Friday, November 22, 2024

ముగిసిన రాహుల్ యాత్ర

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ ఐదు మాసాల క్రితం తమిళనాడులోని కన్యాకుమారిలో తొలి అడుగు వేసి మొదలు పెట్టిన ‘భారత్ జోడో’ (భారత దేశాన్ని సమైక్య పరచడం) యాత్ర కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసింది. వంద రోజుల్లో 4000 కి.మీ కాలి నడకన పూర్తి చేసిన ఈ యాత్ర దేశ ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాని మోడీ పాలనలో సాగుతున్న హక్కుల అణచివేతను, ప్రజాస్వామ్య విలువల హననాన్ని వ్యతిరేకిస్తున్న వారు, ప్రజాతంత్ర భావజాలం గూడుకట్టుకొన్న మేధావులు, ఆలోచనాపరులు రాహుల్‌తో కలిసి నడవడం యాత్రకు ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఆ విధంగా ఇది ఒక విశేష ఘట్టం అనిపించుకొన్నది. యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లో మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడారు.

సోమవారం నాడు అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. కొన్ని శక్తులు సమాజంలో వ్యాప్తి చేస్తున్న భయ విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రజలను కలపడానికే తాను ఈ యాత్రను చేపట్టానని రాహుల్ గాంధీ ప్రకటించారు. తన కుటుంబం , మహాత్మా గాంధీ తనకు నిర్భీతిని బోధించారని అన్నారు. కశ్మీర్ ప్రజల నుంచి హృదయపూర్వక ప్రేమను చవిచూశానని, యాత్రకు దేశమంతటా మంచి స్పందన లభించిందని ప్రకటించారు. ఈ యాత్ర ద్వారా భారత్‌కు ప్రత్యామ్నాయ ముఖాన్ని, దృక్పథాన్ని నెలకొల్పాలని తాను కోరుకొంటున్నట్టు గతంలో తెలియజేసిన రాహుల్ ఎన్నికల రాజకీయాలతో దీనిని ముడిపెట్టరాదని కూడా చెప్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేడున్న పరిస్థితిని చూస్తే దాని పూర్వపు వైభవాన్ని తిరిగి తీసుకు రావడం ఇప్పటికీ సులభ సాధ్యం కాదనే అనిపిస్తున్నది.

అందుచేత ఎందుకైనా మంచిదని ఎన్నికల రాజకీయాలతో దీనికి సంబంధం లేదని రాహుల్ ప్రకటించారని భావించాలి. అయితే తన యాత్ర భారతీయ జనతా పార్టీని కనుమరుగు చేయగలదనే ధీమాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అది ఎన్నికల ద్వారా కాక వేరే ఎలా సాధ్యమవుతుంది? వచ్చే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల మీద ఈ యాత్ర ప్రభావం చూపకపోతే దాని వల్ల దేశానికి కలిగే మేలు ఏముంటుంది? అందుచేత ప్రజల హృదయాలను చూరగొన్న మేర ఈ యాత్ర ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేసి బిజెపి విద్వేష రాజకీయాలకు తెర దించినప్పుడే అది సిసలైన విజయాన్ని సాధించిందని చెప్పుకోగలం. కొంత మంది విశ్లేషకులు చెబుతున్నట్టు యాత్ర ఘనంగా జరిగినప్పటికీ ఎన్నికల మీద ప్రభావం చూపకపోతే మొత్తంగా ప్రయోజన శూన్యమే అనుకోవాలి. భారత్‌కు ప్రత్యామ్నాయ కోణాన్ని నెలకొల్పడమంటే ఏమిటి, ఎటువంటిది? ఆర్థిక రంగంలో బిజెపి విధానాలకు, కాంగ్రెస్ పాటించే వాటికి తేడా లేదు. రెండు పార్టీలూ ఆర్థిక సంస్కరణలను నెత్తిన మోసేవే.

హిందుత్వ పట్ల కూడా కాంగ్రెస్‌కు తీవ్ర వ్యతిరేకత వున్నట్టు కనిపించదు. ఎందుకంటే మెజారిటీ మతస్థుల ఓట్లను ఆకట్టుకోడం అనే వ్యూహం నుంచి కాంగ్రెస్ దూరం జరగలేదు. తనను హిందువుగా చూపించుకోడానికే రాహుల్ ప్రాధాన్యమిస్తున్నారు. ఇది దాచేస్తే దాగని సత్యమే. హిందూ మతోన్మాద శక్తులు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను కొనసాగింపజేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఎస్‌సి, బిసి, మైనారిటీలు అనుభవించే ప్రత్యేక సదుపాయాలను రద్దు చేసే దిశగా బిజెపి పాలకులు వ్యూహ రచన చేసి అమలు పరుస్తున్నారు. ముఖ్యంగా రాజ్యాంగంలో గల సాంఘిక, విద్యా సంబంధ వెనుకబాటుతనం ఆధారంగా ఇస్తూ వచ్చిన రిజర్వేషన్లకు స్వస్తి చెప్పే వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఎస్‌సి, బిసి, మైనారిటీలను ఒక్క త్రాటి మీదికి తీసుకు రావడం ద్వారా బిజెపి కుట్ర రాజకీయాన్ని గట్టిగా ఎదిరిస్తాననే ధోరణి కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. రాహుల్ గాంధీ యాత్ర ఆ వైపుగా ఎటువంటి సూచనలను ఇవ్వలేదు.

బిజెపి సృష్టిస్తున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా జాతిని సమైక్య పరచడం, కూడగట్టడం అనే దాని మీదనే రాహుల్ గాంధీ యాత్ర కేంద్రీకృతమైంది గాని, అణగారిన సామాజిక వర్గాలన్నింటినీ ఏకం చేసి పాలనలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచి తద్వారా సెక్యులర్ భారతాన్ని పటిష్టం చేస్తానని ఆయన ఎక్కడా చెప్పలేదు. బిజెపికి బిటీమ్‌గా వున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ దానికి తిరుగులేని ప్రత్యామ్నాయం కాజాలదు. ప్రధాని పదవి మీద దృష్టితో చీలిపోయి వున్న ప్రతిపక్షాలను ఒకే గొడుగు కిందికి తీసుకు వచ్చినప్పుడే బిజెపి వెన్నులో వణుకు పుడుతుంది. అందుకు కాంగ్రెస్ వద్ద వున్న ప్రణాళిక ఏమిటో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్ర నిజమైన విజయం మీద సందేహాలు మిగిలే వుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News