న్యూస్‌డెస్క్: ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే సంస్థలు అప్పుడప్పుడు పొరపాటున నిజాలు బయటపెట్టేస్తుంటాయి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే ప్రభుత్వ సంస్థలు ఒక్కోసారి తమ మనసులోని మాటను సైతం కక్కేస్తుంటాయి. ఇందుకు తాజా ఉదాహరణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆకాశవాణి. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా బిబిసి వార్తాసంస్థ నిర్మలా సీతారామన్ బడ్జెట్‌కు ఎన్ని మార్కులు వేస్తారంటూ ప్రజలకు ప్రశ్న వేసింది. దీనికి ఆకాశవాణి హిందీకి చెందిన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ఇచ్చిన సమాధానం చూసి నెటిజన్లు నివ్వెరపోయారు. బడ్జెట్‌ను ఎన్నికల స్టంట్‌గా అభివర్ణిస్తూ ఆకాశవాణి ట్వీట్ చేయడంతో నెటిజన్లు షాకయ్యారు. అయితే తన తప్పు తెలుసుకుని నాలక్కరుచుకున్న ఆకాశవాణి వెంటనే తన ట్వీట్‌ను డెలిట్ చేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నెటిజన్లు మాత్రం అంతటితో ఊరుకోకుండా ఆకాశవాణిని ఒక ఆట ఆడించారు. తమ వ్యంగ్య కామెంట్లతో ఆకాశవాణికి చుక్కలు చూపించారు. అప్పుడప్పుడు ఆకాశవాణి కూడా ఆత్మసాక్షితో మాట్లాడుతుందని నెటిజన్లు వ్యాఖ్యానించారు.