దేశంలో నెంబర్ 1 అగ్రగామి పోర్ట్ దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ, అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా 30 సంవత్సరాల రాయితీ కాలానికి అత్యాధునిక మెగా కంటెయినర్ టర్మినల్‌ను టునా టెక్రా, కాండ్లా వద్ద పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనుంది. ఏకెబీటీపీఎల్ చేత ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రస్తుత డ్రై బల్క్ టర్మినల్ పక్కన తూర్పు వైపున ఈ అభివృద్ధి జరుగనుంది.
హిందుస్తాన్ ఇన్‌ఫ్రాలాగ్ ప్రైవేట్ లిమిటెడ్ (డీపీ వరల్డ్) ప్రతి టీఈయుకి 6500 రూపాయల రాయల్టీ అందించడం ద్వారా పేర్కొనబడిన ప్రాజెక్ట్‌కు కన్సెషనీర్‌గా అవతరించింది. ఓ పీపీపీ ప్రాజెక్ట్‌లో ఇప్పటివరకూ లభించిన అత్యధిక బిడ్ ఇదే.ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 4500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నారు. భారతదేశంలో ప్రధాన నౌకాశ్రయాలలో పీపీపీ ప్రాజెక్టులలో పెట్టిన అత్యధిక పెట్టుబడి ఇది.
ఈ మెగా కంటెయినర్ టర్మినల్ ప్రాజెక్ట్ నిర్వహణ సామర్ధ్యం సంవత్సరానికి 2.19 మిలియన్ టీఈయు. కన్సెషనీర్‌కు ప్రాజెక్టు వ్యయం 4243.64 కోట్ల రూపాయలు కాగా అథారిటీకి 296.20 కోట్ల రూపాయలుగా ఉండవచ్చు. ఈ ప్రాజెక్ట్ కార్యకలాపాలు 2026 సంవత్సరాంభంలో ప్రారంభమవుతాయని అంచనా.సాగర్ మాలా, పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయడంతో పాటుగా పీఎంఓ నేరుగా దీనిని పర్యవేక్షించనుంది. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపడంతో పాటుగా అవసరమైన పర్యావరణ అనుమతులు కూడా లభించాయి.
విజయవంతంగా ఈ ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల కాండ్లాలోని దీన్‌దయాళ్ పోర్ట్ వద్ద మెగా కంటెయినర్ హ్యాండ్లింగ్‌లో నూతన అధ్యాయం ప్రారంభం కావడంతో పాటుగా గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఆర్ధిక, సామాజిక అభివృద్ధి పరంగా సానుకూల ప్రభావం తీసుకురావడం సాధ్యమవుతుంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటం వల్ల దేశంలో కంటెయినర్ లాజిస్టిక్స్ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి.