోకి రావడం గమనించవలసిన విషయం. భారత దేశం పూర్తి వ్యవసాయ ఆధార స్థితి నుంచి పెట్టుబడి, వాణిజ్య ప్రధానమైనదిగా అవతరించిన క్రమంలో భూమి శిస్తుకు సైతం ప్రాధాన్యం తగ్గిపోయి దానికి స్వస్తి చెప్పారు. అయితే ప్రధాని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల సేవ చేస్తూ దాని వల్ల దేశ ఆర్థికానికి కలుగుతున్న నష్టాన్ని పూడ్చుకోడం కోసం రైతులపై ఆదాయ పన్నును విధించాలనే ఆలోచన చేస్తున్నట్టు అర్థమవుతున్నది. కాకులను కొట్టి గద్దలను మేపడానికి అలవాటుపడిన ఆయన ప్రభుత్వం 2019లో కంపెనీల కార్పొరేట్ పన్నును భారీగా తగ్గించడం ద్వారా ఖజానాకు రూ. 1.84 లక్షల కోట్ల రూపాయల నష్టం కలిగించింది. దాని భర్తీ కోసం పేద, మధ్య తరగతి ప్రజలను తీవ్రంగా బాదుతున్నది.

వాస్తవం ఏమిటంటే ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పంటలకు సరైన ధరలు లభించడం లేదు. ఎరువులు, పురుగు మందులు తదితరాల కింద రైతు పెట్టే ఖర్చులు పెరిగిపోయి చేసిన ప్రైవేటు అప్పులు తీర్చలేక ఆడ పిల్లల పెళ్ళిళ్ళు చేసే స్తోమత కూడా నశించి దేశ వ్యాప్తంగా ఏటా అనేక మంది రైతులు ప్రాణ త్యాగం చేస్తున్నారు. ఈ విషయం ప్రధాని మోడీకి గాని, ఆయన ఆర్థిక సలహా మండలి చైర్మన్‌కు గాని తెలియనిది కాదు. 201011లో దేశంలో 138 మిలియన్ల వ్యవసాయ కమతాలు వుండగా అందులో 118 మిలియన్ల కమతాలు మధ్య తరహా, చిన్న రైతులవే. ఇందులో 93 మిలియన్ కమతాలు మధ్య తరహావి కాగా, 25 మిలియన్ కమతాలు చిన్నవి. వీరి ఆదాయం అతి స్వల్పంగా వుంటుంది. పూర్వ కాలంలో వీరు ఆ తక్కువ ఆదాయంతోనే ఇల్లు గడుపుకొనేవారు. తమకున్న స్వల్ప భూమి మీద లభించే పంట పాడితోనే సరిపుచ్చుకొనేవారు.

ప్రభుత్వాలు విత్తనాలు, ఎరువుల వ్యాపారాలను క్రమ శిక్షణలో పెట్టకుండా వాటికి విచ్చలవిడితనం కల్పించడం వల్ల రంగంలోకి నకిలీ విత్తనాలు, నాసిరకం క్రిమి సంహారక మందులు ప్రవేశించి పంట దిగుబడిని దెబ్బ తీయడం ప్రారంభించాయి. ఈ విష వలయంలో రైతుల పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్నది. కాళీపట్నం రామారావు యజ్ఞం కథ గుర్తుకొస్తున్నది. అయినా మోడీ సర్కారు రైతు ఆదాయం నుంచి పన్ను గుంజుకోవాలని ఆలోచిస్తూ వుంటే అది ఎంత మాత్రం సమర్థించదగినది కాదు. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల జాబితాలో వుంది. ఇప్పటికే సమాఖ్య వ్యవస్థ నియమాలను కాలరాస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వం దీనిని కూడా కబళించి రైతుల మీద కరాళ నృత్యం చేయడానికి సాహసిస్తుందా? ఏమో చూడాలి.

కోట్లాది చిన్న, మధ్య తరగతి కమతాల లెక్కలు తీసి వాటిపై రైతుకు వస్తున్న ఆదాయాన్ని లెక్కించడం మాటలు కాదు. మన రైతుల్లో అత్యధికులు నిరక్షరాస్యులు, అతి తక్కువ చదువుకొనే వారు వుంటారు. ఆదాయ పన్ను విధిస్తే అది అధికారులు వారిని వేధించి మరింత కష్టాల్లో పెట్టడానికే ఉపయోగపడుతుంది గాని ఆశిస్తున్న ఆదాయం ప్రభుత్వానికి రాదు. ఇప్పటికే రైతుల ఉత్పత్తులను ఎగుమతి చేసుకోనీయకుండా పలు రకాల పన్నులను విధిస్తున్నారు. ఎగుమతులను నిషేధిస్తున్నారు. దేశ జనాభాలో 61 శాతం మంది రైతులే. ఇటువంటి ప్రతిపాదనలతో వారిని అసంతృప్తికి గురి చేస్తే దాని ఫలితం తీవ్రంగా వుంటుంది. ప్రధాని మోడీ ఆదరాబాదరాగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో రద్దు చేసిన సంగతి తెలిసిందే. అందుచేత గట్టి ఓటు బలమున్న రైతులను మళ్ళీ మరొక్కసారి వ్యతిరేకం చేసుకొనే దూకుడుకు కేంద్రం పాల్పడబోదని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News