Saturday, November 23, 2024

పేరు మార్చు.. జనాన్ని ఏమార్చు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కొదరు డెవలపర్లు 2019 నుంచి అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. ఎలాంటి కష్టం లేకుండా సులువుగా సొమ్మును సంపాదించే పనిలో పడ్డారు. రేటు తక్కువ అంటూ ప్రజల నుంచి కోట్లను వసూలు చేస్తున్నారు. గతంలో రియల్టర్లు, బిల్డర్లు యూడిఎస్ పేరిట ఫ్లాట్లను అమ్మేవారు. స్థలం కొంటే రిజిస్ట్రేషన్ చేసేవారు. కానీ, ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. చర్యలు తీసుకుంటామని రెరా హెచ్చరించడంతో పలువు రు రియల్టర్లు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. యూడీఎస్, ప్రీలాంచ్, సాఫ్ట్‌లాంచ్ పేర్లను వాడటం మానేసి ఈ పేర్ల స్థానంలో ల్యాండ్ పూలింగ్, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇం ట్రెస్ట్ అంటూ జనాల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు. మరికొందరు ఆఫీసు, ఐటీ సముదాయాల్లో పెట్టుబడి పెడితే అధిక అద్దె చెల్లిస్తామని ప్రచారం చేస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.

మహేశ్వరం దగ్గర పెద్ద గోల్కొండలో ఓ సంస్థ సుమారు 150 ఎకరాల్లో ల్యాండ్ పూ లింగ్ చేయాలని నిర్ణయించింది. మంచి రాబడిని కోరుకునేవారు తమ వద్ద పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. ల్యాండ్ పూలింగ్ పేరిట ఒక ఎక రా స్థలం కొనేందుకు రూ.4.5 కోట్లుగా ధర నిర్థారించింది. సుమారు రూ. 675 కోట్లను సేకరించి ప్రజలను మోసం చేసింది. కొందరు తెలివైన ప్ర మోటర్లు ప్రీలాంచ్ అమ్మకాలకు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటూ ఓ సరికొత్త పదాన్ని కనిపెట్టారు. మార్కెట్ కంటే తక్కువ రేటని చెబుతూ ముందుగానే చెక్కులు తీసుకుంటారు. కాకపోతే, రెరా అనుమతి వచ్చాకే చెక్కులను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని చెబుతూ అనుమతి రాకున్నా ఆ చెక్కులను డ్రా చేసుకుంటున్నారు.

ప్రీలాంచ్‌లో లక్ష ఇళ్లు

గత మూడేళ్లలో రెరా వద్ద అనుమతులు తీసుకున్న ప్రాజెక్టుల్ని లెక్కిస్తే దాదాపు 2 లక్షల ఫ్లాట్ల దాకా ఉంటాయని ఇవి కాకుండా యూడీఎస్ లేదా ప్రీలాంచ్‌లో విక్రయిస్తున్న ఇళ్లు లక్ష వరకు ఉండొచ్చని రియల్ వర్గాలు పేర్కొంటున్నాయి. యూడీఎస్, ప్రీ లాంచుల ప్రాజెక్టుల వల్ల సాధారణ అమ్మకాలు మార్కెట్లో గణనీయంగా తగ్గిపోయాయని ప్రజలు కూడా ఆయా సంస్థలనే నమ్ముతున్నారని రెరా అధికారులు పేర్కొంటున్నారు.

ఇస్నాపూర్‌లో 1200 ఫ్లాట్ల నిర్మాణం

కొందరు మోసగాళ్లు ఎక్కువగా కోకాపేట్, కొల్లూరు, పటాన్‌చెరు, ముత్తంగి, రుద్రారం, ఇస్నాపూర్‌లో ప్రాజెక్టులను ఆరంభించారు. రేటు తక్కువంటూ అమ్మేశారు. ఇక మిగిలింది వాటికి అనుమతుల్ని తెచ్చి నిర్మాణ పనుల్ని ఆరంభించడమే. కానీ, అది ఎప్పుడు ఆరంభిస్తారో వారికే తెలియదు. పటాన్‌చెరు ఇస్నాపూర్‌లో ఓ సంస్థ ఏకంగా 1200 ఫ్లాట్లను నిర్మిస్తామంటూ ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించి అనంతరం చేతులెత్తేసింది. కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి జయంతి ఇన్‌ఫ్రా పేరుతో కెపిహెచ్‌బిలో రియల్ సంస్థను ప్రారంభించి ప్రజల నుంచి రూ.100 కోట్లను వసూలు చేసి చేతులెత్తేశారు.

రైతుల అనుమతి లేకుండానే విక్రయాలు

మరికొందరు రియల్టర్‌లు భూమికి అడ్వాన్సు ఇచ్చి వాటి డైమన్షన్స్ తీసుకుని ఆర్కిటెక్టులతో ప్లాన్లు గీయించి అనుమతి తీసుకోకుండానే, ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. అనంతరం రియల్టర్‌కు, స్థలయజమానికి మధ్య ఇబ్బందులు ఎదురై అగ్రిమెంట్ కుదరకపోతే కొన్నవారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతోంది? ఒకవేళ అగ్రిమెంట్ కుదిరినా ఆ భూమి టైటిల్ క్లియర్‌గా లేకపోతే అందులో అపార్టుమెంట్ కట్టడానికి స్థానిక సంస్థ అనుమతి ఇవ్వకపోవడం వల్ల కొన్నవారు ఇబ్బందులు పడుతున్నారు.

రుద్రారంలో జి ప్లస్ 15 అంతస్తులు….

పటాన్‌చెరు వద్ద రుద్రారంలో జి ప్లస్ 15 అంతస్తుల అపార్టుమెంట్‌లో ఫ్లాట్ కొంటే చదరపు అడుగుకు రూ. 2199లేనని ప్రకటనలు గుప్పిస్తూ ప్రజలను ఓ సంస్థ తప్పుదారి పట్టించింది. ఈ ప్రకటన చూసిన ఏజెంట్లు పది శాతం కమిషన్‌కు ఆశపడి ప్రజలతో ఫ్లాట్లను కొనిపించారు. అసలు ఈ బిల్డర్ బహుళ అంతస్తుల అపార్టుమెంట్‌ను కట్టాలంటే ఏయే సంస్థల నుంచి అనుమతి తెచ్చుకోవాలో అతనికి తెలియదు. అయినా ప్రజలను తేలిగ్గా బురిడీ కొట్టించాలన్న ఉద్ధేశ్యంతో ఇలా మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నా ప్రజలు మాత్రం గుర్తించకపోవడం విశేషం.

చదరపు అడుగు అతి తక్కువ

ప్రస్తుతం ఎక్కడ చూసినా యూడీఎస్, ప్రీ లాంచ్‌ల్లోనే కొందరు ఎక్కువగా ఫ్లాట్లను కొంటున్నారు. కారణం తక్కువ ధరకు రావడమే. తదనంతరం ఆ వెంచర్‌లో నిర్మాణాలు జరగడం లేదు. రెరా అనుమతి ఉంటేనే వినియోగదారుడికి న్యాయం జరుగుతుంది. కానీ ఇలాంటి మోసం చేసే సంస్థలతో ప్రజలకు న్యాయం జరగకపోగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News