ఆడవాళ్లకన్నా మగవాళ్లపైనే ఎందుకు కరోనా మహమ్మారి తీవ్రంగా ఉంటుంది ? మరణాలు కూడా ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి ? దీనికి ఆధారాలను శాస్త్రవేత్తలు కనుగొన గలిగారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఆడవాళ్ల కన్నా మగవాళ్లే అధ్వాన్నంగా ఉంటున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే వైరస్ ఆడవాళ్ల లోని ఊపిరి తిత్తుల కణజాలానికి బదులు కొవ్వు కణజాలం ( fat tissue)పై వెంటనే దాడి చేస్తాయి. దీనికి ఆడ ఎలుకలపై చేసిన ప్రయోగాల ఫలితాలను పరిశోధకులు రుజువుగా చూపిస్తున్నారు. ఆడ ఎలుకలో కొవ్వు కణజాలం సార్స్ కొవి 2 ( కరోనా) వైరస్‌కు ఆశ్రయంగా ఉంటోంది. అందువల్ల ఊపిరి తిత్తులు వీటి బారిన పడకుండా ఉంటున్నాయి.
అదీగాక రోగ నిరోధక కణాలు చొరబడి అడ్డుపడడం వల్ల వైరస్ దాడి ఊపిరి తిత్తులపై సాధారణంగా కనిపించడం లేదని పరిశోధకులు వివరించారు. అయితే కొవిడ్ దాడితో కొవ్వుకణాలు నాశనమౌతుంటాయి. ఇక మగవాళ్ల గురించి ఆలోచిస్తే వీరి ఊపిరితిత్తుల్లో వైరస్ చాలా ఎక్కువగా ఉంటుంది. హెచ్ఎ సిఇ 2 అనే జన్యుమార్పిడి ఆడా మగ ఎలుకలపై పరిశోధకులు ప్రయోగాలు చేశారు. ఒకదాని ఫలితాలు మరొక దాని ఫలితాలతో పోల్చి విశ్లేషించారు. కరోనా వైరస్‌కు హెచ్ఎ సిఇ 2 ప్రవేశ గ్రాహకంగా పనిచేస్తుంది. స్పైక్ ప్రొటీన్లను కట్టడి చేయడం ద్వారా మనుషులకు వైరస్ సోకేలా వీలు కల్పిస్తుంది. ఈ ప్రయోగాల వల్ల తేలిందేమిటంటే మగ ఎలుకల కన్నా ఆడ ఎలుకలు కొవ్వు కణజాలాన్ని విపరీతంగా నష్టపోయాయి. గత ఏడాది వెల్లడైన అధ్యయనంలో ఆడవాళ్ల కన్నా వైరస్ మగవాళ్ల ఊపిరితిత్తుల పైనే దాడి చేస్తుందని వెల్లడి కాగా, ఇప్పటి అధ్యయనంలో వైరస్ సోకడంలో ఆడ, మగవారి మధ్య తేడాలకు కారణాలేమిటో కనుగొనగలిగారు. దీనివల్ల ఆడవాళ్ల కన్నా మగవాళ్లే కరోనాకు ఎక్కువగా బలవుతుంటారని స్ఫష్టమైంది.