మనతెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన వక్త, రచయిత నిక్ వుజిసిక్ మల్లారెడ్డి విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. విజయాన్ని సాధించడంలో మన ప్రవర్తన తీరు, ప్రాముఖ్యతపై శక్తివంతమైన, ఉత్తేజకరమైన ప్రసంగాన్ని విద్యార్థులకందించడానికి ఆయన ఈ విశ్వవిద్యాలయానికి వచ్చారు. కార్మిక అండ్ ఉపాధి శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, సిహెచ్. మహేందర్ రెడ్డి, డాక్టర్ సిహెచ్. భద్రారెడ్డి,మల్లారెడ్డి యూనివర్సిటీ చైర్మన్, మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి, మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విఎస్‌కె రెడ్డి, చిరంజీవి బూరుగుపల్లి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
విద్యార్థులు ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి
ఈ సందర్భంగా వుజిసిక్ మాట్లాడుతూ విద్యార్థులు తమ ఎదుగుదలకు సంబంధించిన ఆలోచనా ధోరణిని మార్చుకోవాలని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ కలలను వదులుకోవద్దని ఆయన సూచించారు. ఈ చర్చకు విద్యార్థులు, సిబ్బంది నుండి విశేష స్పందన లభించింది, వారు వుజిసిక్ ఆశ, పట్టుదలను చూసి చలించిపోయారు.
విద్యార్థులను ప్రోత్సహించడం గొప్ప విషయం: మంత్రి
కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ నిక్ వుజిసిక్ మా యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులను ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు. ఆయన ఆశ, పట్టుదల సందేశం విద్యార్థుల హృదయాల్లో చిరకాలం నిలిచి ఉంటుందన్నారు. అతని కథను తమతో పంచుకున్నందుకు మంత్రి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు…
మల్లారెడ్డి యూనివర్శిటీ సెక్రటరీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిక్ వుజిసిక్ తన వ్యక్తిగత అనుభవాలను, ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలను పంచుకోవడం వల్ల విద్యార్థులు ఎంతో ప్రేరణ, స్ఫూర్తి పొందారన్నారు. మల్లారెడ్డి యూనివర్శిటీ చైర్మన్ భద్రారెడ్డి మాట్లాడుతూ తన శక్తివంతమైన కీలకోపన్యాసంతో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపి విద్యార్థుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన నిక్ వుజిసిక్‌కు మల్లారెడ్డి యూనివర్సిటీ ఆతిథ్యం ఇవ్వడం విశేషమన్నారు. ఈ ఉపన్యాసంతో విద్యార్థులు వారి కలలు నెవేర్చుకోవడానికి ఎదురయ్యే అడ్డంకులను అధిగమించాలని ఆయన సూచించారు.
నిక్ జీవితం ధైర్యం, దృఢత్వానికి ప్రతిరూపం…ప్రీతిరెడ్డి
మల్లారెడ్డి యూనివర్శిటీ డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ నిక్ జీవితం ధైర్యం, దృఢత్వానికి ప్రతిరూపంగా మారిందన్నారు. నమ్మశక్యం కాని అసమానతలను ఎదుర్కొని, అతను మన జీవితకాలంలో చాలా మంది సాధించగలిగిన దానికంటే ఎక్కువ సాధించారన్నారు. అతని స్ఫూర్తిదాయకమైన మాటలు ప్రేరణను అందించాయన్నారు. మన మార్గంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎప్పటికీ వదులుకోకూడదని, మన కలల కోసం ప్రయత్నిస్తూనే ఉండాలని ఆయన గొప్ప సందేశాన్ని ఇచ్చారని ఆమె తెలిపారు.