టోక్యో : జపాన్, దక్షిణ కొరియా మధ్య సముద్రంలో బుధవారం తెల్లవారు జామున కార్గో నౌక మునిగి 22 మంది సిబ్బందిలో 8 మంది మరణించారు. హాంకాంగ్ కంపెనీకి చెందిన 6561 టన్నుల బరువున్న జిన్ టియాన్ రవాణా నౌక డిసెంబర్ 3 న మలేషియా లోని పోర్ట్‌క్లాంగ్ నుంచి బయలుదేరింది. కలప లోడుతో ఉన్న ఈ నౌక దక్షిణ కొరియా లోని ఇంచియాన్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
జపాన్ లోని నాగసాకి కి నైరుతి దిశలో 160 కిమీ దూరంలో ఈ నౌక మునిగిపోయిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో చైనా జాతీయులు 14 మంది కాగా, మిగతా ఎనిమిది మంది మయన్మార్‌కు చెందిన వారు. జపాన్, దక్షిణ కొరియా కోస్ట్‌గార్డ్ సిబ్బంది రిస్కూ ఆపరేషన్ చేపట్టారు. ఐదుగురు సిబ్బందిని కాపాడ గలిగారు. వీరిలో నలుగురు చైనా జాతీయులు. ఆరుగురు చైనీయులతో సహా 8 మంది సిబ్బంది మరణించగా, మిగతా 9 మంది గల్లంతైనట్టు చెబుతున్నారు.