హైదరాబాద్ : ప్రభుత్వం రాసిచ్చింది చదివిన గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమైన ధరణి ప్రస్తావన లేదని బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ అన్నారు. దేశంలోనే భూ ప్రక్షాళన పేరుతో ధరణి అని హడాహుడి చేసిన ప్రభుత్వం దానిలోని తప్పులను సరిచేయడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది రైతుల సర్వే నెంబర్లు తప్పుతడకలతో ఉన్నాయన్నారు. దీంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతుల ఆత్మహత్యల గురించి కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదన్నారు.
వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని ఆయన విమర్శించారు. విద్యుత్ కోసం రైతులు వ్యవసాయ క్షేత్రాలలో జాగారం చేస్తునారని, రైతాంగం గురించి ప్రభుత్వం ఆలోచించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా పేదలకు ఇళ్ళను కట్టించలేదన్నారు. కేంద్రం ఇచ్చిన హడ్కో నిధులతో సిద్ధిపేట, గజ్వెల్ వంటి పట్టణాల్లో మాత్రమే నామమాత్రంగానే ఇళ్ళను నిర్మించారని ఆయన విమర్శించారు. గత రెండు నెలలుగా ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ అభ్యర్ధులు నిరసన తెలుపుతుంటే వాళ్ళ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆయన ఆరోపించారు.