హైదరాబాద్ : శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు వచ్చే నెల ఉగాది వేడుకల వేళ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలు అటవీ మార్గం మీదుగా ప్రయాణించడానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అనుమతి ఇచ్చింది. అదే విధంగా తెలంగాణ అటవీశాఖ త్వరలోనే నిబంధనలపై మార్గదర్శకాలు విడుదల చేయనున్నది. అటవీ శాఖ ఆధ్వర్యంలోని శిఖరేశ్వరం, దోర్నాల చెక్ పోస్టుల ద్వారా ఉత్సవాల రోజుల్లో రాత్రివేళ కూడా ఆర్టీసీ బస్సులు, భక్తుల వాహనాలను అనుమతించనున్నట్లు ఎపి అటవీ శాఖ తెలిపింది.
ఈ నెల 11వ తేదీ నుంచి 21 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు,వచ్చే నెల ఉగాది వేడుకల వేళ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలు అటవీ మార్గం మీదుగా ప్రయాణించడానికి అనుమతి ఇచ్చారు. రాత్రి వేళల్లో అటవీ మార్గంలో వెళ్లే వాహనాలు గంటకు 40 కి.మీ వేగంతో ప్రయాణించాలని, అటవీ నిబంధనలు పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.