మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ బోర్డుకి సమాంతరంగా మరో కమిషనర్ వ్యవస్థ నడుస్తోందని రాష్ట్ర ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి, కమిషనర్ నవీన్ మిట్టల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సస్పెండై ప్రస్తుతం ఉద్యోగంలో లేని ఓ వ్యక్తి ఒక వ్యక్తి వ్యవస్థను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలోని సిసి కెమెరాలను ట్యాంపర్ చేశారని, డాటా చోరి అయిందని అన్నారు. దీనిపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పోలీసు విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో తాను ఓ అధికారితో మాట్లాడిన విషయాలు మూడో వ్యక్తికి వెంటనే తెలిసిపోతున్నాయని పేర్కొన్నారు. వివిధ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి అధికారిక కార్యక్రమాల్లో తలదూర్చుతూ మొత్తం వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
బోర్డు కార్యాలయంలోని సీసీ ఫుటేజ్ వ్యవస్థ పాస్‌వర్డ్ కూడా ప్రస్తుతం ఉద్యోగంలో లేని వ్యక్తి నియంత్రణలోనే ఉందని అన్నారు. మాన్యువల్ వాల్యువేషన్ ద్వారా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడిన వారే ఆన్‌లైన్ మూల్యాంకనం విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఎసిబి,లైంగిక వేధింపులు అనేక క్రిమినల్ కేసులుతో సస్పెండైన ఒక జూనియర్ లెక్చరర్ బోర్డు అధికారులపై అనేక ఆరోపణలు చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధం లేని, అర్హత లేని వ్యక్తి ఆన్‌లైన్ వ్యాల్యువేషన్ విధానంపై అనుమానాలు, అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జామినేషన్ ప్రక్రియను కంట్రోల్ చేస్తున్న కొంతమంది వ్యక్తులు తమ చేతుల నుంచి ఆ వ్యవస్థ చేజారి పోతుందనే భయంతో బోర్డుపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈసారి కొన్ని సబ్జెక్టులకు ఆన్‌లైన్‌లోనే జవాబుపత్రాల వాల్యుయేషన్ చేయిస్తామని తెలిపారు. దీని వల్ల పారదర్శకత పెరుగుతుందని, తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని సెక్రటరీ హామీ ఇచ్చారు.
పారదర్శకత కోసమే ఆన్‌లైన్ మూల్యాంకనం
ఆన్‌లైన్ వాల్యువేషన్‌తో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. లెక్చరర్లు ఇంట్లో నుంచి కూడా వాల్యువేషన్ చేయవచ్చని అన్నారు. ఆన్‌లైన్ వాల్యువేషన్ వల్ల ఖర్చు, పనిభారం పూర్తిగా తగ్గిపోతుందని చెప్పారు. ఆన్‌లైన్ విధానంలో చాలా కచ్చితత్వం ఉంటుందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కూడా సులభంగా చేయవచ్చని తెలిపారు. విద్యార్ధుల సౌలభ్యం కోసమే ఆన్‌లైన్ వాల్యువేషన్ ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు. మంచిపని చేస్తుంటే సస్పెండైన వ్యక్తికి అంత బాధ ఎందుకు కలుగుతుందో అర్థం కావడం లేదని అన్నారు. కొంతమంది ఇంటర్ బోర్డును ఆదాయవనరుగా మార్చుకున్నారని, అలాంటి వారి ఆటలు సాగవని బోర్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బోర్డుపై ఒక వ్యక్తి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎగ్జామినేషన్ ప్రాసెస్ కంట్రోల్ చేస్తున్న కొంతమంది తమ చేతుల నుంచి వ్యవస్థ పోతుందనే బోర్డుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి ప్రయోగాత్మకంగా ఆర్ట్, కామర్స్, లాంగ్వేజెస్ పేపర్స్ మాత్రమే ఆన్‌లైన్ వాల్యువేషన్ చేస్తున్నామని తెలిపారు.
ట్రాక్ రికార్డ్ బాగున్న సంస్థలకే టెండర్
ఆన్‌లైన్ మూల్యాంకనం విషయంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సంస్థలకే టెండర్ ఇవ్వనున్నట్లు నవీన్ మిట్టల్ వెల్లడించారు. గతంలో తప్పుడు ట్రాక్ రికార్డ్ ఉన్న సంస్థలను ఆన్‌లైన్ బిడ్డింగ్‌కి అనుమతించడం లేదని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ, అంబేడ్కర్ యూనివర్సిటీ, సాంకేతిక విద్యాశాఖల్లో కొన్నేళ్లుగా ఆన్‌లైన్ వాల్యువేషన్ పద్ధతి విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు.ఆన్‌లైన్ విధానం ద్వారా విద్యార్థులకు త్వరగా ఫలితాలు వెల్లడించవచ్చని చెప్పారు. ఆన్‌లైన్ మూల్యాంకనం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. జవాబు పత్రాల వాల్యువేషన్‌పై ఎలాంటి గందరగోళం లేదని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నవీన్ మిట్టల్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్యామండలి కార్యదర్శి శ్రీనాథ్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎవిఆర్ నర్సింహ్మారెడ్డి, ఒయు అధికారులు, ఇంటర్ బోర్డు ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదబాయి, మరో అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఆన్‌లైన్ మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.