Monday, December 23, 2024

పోలీసులు వారిని బలి పశువులను చేశారు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా నగర్ హింస కేసులో నిందితులుగా పేర్కొన్న 11 మందిని కోర్టు శనివారం నిర్దోషులుగా విడుదల చేసింది. పోలీసులు అసలు హింసకు పాల్పడిన వారిని పట్టుకోలేకపోయరని, అమాయకులైన నిందితులను బలిపశువులుగా చేస్తూ కేసులు పెట్టారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు విడుదల చేసిన వారిలో విద్యార్థి హక్కుల ఉద్యమ నేతలు షర్జీల్ ఇమామ్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హాలు కూడా ఉన్నారు. అయితే నిందితుల్లో మహ్మద్ ఇల్యాస్ అనే ఒకరిపై మాత్రం అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ముందుకు తీసుకువచ్చిన చార్జిషీట్, మూడు అనుబంధ చార్జిషీట్లను పరిశీలించిన తర్వాత పోలీసులు నేరం వెనుక ఉన్న అసలైన దోషులను పట్టుకున్నదనే అభిప్రాయానికిన్యాయస్థానం రాలేకపోతోందని, ఏదో కొంతమందిని బలిపశువులను మాత్రం పట్టుకోగలిగిందని అర్థం అవుతోందని అదనపు సెషన్స్ జడ్జి అరుల్ వర్మ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు.

2019 డిసెంబర్‌లో ఢిల్లీలోని జామియానగర్ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం( సిఎఎ)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వ్యక్తులకు, పోలీసులకు మధ్య చెలరేగిన హింసకు సంబంధించి ఈ 11 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో వందలాది మంది నిరసనకారులు ఉండి ఉంటారని, గుంపులో ఉన్న కొంతమంది అసాంఘిక శక్తులు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి ఉండవచ్చని జడ్జి అభిప్రాయపడ్డారు. అయితే నిందితులు ఆ కల్లోలంలో పాలు పంచుకున్నారా అని ప్రశ్నకు మాత్రం లేదనే సమాధానం కనిపిస్తుందని ఆయన అన్నారు. ఈ 11 మంది నిందితులపై పోలీసులు ఏమాత్రం బాధ్యత లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తోందని జడ్జి వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా పోలీసుల చర్య పౌరుల ప్రాథమిక హక్కు అయిన భావప్రకటనా స్వేచ్ఛకు భంగకరంగా ఉందని, నిరసన తెలియజేసే పౌరుల హక్కువిషయంలో అంత తేలిగ్గా జోక్యం చేసుకోకూడదని న్యాయమూర్తి అరుల్‌వర్మ స్పష్టం చేశారు.కాగా నిందితుల్లో ఒకరైన ఇల్యాస్ మండుతున్న టైరును పోలీసుల పైకి విసురుతున్నట్లుగా ఫోటోల్లో కనిపిస్తున్నందున అతనిపై మాత్రం అభియోగాలను నమోదు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News