హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే దేవాలయాలను అభివృద్ధి చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను బండి సంజయ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల పోరాట ఫలితంగా త్వరలోనే బిజెపి ఆధ్వర్యంలో పేదల రాజ్యం రాబోతుందని అన్నారు. రామరాజ్యం వచ్చిన తర్వాత కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, ధర్మపురి లక్ష్మీనర్సింహాస్వామి, కాళేశ్వరం, ముక్తేశ్వర స్వామి ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఇదిలావుండగా, కరెంట్ చార్జీల పెంపుతో మరో రూ. 16 వేల కోట్లు భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆయన ఆరోపించారు. ఎసిడి ఛార్జీలను చెల్లించవద్దని ప్రజలను ఆయన కోరారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. అధికార పార్టీ ఎంఎల్‌ఎల ఆస్థులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి పార్టీలో కోవర్టులు ఎవరూ లేరని బండి సంజయ్ అన్నారు. ఈ విషయంపై తమ పార్టీ ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ ఏమి మాట్లాడారో తన దృష్టికి రాలేదన్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించాను.
జై శ్రీరాం! జై హనుమాన్ ! pic.twitter.com/Ou3nTTxIMi— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 29, 2023