Monday, December 23, 2024

రైతు రాజ్యంతోనే దేశం సుభిక్షం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ భవిష్యత్తు మార్చడానికి ఒక సంకల్పంతో బిఆర్‌ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ప్రస్థానం మొదలైందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ మహా యుద్ధంలో విజయం కోసం ఒడిశా నుంచి వచ్చిన ఆ రాష్ట్ర ప్రజలకు, నేతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో ఏ వర్గం ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. మోడీ పాలనలో అన్ని ప్రగల్భాలే తప్ప.. దేశానికి ఒనగూరిన ప్రయోజనం అంటూ లేదని ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితి పోవాలన్నారు. అందుకే దేశంలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్న లక్షంతోనే జాతీయస్థాయిలో బిఆర్‌ఎస్‌ను తీసుకొచ్చిన్నట్లు సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇందుకు అన్ని రాష్ట్రాల ప్రజలు, అనేక రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తుండం ఆనందంగా ఉందన్నారు. అందరి అండదండలతోనే ఒక మహాన్ భారత్ నిర్మించాలని లక్షంగా పెట్టుకున్నామని అన్నారు.

సకల మానవాళి సంక్షేమమే బిఆర్‌ఎస్ స్వప్నమని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సిఎం పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గిరిధర్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలు కూడా పార్టీలో చేరారు. వారిని ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడుతూ.. కేంద్రంపై మరోసారి విరుచుకపడ్డారు. దేశంలోని అన్ని వ్యవస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. పేద ప్రజలను ఏ మాత్రం పట్టించుకోకుండా కార్పొరేట్ రంగం సేవల్లో బిజెపి ప్రభుత్వం తరిస్తోందని ధ్వజమెత్తారు. దీని కారణంగానే పేదల బతుకులు బుగ్గిపాలు అవుతున్నాయన్నారు. దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోందన్నారు.

చిన్న చిన్న దేశాల కంటే మన దేశ ప్రగతి అధ్వానంగా మారుతోందన్నారు. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం కళ్లు తెరవకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దురుద్దేశపూర్వకంగా దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ప్రధానంగా అన్ని ధరలు పెంచుకుంటూ పోవాలి….. జనం జేబులు కొట్టేయాలన్న విధంగా కేంద్ర పాలన కొనసాగుతోందని విమర్శించారు. పేదోడి కడుపు కొట్టాలి ….ఉన్నోడి జేబులు నింపాలి అన్న రీతిలో దేశంలో పాలన నడుస్తున్నదన్నారు. ఈ విధానం పోవాలని కెసిఆర్ వ్యాఖ్యానించారు. అందుకే రైతులు కూడా చట్టసభల్లోకి రావాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

రైతులు నాగలి పట్టడమే కాదు… రాజ్యాంగాన్ని నడిపే నాయకులుగా మారాలని ఈ సందర్భంగా కెసిఆర్ అభిలాషించారు. చివరకు ప్రజలకు త్రాగడానికి తగినన్ని నీళ్ళు, వ్యవసాయరంగానికి, రైతులకు చాలినంత సాగునీటిని కూడా అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సౌకర్యాన్ని కూడా కల్పించలేకపోతున్నారని కెసిఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నో ప్రభుత్వాలను చూసినం.. ఎందరో నాయకులను చూసినం.. ఎన్నో రంగు రంగుల జెండాలను చూసినం.. కానీ రైతులు, పేదల పరిస్థితి మాత్రమ మారలేదన్నారు.

దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవడమే లక్షంగా మారింది

ప్రస్తుతం దేశంలో దౌర్జన్యంతో ఎన్నికలు గెలవడమే లక్ష్యంగా మారిందని కెసిఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఎన్నికల్లో గెలిస్తే సమాజసేవ లక్ష్యంగా ఉంటుందన్నారు. కానీ భారత దేశంలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలుస్తున్నారు కానీ ప్రజలు ఓడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పార్టీలు, నేతలు కాదు.. ప్రజలు గెలవాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలవడమే అసలైన ప్రజాస్వామ్యమని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. దానినే బిఆర్‌ఎస్ కోరుకుంటున్నదన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలిచే విధంగా బిఆర్‌ఎస్ అసలైన మార్పు తెస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

తాను చెప్పేది ధన్ కీ బాత్ కాదు…. మన్ కీ బాత్

తాను మోడీలా ధన్ కీ బాత్ చెప్పడం లేదని కెసిఆర్ అన్నారు. కేవలం మన్ కీ బాత్ చెబుతున్నానని అన్నారు. రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో 13 నెలల ఉద్యమం ఎందుకు చేశారన్నారు. ఇప్పటికీ రైతులకు కేంద్రం ఒక భరోసా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. అందుకే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని బిఆర్‌ఎస్ ఎత్తుకున్నదన్నారు. ఈ నినాదానికి దేశ వ్యాప్తంగా ఉన్న రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. స్వాతంత్య్రం ఇచ్చి 75 ఏండ్లు అవుతున్నప్పటికీ కేంద్రం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. ఒడిశా మహానదిలో ఎంత శాతం నీళ్లను వాడుకుంటున్నారని ప్రశ్నించారు. కేవలం జాతి, ధర్మం పేరు చెప్పి గెలిచే వారు ఏం చేస్తారని నిలదీశారు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారే కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వరని మండిపడ్డారు.

బిఆర్‌ఎస్‌ను గెలిపించండి….!

బిఆర్‌ఎస్ ఎంపిలు, శాసనసభ్యులను గెలిపించిండి…. దేశంలో నీళ్లు, కరెంట్ ఎందుకు రావో తాను చూస్తానని కెసిఆర్ అన్నారు. మనసు పెట్టి పని చేస్తే ఏదైనా సాధ్యమేనని అన్నారు. అందుకు తెలంగాణకు రాష్ట్రం ప్రత్యక్ష నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా అనేక మంది ఇలాగే అడ్డం…పొడువు, అర్థంపర్థం లేని మాటలు మాటలు మాట్లాడన్నారు. కానీ కాసి మీద పనిచేశామన్నారు. ఇప్పుడు తెలంగాణ కరెంటు పోతే ఒక వార్తగా మారిందన్నారు. అలాగే నీళ్లు రాని ఇళ్లు అంటూ తెలంగాణలో కనిపించదన్నారు. మహాయజ్ఞంతో పాలనను ప్రారంభించామన్నారు. రాష్ట్రాభివ-ద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేశామన్నారు.

ఫలితంగా ఎనిమిదన్నర సంవత్సరాల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. అనేక రంగాల్లో దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. ఎనిమిదిన్నత సంవత్సరాల్లో ఒక్క రాష్ట్రమే ఇంత ప్రగతిని సాధిస్తున్నప్పుడు… సహజ వనరులు పుష్కలంగా ఉన్న భారత్‌దేశంలో ఎందుకు ఆశించిన మేర ప్రగతిని సాధించడం లేదని కెసిఆర్ ప్రశ్నించారు. ఇందుకు పాలకులు ఫెయిల్ అయ్యారో దేశ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బిఆర్‌ఎస్ పార్టీ ఉందన్నారు. అందుకే దేశంలో ఒక గుణాత్మక మార్పును తీసుకురావాలన్న లక్షంతోనే తాను జాతీయ స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు కెసిఆర్ వెల్లడించారు. ఇందుకు అన్ని వర్గాల ప్రజలకు తనను దీవించి ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ కోరారు.

తాము అధికారంలోకి వస్త్తే…

బిఆర్‌ఎస్ కు అధికారం ఇస్తే రెండేండ్లలో దేశమంతటికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయానికి ఉచిత్ విద్యుత్ ఇస్తామన్నారు. దేశంలోని రైతులకు కిసాన్ బంధు, ఏటా 20 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధును అమలు చేస్తామన్నారు.శుద్ధి చేసిన నీరును తెలంగాణ మాదిరే దేశవ్యాప్తంగా అందిస్తామన్నారు. దేశంలోని 83 కోట్ల ఎకరాల వ్యవసాయయోగ్యమైన భూమిని సాధ్యమైనంత ఎక్కువగా సాగులోకి తెస్తామన్నారు.

పరివర్తన రావాల్సిన ఆవశ్యకత ఉంది

భారత్‌లో పరివర్తన రావాల్సిన ఆవశ్యకత ఉందని కెసిఆర్ అన్నారు. పరివర్తన సమయంలో చాలా మంది ఇష్టారీతిన విమర్శలు చేస్తారన్నారు. మహారాష్ట్ర ఆర్ధికంగా నిలదొక్కుకున్న రాష్ట్రమని, ఆ రాష్ట్రం కంటే తెలంగాణ బలహీనమైనదన్నారు. గతంలో తెలంగాణ నుంచి ఉపాధి కోసం మహారాష్ట్రకు వలస వెళ్లే వారన్నారు. అయితే ఈ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. ఇప్పుడు మహరాష్ట్రకు వలస వెళ్లిన ప్రజలు తిరిగి వెనక్కు. వస్తున్నారని కెసిఆర్ పేర్కొన్నారు.

పాలనతో తీసుకొచ్చిన అనేక సంస్కరణలే ఇందుకు ప్రధాన కారణని సిఎం కెసిఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవని….కానీ తెలంగాణక వచ్చిన తరువాత రైతులు ఆత్మహత్యలు మొత్తం తగ్గిపోయాయన్నారు. తెలంగాణలో రైతుబందు, రైతు బీమా ఇస్తున్నామన్నారు. బంజారా తండాలో గరీబుకు, బంజారాహిల్స్ లోని అమీరుకు ఒకే రకమైన శుద్ధి చేసిన నీళ్ళు అందిస్తున్నామన్నారు. తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్ర, ఒడిశాలో ఎందుకు కాదని కెసిఆర్ ప్రశ్నించారు. ఆర్ధిక సమస్యలు, కార్య చిత్తశుద్ధి లోపం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే అన్నీ సాధ్యమవుతాయన్నారు.

వెయ్యి ఏనుగుల బలం లాంటిది

గమాంగ్ రాజకీయం జీవితం మచ్చలేదని కెసిఆర్ కితాబిచ్చారు. బిఆర్‌ఎస్‌లో ఆయన చేరిక తనకు వెయ్యి ఏనుగుల బలం లాంటిదన్నారు. దేశంలోని క్రియాశీల నాయకుల్లో గమాంగ్ ఒకరన్నారు. రైతుల తరపున ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. అమెరికా, చైనా అభివృద్ధి చెందిన దేశాల కంటే మన దేశంలోనే వనరులు ఎక్కువ ఉన్నాయన్నారు. అయినప్పటికీ మన దేశం అభివృద్ధి చెందడం లేదని కెసిఆర్ అన్నారు.. భారత్ తన లక్ష్యాన్ని మరిచిందన్నారు. భారతదేశ యువత అమెరికా వెళ్ళడానికి ఎందుకు తాపత్రయ పడుతున్నారు ? ఎందుకు ఉవ్విళ్ళూరుతున్నారని ప్రశ్నించారు. అమెరికా వెళ్ళిన భారతీయులకు అక్కడ గ్రీన్ కార్డు లభిస్తే, అది గౌరవంగా భావించి వారి తల్లిదండ్రులు ఇక్కడ బంధుమిత్రులను పిలుచుకొని దావత్ లు ఎందుకు చేసుకుంటున్నారని కెసిఆర్ నిలదీశారు. ఇది దేనికి సంకేతం ? దీన్ని అర్థం చేసుకుంటే మనం ఎక్కడున్నామో తెలిసిపోతుందన్నారు. ఎంతో సంపద ఉన్న మన దేశంలో ప్రజలు ఎందుకు వంచించబడుతున్నారన్నారు.

బిఆర్‌ఎస్‌లో చేరిన వారు

గిరిధర్ గమాంగ్‌తో పాటు మాజీ ఎంపీ హేమా గమాంగ్, శిశిర్ గమాంగ్, శౌర్య గమాంగ్, మయూర్ భంజ్ మాజీ ఎంపీ, ఎంఎల్‌ఎ రాంచంద్ర హన్సడా, ధైన్ కనాల్, మాజీ ఎమ్మెల్యే నబిన్ నందా, బండారి పొఖ్రి, భద్రక్ మాజీ ఎమ్మెల్యే, బిజెడి యువత మాజీ అధ్యక్షుడు రతా దాస్, బింజార్పూర్, జాజ్పూర్ మాజీ ఎమ్మెల్యే అర్జున్ దాస్, బలిపట్నా, ఖర్దా మాజీ ఎమ్మెల్యే రాఘవ్ శెట్టి, బిజెపి మాజీ ఎమ్మెల్యే బృందావన్ మాఝీ, బిజెడి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దేవాశిష్ నాయక్, జనతాదళ్ సోన్ పూర్ మాజీ ఎమ్మెల్యే దేవ్ రాజ్ శెతి, మాజీ ఎంపీ జయ్ రాం పంగి, నాయకులు రాజేష్ పుత్రా తదితరులు బిఆర్‌ఎస్‌లో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News