Saturday, November 23, 2024

బిబిసి డాక్యుమెంటరీపై రభస

- Advertisement -
- Advertisement -

2013లో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రజలు దూరదర్శన్, ఇతర మీడియాలలో వచ్చే వార్తలను నమ్మడం లేదని, ‘నిజమైన, ఖచ్చితమైన’ సమాచారం కోసం బిబిసి వైపు చూస్తున్నారని అంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ 2013లో ఓ బహిరంగ సభలో పేర్కొనడం గమనార్హం. అయితే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి భారత్ కు వ్యతిరేకంగా పలు కథనాలను బిబిసి ప్రసారం చేస్తూ వస్తున్నదని అందరికీ తెలుసు. ఆ మాటకు వస్తే బ్రిటిష్ ప్రభుత్వ అక్రమాలను సహితం బిబిసి బయటపెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

కారణం ఏమైతేనేమి మొదటి నుండి బిబిసితో పాటు అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థలు మోడీ వ్యతిరేక కథనాలను వ్యాపింప చేయడం కోసం ఆసక్తి చూపుతున్నాయి. మనం మీడియా స్వతంత్రత గురించి ఎంతగా మాట్లాడుకున్నా భారత దేశంలో మాదిరిగా ఐరోపా, అమెరికా దేశాలలో సహితం మీడియా కొన్ని పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంటుంది.

రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో జరిగిన హింసాకాండ మరోసారి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నది. వాస్తవాలు కాకుండా భావోద్వేగ రాజకీయాలే ప్రాధాన్యతను సంతరింప చేసుకున్న ప్రస్తుత పరిస్థితులలో గుజరాత్‌లో అసలు ఏమి జరిగిందో, వాస్తవాలు ఏమిటో అప్పట్లోనే ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే, అవకాశం చిక్కినప్పుడల్లా ఈ సంఘటనలను లేవనెత్తి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం అందరూ చేస్తున్నారు. తాజాగా ఆనాటి సంఘటనలపై బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం అత్యవసర అధికార నిబంధనలను ఉపయోగించుకొని సోషల్ మీడియాలో నిషేధించిన తర్వాతనే రాజకీయంగా దుమారం కలిగించడం ప్రారంభమవడం గమనార్హం.

అక్కడక్కడా, ముఖ్యంగా కొన్ని విశ్వవిద్యాలయాల్లో దీనిని ప్రదర్శించడం జరుగుతుంది.అంటే, ఓ విధంగా ప్రభుత్వం నిషేధం విధించిన ఉద్దేశం ఎదురు తిరిగిన్నట్లయింది. ఈ సందర్భంగా 2013లో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రజలు దూరదర్శన్, ఇతర మీడియాలలో వచ్చే వార్తలను నమ్మడం లేదని, ‘నిజమైన, ఖచ్చితమైన’ సమాచారం కోసం బిబిసి వైపు చూస్తున్నారని అంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ 2013లో ఓ బహిరంగ సభలో పేర్కొనడం గమనార్హం. అయితే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి భారత్ కు వ్యతిరేకంగా పలు కథనాలను బిబిసి ప్రసారం చేస్తూ వస్తున్నదని అందరికీ తెలుసు. ఆ మాటకు వస్తే బ్రిటిష్ ప్రభుత్వ అక్రమాలను సహితం బిబిసి బయటపెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

కారణం ఏమైతేనేమి మొదటి నుండి బిబిసితో పాటు అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థలు మోడీ వ్యతిరేక కథనాలను వ్యాపింప చేయడం కోసం ఆసక్తి చూపుతున్నాయి. మనం మీడియా స్వతంత్రత గురించి ఎంతగా మాట్లాడుకున్నా భారత దేశంలో మాదిరిగా ఐరోపా, అమెరికా దేశాలలో సహితం మీడియా కొన్ని పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంటుంది. ఆయా దేశాలలో పారిశ్రామిక వర్గాలే రాజకీయ పార్టీల విధానాలపై ప్రభావం చూపుతూ ఉంటాయి. బిబిసి డాక్యుమెంటరీ విశ్వసనీయత అంశం అటుంచితే, ఈ సందర్భంగా భారత ప్రభుత్వ స్పందన తీరు ఆందోళన కలిగిస్తున్నది. పారదర్శకంగా, నిబ్బరంతో వ్యవహరించకుండా ఆందోళనకర ధోరణి ప్రదర్శిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ఆ డాక్యుమెంటరీపై నిషేధం విధింపలేదు. కేవలం సోషల్ మీడియా సంస్థలను మాత్రమే వాటిని బ్లాక్ చేయమని కోరింది.

సోషల్ మీడియాలో నిషేధించి ప్రభుత్వం జాతీయ టివి న్యూస్ ఛానల్స్‌లలో, ముఖ్యంగా ప్రభుత్వ అనుకూల ఛానల్స్‌గా పేరొందిన వాటిల్లో బిబిసి డాక్యుమెంటరీపై చర్చలను మాత్రం అనుమతిస్తుంది. తద్వారా డాక్యుమెంటరీలో అసలు ఏముందో తెలుసుకొనే సౌలభ్యం ప్రజలకు లేకుండా చేసి, భిన్నమైన వాదనలను మాత్రం వ్యాపింప చేసే అవకాశం కల్పిస్తున్నారు. గత మూడేళ్లుగా ప్రభుత్వ వ్యతిరేక వార్తా కథనాలు ప్రచురించిన పలువురు జర్నలిస్టులు, మీడియా సంస్థలపై ప్రభుత్వం విరుచుకుపడిన తీరు చూస్తున్న వారికి ఈ ప్రభుత్వం నిష్పాక్షికమైన చర్చలను గాని, భిన్నమైన అభిప్రాయాలను గాని సహించలేకపోతున్నదనే అభిప్రాయం కలుగుతుంది.

ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చబోతున్నారని ఓ వెబ్ పోర్టల్ లో వార్త రాసిన జర్నలిస్ట్‌ను దేశద్రోహం నిబంధనల కింద అరెస్ట్ చేసిన సంఘటన జరిగింది. ఈ డాక్యుమెంటరీపై బ్రిటిష్ పార్లమెంట్‌లో జోక్యం చేసుకున్న ఆ దేశ ప్రధాని రిషి సునాక్ సహితం భారత్ తమకు మిత్ర దేశం అని చెప్పారే గాని అందులో ప్రస్తావించిన విదేశాంగ శాఖ పత్రాలు అవాస్తవాలు, అబద్ధాలు అని కొట్టిపారవేయకపోవడం గమనార్హం. ఈ డాక్యుమెంటరీ భారత దేశ ప్రతిష్ఠను లేదా ప్రధాని మోదీ ప్రతిష్ఠను దెబ్బ తీసిందని సమాచార మంత్రిత్వ శాఖ లేదా హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు ఖచ్చితంగా భావించినట్లయితే, ప్రభుత్వం బిబిసిపై చట్టపరమైన ఫిర్యాదు చేసి ఉండాలి. లేదా బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక పత్రాలు తమకు ఆధారం అని బిబిసి అంటున్న దృష్ట్యా ఈ విషయమై దౌత్యమార్గాల ద్వారా ఆ ప్రభుత్వానికి అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండాలి.

కానీ అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. ప్రభుత్వం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన తర్వాతనే కొన్ని విశ్వవిద్యాలయాలలో, మరికొన్ని చోట్ల ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించడం ప్రారంభమైంది. ఆ విధంగా ప్రదర్శించకుండా చట్టపరమైన చర్యలు తీసుకొనే బదులు పోలీసులను ప్రయోగించి, బలప్రయోగం ద్వారా కట్టడి చేసే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంటరీని కొన్ని ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ, ప్రజా సంఘాలు ఒక ఆయుధంగా మలచుకొని, అక్కడక్కడా ఆందోళనలు జరిపే ప్రయత్నం చేస్తున్నా వాస్తవానికి ఆచరణలో 2024 ఎన్నికలలో తిరిగి ‘హిందుత్వ’ వాదనలను తెరపైకి తీసుకొచ్చేందుకు అధికార పక్షానికి బలమైన ఆయుధంగా మారే అవకాశం కలిగిస్తున్నట్లు మరి కొన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

వాస్తవానికి ఈ డాక్యుమెంటరీలో కొత్త విషయాలు ఏవీ లేవు. రెండు దశాబ్దాలకు పైగా మన దేశంలో వివిధ వర్గాలు చేస్తున్న వాదనలనే మరోసారి ప్రస్తావించారు. గుజరాత్ అల్లర్ల తర్వాత 12 ఏళ్లకు నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా ఎన్నుకోవడం ద్వారా భారత ప్రజలు ఆయనకు ఇందులో సంబంధం లేదని అంగీకరించినట్లు అయింది. ఆ తర్వాత ఐదేళ్లకు రెండోసారి కూడా ఎన్నుకున్నారు. అంటే గుజరాత్‌లో ముస్లింల ఊచకోతకు మోడీ బాధ్యుడు కారని భారత ప్రజలు అంగీకరించినట్లు స్పష్టం అవుతుంది. అంతేకాదు, 2013లో దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టంగా ఈ కేసులో మోడీని విచారించేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసింది. గుజరాత్ అల్లర్లలో మోడీ ప్రమేయం లేదని కూడా తేల్చి చెప్పింది. నేడు దేశ ప్రజలు గుజరాత్ అల్లర్లను గురించి పట్టించుకోవడం లేదు. అయినా ఈ డాక్యుమెంటరీ పట్ల కేంద్ర ప్రభుత్వం కొంచెం గాబరాగా స్పందించినట్లు అనిపిస్తుంది.

రొటేషన్‌లో లభించిన జి20 అధ్యక్ష పదవిని నరేంద్ర మోడీ నాయకత్వానికి అంతర్జాతీయంగా లభించిన గుర్తింపుకు ప్రతీకగా అభివర్ణిస్తూ, 2024 ఎన్నికలలో ఆయనను అంతర్జాతీయంగా కీలకమైన నేతగా ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్న సమయంలో బిబిసి డాక్యుమెంటరీ ఓ విధంగా ఇబ్బందికరంగా పరిణమించి ఉండవచ్చు. ఇందులో పేర్కొన్న అంశాలు అన్ని గత 20 ఏళ్లుగా భారత ప్రజల ముందుకు వచ్చినవే అయినప్పటికీ, కొత్తగా ఒకే విషయాన్ని వెల్లడించారు. గుజరాత్ అల్లర్లపై ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం సొంతంగా విచారణ జరిపిందని లేదా అధ్యయనం చేసిందని, అల్లర్లకు నరేంద్ర మోడీ నేరుగా బాధ్యులని నిర్ధారణకు వచ్చిందని ఆ దేశ విదేశాంగ శాఖ ‘రహస్య పత్రాలు’ వెల్లడిస్తున్నట్లు ఇప్పుడు బిబిసి ఆరోపిస్తున్నది.

ఈ విషయమై నేరుగా బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చించి, వారి కధనాలు వాస్తవ విరుద్ధమని స్పష్టం చేసే ప్రయత్నం భారత్ ఎందుకు చేయడం లేదు? ప్రభుత్వపరంగా ఆ కథనంలో అవాస్తవాలను ఖండిస్తూ, వాస్తవాలు వెల్లడి చేసే ప్రయత్నాలు చేయకుండా నిషేధపు అస్త్రం ప్రయోగించడం ద్వారా అంతర్జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్న ప్రధాని మోడీ ఓ విధంగా సాహసం చేస్తున్నారని చెప్పాలి. ప్రజాస్వామ్యానికే పుట్టినిల్లు భారత్ అని చెబుతున్న ఆయన ప్రజాస్వామ్య మౌలిక పద్ధతుల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారనే అపవాదును సిద్ధపడినట్లవుతున్నది. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ సమయంలో ప్రెస్ సెన్సార్‌షిప్ విధించి రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకున్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అనుభవం ఒకటి ప్రస్తావించాలి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తానని నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే జనవరి, 1977లో ఇందిరాగాంధీ ఎన్నికలకు వెళ్లడం అందరికీ తెలిసిందే.

కానీ, ఎన్నికలలో తాను స్వయంగా ఓటమి చెందడమే కాకుండా, కాంగ్రెస్ ఘోర పరాజయం మూటగట్టుకోవలసి రావడంతో ఆమె కంగుతిన్నారు. ఆ తర్వాత తమ కుటుంబానికి సన్నిహితులైన ప్రముఖ వార్తాపత్రిక బ్లిట్జ్ సంపాదకులు కరంజియాను కలిసి ‘అంకుల్ ఈ విధంగా ఎందుకు జరిగింది?’ అంటూ ఆమె అడిగారు. ఆయన చెప్పిన సమాధానం రాజకీయ నేతలు అందరికీ కనువిప్పు కలిగించాలి. ‘ఇందిర నీవు ఎమర్జెన్సీ విధించినా, మీడియాపై ఆంక్షలు విధించి గొప్ప పొరపాటు చేశావు. దానితో నీ చుట్టూ ఉన్న నీ భజనపరులు నీకు ఇష్టమైన విషయాలే అతిశయంగా చెబుతూ వచ్చారు. నీవు కూడా నిజమని నమ్ముతూ వచ్చావు. కానీ మీడియాని స్వేచ్ఛగా వదిలివేస్తే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చి నీకు సరిదిద్దుకొనే అవకాశం లభించి ఉండెడిది’ అంటూ ఆయన ఆమెకు చెప్పారు. అందుకనే వార్తా కథనాలపై ఆంక్షలు విధించడం ద్వారా రాజకీయంగా తాత్కాలిక ప్రయోజనాలు కలిగించినా, తర్వాత తీవ్ర ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యానికి పారదర్శకత అత్యంత ముఖ్యమైన ప్రామాణికత. ప్రభుత్వ వ్యవహారాలలో అది లోపిస్తే అనేక దుష్పరిణామాలను దారితీసే ప్రమాదం ఎదురవుతుంది. కేవలం మీడియాలో ప్రతికూల అంశాలు రాకుండా చూసుకోవడం ద్వారా ఎవ్వరూ రాజకీయంగా ఎక్కువ కాలం మనుగడ సాధింపలేరు.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News