Saturday, December 21, 2024

ప్రాథమిక సమాచార ‘వ్యాస గవాక్షం’

- Advertisement -
- Advertisement -

డాక్టర్ రాయారావు సూర్యప్రకాష్ రావు తరచుగా పత్రికల్లో కనబడే కవి, రచయిత. తెలుగు సాహిత్యం, సాహితీవేత్తల గురించి సందర్భానుసారంగా తక్షణం స్పందిచే గుణం, సత్తా ఉన్న ఆయన చాలా పత్రికలకు అవసరార్ధ వ్యాసకర్త. ప్రభుత్వ కొలువుకి పూర్వం పాత్రికేయుడిగా కొనసాగిన ఆయన అనుభవం ఈ ప్రవృత్తిలో రాణించే లక్షణాన్ని అందించింది. సూర్యప్రకాష్ రావు ఎవరి గురించి రాసినా వాటిని చదివినవారికి కొన్ని కొత్త విషయాలు, వివరాలు తెలిసిన అనుభూతి కలుగుతుంది. 2017 నుండి 2021 దాకా వివిధ తెలుగు దినపత్రికల్లో సూర్యప్రకాష్ రావు రాసిన వ్యాసాలను ’వ్యాస గవాక్షం’ పేరిట దర్పణం సాహిత్య వేదిక పుస్తకంగా తెచ్చింది. ఇందులో 39 వ్యాసాలున్నాయి.

ఇవన్నీ ప్రధానంగా తెలుగు కవుల, రచయితల విశేష సందర్భాలకు పునస్కరించుకొని రాసినవే. ప్రముఖ సాహిత్యకారులకు అవార్డు, సత్కారం లభించినప్పుడు వారి సాహితీ కృషిని విశదీకరిస్తూ రాసినవి కొన్నయితే, మరికొన్ని కీర్తిశేష రచయితల సంస్మరించుకొనేవి. భౌతికంగా దూరమైనవారి విషయంలో వెంటనే స్పందించి వారి ఘనతని, సాహితీసేవని మనకందించిన స్మృతి రచనలు కొన్ని. మొత్తానికి ఈ వ్యాసాల్లో వ్యక్తుల ప్రతిభకు పట్టం కట్టేవే ఎక్కువ. సాహితీవేత్తల నిష్క్రమణ పట్ల రచయిత తక్షణ స్పందనను పత్రికలకు, పాఠకులకు మేలైన అంశంగా భావించాలి.

పి వి శతజయంతి సందర్బంగా ఆకాశవాణి ప్రసారంలో రచయిత పి వి సాహితీ సేవ విశేషాలను పేర్కొన్నారు..గొల్ల రామవ్వ తో పాటు పి వి మారుపేర్లతో రాసిన మరిన్ని కథల ప్రస్తావన ఇందులో ఉంది. నవలగా సాగే పి వి ఆత్మకథ ఇన్ సైడర్ సన్నివేశాల్లోని అంతరంగాన్ని చర్చించారు.

బూర్గుల రామకృష్ణారావు 120 వ జయంతి వ్యాసంలో ఆయన అసలుపేరు పుల్లంరాజు రాంకిషన్ రావు అని తెలుపుతూ మారిన తీరును వివరించారు. వట్టికోట ఆళ్వార్ స్వామి ’జైలు లోపల’ కథలను విశ్లేషిస్తూ కథల్లోని పాత్రల జీవన విషాదాల్ని, వర్గ వ్యవస్థ చిత్రణని ఎత్తి చూపారు. కవి దాశరథి వచనరచనలపై వ్యాసం విశేషమైనది. ఇందులో బుద్ధుని జీవిత ఘట్టాల ఆధారంగా దాశరథి రాసిన మహాబోధి, మహాపరినిర్వాణం అనే నాటికల్లో గల సంభాషణల్లోని భాషా సౌందర్యం సోదాహరణంగా ఉంది. కవి సి. నారాయణరెడ్డి, ఆచార్య చెన్నకేశవరెడ్డిల గురుశిష్య బంధాన్ని వివరించే ’గురు’త్వాకర్షణే ప్రేరణ చమత్కార భాషణలతో సాగింది.
నేటి కాలపు ప్రముఖ కవులు, రచయితలుగా కొనసాగుతున్న కె.శివారెడ్డి, నందిని సిధారెడ్డి, ఏనుగు నర్సింహారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, వాగ్గేయకారులు గోరటి వెంకన్న మొదలగువారిపై సందర్భోచిత వ్యాసాలున్నాయి.

కవిత్వం రాస్తున్నవారికి పాఠాలుగా ఇవి పనికొస్తాయి.వీటి రచనకాలంలో కీర్తిశేషులైన ఆదివిష్ణు, యద్దనపూడి సులోచనారాణి, దేవిప్రియ, నోముల సత్యనారాయణ, సి రాఘవాచారి తదితరులపై నివాళి వ్యాసాలున్నాయి. పత్రికల్లో ప్రచురణ దృష్టితో రాసిన ఈ రచనలు సంక్షిప్తంగా ఉన్నాయి. వాక్యాల్లో సాహిత్య పటిమ కన్నా పాత్రికేయ ధోరణియే ఎక్కువ. సందర్భానికి అందించాలనే ఉద్దేశ్యంతో కొన్నింటిలో వికీపీడియా లాగా సాధారణ పరిచయ వాక్యాలు అవసరాన్ని మించి ఉన్నాయి. వ్యాసం కోసం ఎంచుకున్న వ్యక్తుల్లో కొందరు తగినంత ప్రతిభావంతులు కానందున మామూలు అంశాలతో రచన తేలిక పడిపోయింది. వ్యాసంలో ఆయా వ్యక్తుల పుట్టినూరు, తేదీ, తల్లిదండ్రుల పేర్లు, చదివిన స్కూలు వివరాలు రచనకు ఉపయోగకరంగా ఉంటేనే వాటిని పేర్కొనడం మంచిది.

డా.ఏనుగు నరసింహారెడ్డి, డా. అమ్మంగి వేణుగోపాల్ తమ ముందుమాటల్లో వ్యాసాల విశిష్టతను పేర్కొంటూ మరింత సమాచారాన్ని జోడించారు. వీరిద్దరి రచనలపై వ్యాసాలు ఈ సంపుటిలో ఉన్నాయి. నిత్య వెలుగుల సాహితీ క్షేత్రం, ఒకటిన్నర శతాబ్దాల తెలంగాణ నవల మరి కొన్ని వ్యాసాలు తెలంగాణ చారిత్రక సాహిత్య చరిత్రకు అడ్డం పట్టాయి. ఇలాంటి వ్యాసాలు సూర్యప్రకాశరావు అన్నట్లు పోటీ పరీక్షలు రాసేవారికి ఉపయోగపడతాయి. సాహిత్యంపై లోతైన అవగాహన, వ్యాస రచనపై ఆసక్తి గల డా, రాయారావు సూర్యప్రకాష్ రావు కృషితో సమకాలీన రచనల, రచయితల విశేషాలు ఇలాగే రికార్డు అవుతూ మరిన్ని వ్యాస గవాక్షాల నిర్మాణం కావాలి.

వ్యాస గవాక్షం (సాహిత్య వ్యాసాల సంకలనం)
రచన : డా. రాయారావు సూర్యప్రకాష్ రావు
పేజీలు 182 , వెల : రూ.250 /-
ప్రచురణ : దర్పణం సాహిత్య వేదిక
ప్రతులకు : రచయిత, 9441046839

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News