Friday, December 20, 2024

ఆగిన స్వరధుని

- Advertisement -
- Advertisement -

చెన్నై: బహుళ భాషల , బహు పాటల గాయని వాణీజయరాం కన్నుమూశారు. తొలి మంచు తరగల మేళవింపుల స్వరధుని ఆగిపోయింది. 19 భాషలలో 10,000కు పైగా పాటలకు నిత్యనూతన జీవితత్వం ఆపాదించిన గళం నిలిచిపోయింది. 77 సంవత్సరాల వాణీ జయరాం చెన్నైలోన ఆమె స్వగృహంలో మృతి చెందారు. పలు పురస్కారాలు, ఇటీవలే భారత ప్రభుత్వం ఆమెకు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది. ఎల్లలెరుగని, రాష్ట్రాలు ప్రాంతీయ భాషల హద్దులు లేని సుమధురగీతాలాపనకర్తకు ఈ విధంగా అత్యున్నత స్థాయి పురస్కార శ్రేణిలో అవార్డు వచ్చి ఆమె జాతీయతకు గుర్తింపు దక్కింది. చెన్నైలోని డౌన్‌టౌన్ ప్రాంతంలో నివాసంలో ఒంటరిగా ఉంటున్న వాణీ జయరాం తెల్లవారుజామున మృతి చెంది ఉండటాన్ని ఇంటి పనిమనిషి ఒకరు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులకు ఆమె నుదుటిపై గాయాలు కన్పించాయి. దీనితో ఆమె మృతి అనుమానాస్పదం అయింది.

పూర్తి స్థాయిలో విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. 1970లో గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమా గుడ్డిలో ఆమె పాడిన బోలేరే పపీ హరా పాట మంచు శకలాల మధ్య ప్రవాహం వంటి అనుభూతినే కల్పించింది. ఈ పాటతో ఆమె ఖ్యాతి జాతీయ స్థాయిని చేరుకుంది. ఈ పాట ఆలాపనకు ఆమెకు తాన్‌సేన్ పురస్కారంతో పాటు నాలుగు ఇతర అవార్డులు దక్కాయి. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30వ తేదీన జన్మించిన వాణి జయరాం అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీజయరాం ఐదో సంతానం. కర్ణాటక సంగీతంలో సమూల అధ్యయనం చేసిన ఆమె ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలతో చిన్ననాటనే కచేరీలతో ఆకట్టుకున్నారు. పుట్టింది తమిళ ఇంట అయినా ఈ వాణీ సంగీతానికి గానానికి ఎల్లలు లేవనే అంశాన్ని తన గాత్రంతో చాటారు. తెలుగు , తమిళ, హిందీ, మళయాళ, భోజ్‌పురి, మరాఠీ భాషలలో శృతిలయలు ప్రాణంగా భాషా అపభ్రంశాలు అపశృతులు లేకుండా పాడారు.

తన తరం గాయనీ మణుల్లో తనకు అంటూ ప్రత్యేక స్వర విశిష్టతను సంతరించుకున్నారు. పిల్లలు లేని వాణీ జయరాం భర్త జయరాం 2018లో కన్నుమూశారు. తెల్లవారుజామునే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. ఆమె ఇంటికి వచ్చిన పోలీసులు ఫ్లాట్ తలుపులను మరో తాళంతో తెరిచి చూడగా ఆమె మృతి చెందినట్లు వెల్లడైంది. ఇంటి ఆడపనిమనిషి తెల్లవారుజామున ఇంటికివచ్చి బెల్ కొట్టినా ఎంతకూ తలుపు తెరవకపోవడంతో బంధువులకు విషయం చెప్పారు. వారు వచ్చిన తరువాత వాణీజయరాం మరణం వార్త వెల్లడైంది. తనకు ఇటీవలే ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును వాణీజయరాం ఇంతవరకూ తీసుకోలేదు. ఆమెకు ఎటువంటి అనారోగ్యం లేదని, సందర్శకులు వచ్చినప్పుడు మాట్లాడటం, తరచూ ఇటీవలి కాలంలో వస్తున్న అభినందనల ఫోన్లకు సమాధానంతో తీరిక లేకుండా ఉండే వారని ఇంటి పనిమనిషి మలర్‌కోడి తెలిపారు. వాణీజయరాం వద్ద ఆమె గత పది సంవత్సరాలుగా పనిచేస్తోంది.

ఆమె గానజీవితంలో 50 ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానం ఉంది. ప్రముఖ సంగీత దర్శకులు వసంత్ దేశాయ్, ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, ఎస్‌పి కోదండపాణి, మహాదేవన్ వంటి వారెందరి సంగీత దర్శకత్వంలోనో వెలువడ్డ ఆణిముత్యాల వంటి పాటలను ఆమె సోలోగా యుగళంగా పాడారు. తనకు పిల్లలు లేరనే బాధలేదని, తన పాటలు తన స్వరానికి సమకూరే సంగీతంతో వెలువడే పాటలే తనకు సంతానం వంటివని తరచూ ఆమెఇంటర్వూలలో తెలిపేవారు. ఎందరో ప్రముఖ సంగీతకళాకారులకు పలు విధాలుగా అవకాశం కల్పించిన ఆకాశవాణి రేడియోలో తమ పదవ ఏటనే తొలి పాట అవకాశాన్ని పొందారు . పెళ్లికి ముందు కేవలం కర్ణాటక సంగీతాలాపనకు పరిమితం అయిన వాణీ తరువాత భర్త ప్రోత్సాహంతో హిందూస్థానీ, సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. బొంబాయిలో 1969లో తొలిసారిగా నిర్వహించిన కచేరీ ఆమె గానజీవితాన్ని మలుపు తిప్పింది. బహుభాషా గాయనిగా ముందుకు సాగదీసింది.

ఎప్పటివలె కాదురా స్వామి పాట ఎప్పటికీ హిటే

తెలుగు వారికి తొలిసారిగా ఎస్‌పి కోదండపాణి తమ అభిమానవంతుడు చిత్రంలో వాణిజయరాంతో ఎప్పటివలె కాదురా స్వామి పాటను వాణీజయరాంతో పాడించారు. ఇది ఆమె తొలి తెలుగు పాట అయింది. శంకరాభరణంలో మానస సంచరరే, స్వాతి కిరణంలో ఆనతి నియ్యరా హరా, ఎన్నెన్నో జన్మల బంధం, ఒక బృందావనం వంటి పలు పాటలు ఒక్కోటి కోటి ముత్యాలస్వరాలుగా మారాయి. సంక్లిష్టమైన పాటలకు, నూతనమైన స్వరకల్పనలకు సంగీతదర్శకులు ఎక్కువగా వాణీనే ఎంచుకునే వారు. చిన్ననాటనే స్కూలు దశలోనే ఆమె అప్పటి సంగీత విద్వాంసులు కడలూరు శ్రీనివాస అయ్యంగార్ వద్ద సంగీతంలో ఓనమాలు దిద్దుకున్నారు. అప్పట్లో ఆమె కుటుంబంలో శాస్త్రీయ సంగీతం తప్ప ఇతరత్రా గానాలాపన కానీ పాటలు వినడం కానీ నిషిద్ధం . అయితే రేడియోను తన వద్ద పెట్టుకుని, ఎవరికి విన్పించకుండా సినిమా పాటలు, జానపద సంగీతం పాటలు వినే వాణీ ఆ తరువాత అనేక రకాల పాటలతో కోట్లాది మంది ఆమె పాటలు వినే దశకు చేరేలా చేసి వెళ్లారు.

సిఎం స్టాలిన్ ఇతర ప్రముఖుల సంతాపం

వాణీజయరాం మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవలే తాను ఆమెను పద్మభూషణ్ విజేత అయినందుకు అభినందించానని , ఈ పురస్కారం అందుకోకుండానే ఆమె జీవితం ముగియడం బాధాకరం అని వ్యాఖ్యానించారు. వాణీజయరాం మృతి పట్ల తమిళనాడుకు చెందిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఓ ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె నిరాడంబర వ్యక్తి అని ఇతర గాయనీగాయకుల సంగీత కళను కూడా మెచ్చుకుని ప్రోత్సాహించే వారని సింగర్ మహతి తెలిపారు.

సంగీత ప్రపంచానికితీరని లోటు : సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ సినీ నేపథ్య గాయని పద్మభూషణ్ వాణీ జయరామ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. 14 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడిన వాణీ జయరాం సినీ రంగానికి అందించిన సేవలను సిఎం గుర్తు చేసుకున్నారు. ఆమె మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. వాణీ జయరాం కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News