చెన్నై: ప్రముఖ గాయని, పద్మభూషణ్ గ్రహీత వాణి జైరాం శనివారం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాణి జయరాంకు కేంద్ర ప్రభుత్వం పదభూషణ్ ప్రకటించింది. వాణి జయరాం హఠాన్మరణ వార్త దేశవ్యాప్తంగా సినీ సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన సినీ సంగీత ప్రయాణంలో 10 వేలకు పైగా పాటలను ఆమె పాడారు. మూడు సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డులు పొందారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, గుజరాత్ ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు.
తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆమె తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతోసహా 19 భారతీయ బాషలలో పాటలు ఆలపించారు. కళా తపస్వి కె విశ్వనాథ్ మరణవార్త దిగ్భ్రాంతి నుంచి తెలుగు ప్రజలు ఇంకా కోలుకోకముందే వాణి జయరాం మరణించారన్న వార్త ప్రజలను తీవ్ర విషాదంలో ముంచివేసింది. 1945 నవంబర్ 30న తమిళనాడులోని వెల్లూరులో జన్మించిన వాణి జయరాం అసలు పేరు కళైవాణి. 1973లో అభిమానవంతులు చిత్రంతో ఆమె పాటల పూదోట ప్రారంభమైంది. ఎస్‌పి కోదండపాణి స్వరకల్పనలో ఆమె పాడిన తొలి పాట ఎప్పటివలెకాదురా నా స్వామి శ్రోతలను ఆకట్టుకుంది. ఆ తర్వాత 1975లో రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వంలో వచ్చిన పూజ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. పూజలు చేయ పూలు తెచ్చాను, ఎన్నెన్నో జన్మల బంధం వంటి పాటలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేశాయి.
కె విశ్వనాథ్ దర్శకత్వంలో చరిత్ర సృష్టించిన శంకరాభరణం చిత్రంలో వాణి జయరాం ఐదు పాటలు పాడారు. అనంతర కాలంలో విశ్వనాథ్ దర్శకత్వంలో వెలువడిన శృతిలయలు, స్వాతి కిరణం తదితర అనేక చిత్రాలలో వాణి జయరాం అద్భుతమైన పాటలు పాడారు. స్వాతి కిరణం చిత్రం ఆమెకు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును కూడా తెచ్చింది. కెవి మహదేవన్, రాజన్ నాగేంద్ర, సత్యం, చక్రవర్తి, ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా వంటి దిగ్గజ సంగీత దర్శకత్వంలో ఆమె వందలాది పాటలు పాడారు. వయసు పిలిచింది చిత్రంలో ఆమె పాడిన నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా పాట డబ్బింగ్ పాటే అయినప్పటికీ తెలుగు అచ్చ తెలుగు పాటకన్నా ఎక్కువ పాపులర్ కావడం విశేషం. శంకరాభరణంలో తులసి నటించిన శంకరం పాత్రకు పాటలన్నీ వాణి జయరాం పాడారు. స్వాతి కిరణంలో ంజునాథ్ పాత్రకు కూడా ఆమే అన్ని పాటలు పాడారు. వాణి జయరాం మృతితో తెలుగు చిత్రపరిశ్రమే కాక భారతీయ చిత్ర పరిశ్రమే ఒక మధుర ఆయనిని కోల్పోయింది.