సూర్యాపేట/చివ్వెంల : ఓ లింగా…ఓ లింగా నామస్మణం…భేరీల మోతలు…గజ్జెల చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలతో పెద్దగట్టు పరిసరాలు మారుమోగిపోతున్నాయి. పెద్దగట్టు (గొళ్లగట్టు) లింగమంతుల స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. మహిళల శివాలతో, కాళ్ల గజ్జెలు, భేరీల చప్పుళ్లతో, కత్తులు, త్రిశూలాల విన్యాసాలతో యదవులు రెండవ రోజు సోమవారం లింగమంతుల స్వామి మొక్కులు తీర్చుకునేందుకు పెద్దగట్టుకు భారీగా చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి దేవరపెట్టె పెద్దగట్టుకు చేరుకున్న అనంతరం యాదవుల కులదైవం లింగమంతుల స్వామికి బోనం చెల్లించేందుకు వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుండే బోనంతో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం మధ్యాహ్నానికి ఇష్ట దైవానికి మొక్కలు చెల్లించుకుని బంధుమిత్రులతో వింధు ఆరగించిన భక్తులు తమ తమ స్వస్థలాలకు తిరిగు ప్రయాణం ప్రారంభించారు.
లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దగట్టు పై బారులు తీరారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత సోమవారం తెల్లవారుజామున ముద్దెరపోలు, ముత్యాల పోలు, లగ్గంపోలు పోసే కార్యక్రమం ఉంటుంది. ఇది జాతరలో ప్రత్యేకమైనది. ప్రారంభ ఘట్టంగా చెప్పవచ్చును. బైకాని వారు తమ వాయిద్యాలను వాయిస్తూ, గొల్లల చరిత్రను కథ రూపంలో చెపుతూ ఆలయ హక్కుదారులైన మున్న, మెంతబోయిన, గొర్లవారి సమక్షంలో ముద్దెర పోలు కార్యక్రమం చేస్తారు. బైకాని ప్రధాన పూజారి లింగమంతుల స్వామి, చౌడమ్మ గర్భగుడి మధ్య ప్రాంతంలో పెట్టిన దేవరపెట్టె ముందు పొడి పసుపుతో దీర్ఘ చతురస్రాకాంలో అడ్డం తొమ్మిది గీతలు, నిలువు తొమ్మిది గీతలతో ఒక ముగ్గును, తడి పసుపుతో దీర్ఘ చతురస్రాకాంలో అడ్డం తొమ్మిది గీతలు, నిలువు తొమ్మిది గీతలతో మరోక ముగ్గును పరుస్తారు.
ఒక ముగ్గు పై ఒ పోలు ముంత, ఇంకొక ముగ్గు పై ఇంకొక పోలుముంతు పెట్టి, ఈ రెండు పోలు ముంతలను కలుపుతూ పోలుదారం చుడతారు. ఈ పోలు ముంతలలో పాలు, పెరుగు, నెయ్యి పోసి తమలపాకులతో పాటు మామిడి ఆకులను పెడతారు. పోలు ముంతల ముందు రెండు మట్టి కుంచడులు పెట్టి వాటిలో నెయ్యి, నువ్వుల నూనె పోసి వత్తుల పెట్టి దీపాలను వెలగిస్తారు. వీటినే దిబ్బం కంచుడులు అంటారు. దీనినే ముద్దెర పోలు/ముత్యాల పోలు అంటారు. ఈ ముద్దెర పోలు ముందు తెల్లని రుమాలు పరిచి దారి పై భైవర, పోతరాజు ఆకారాలను బియ్యంతో రాస్తారు. భైరవ ఆకారం పై తొమ్మిది కుడకలు పెడతారు. ప్రతి కుడకలో ఒక రూపాయి పోక ఖర్జూరంతో పాటు తమలపాకులు పెడతారు. బైకాని వారు మైసాక్షితో ధూపం వేసి, కర్పూరాలు వెలగించి హారతులు ఇస్తారు. అలాగే భైరవ ఆకారం పై కూడా దీపాలు పెట్టి వెలింగించి హారతులు ఇస్తారు.
బోనాల సమర్పణ
ఆచారం ప్రకారం ముందుగా హక్కుదారులైన మున్న (రాజులు, మెంతబోయిన (పూజార్లు) తమ ఇండ్ల నుండి తెచ్చిన బియ్యంతో రెండు బోనాలు వండి ఆలంకరించి సమర్పిస్తారు. వీటినే రాశి బోనం, సందవసర బోనం అంటారు. బైకాని వారు వాయిద్యాలు వాయిస్తుండగా మున్న వారు రాశి బోనంను, మెంతబోయిన వారు సందవసర బోనంను నెత్తిన పెట్టుకొని ముద్దెరపోలు వద్దకు తీసుకువెళ్తారు. వీటిని ముద్దెర పోలు ముందర ఇరువైపుల పెడతారు. రాశి బోనం నుండి కొంత అన్నం తీసి తమలపాకులతో పెట్టి దేవరపెట్టెకు నాలుగు మూలల పెడతారు. అలాగే పొడి పసుపుతో వేసిన ముగ్గు పై రెండు తమలపాకులలో, తడి పసుపుతో వేసిన ముగ్గు పై రెండు తమకపాకులలో అన్నమును నైవేద్యంగా పెడతారు.
మున్న, మెంతబోయిన వారు రాశిబోనం నుండి కొంత అన్నంను తీసి లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టి మొక్కుతారు. మున్న, మెంతబోయిన వారు సందవసర బోనంకు అలంకరించిన అవసరాలను (కటార్లను) ఆనించుతారు. బోనం నుండి కొంత అన్నమును తీసి వస్త్రము పై కుప్పగా పోసి పసుపు ముగ్గు వేసి నైవేద్యంగా సమర్పించుతారు. బోనాల సమర్పణ తర్వాత బైకాని వారు ఆచారం ప్రకారం మున్న, మెంతబోయిన వారు మాత్రమే బొట్టుపెట్టి కంకణాలను కడతారు. బొట్టు కంకణం ఇతరులకు నిషిద్దంగా పరిగణిస్తారు. చివరగా మొదట ఎత్తిన వ్యక్తికి బైకాని పూజారి అవుసరాలతో పాటు పసుపు ముగ్గు పరిచిన వస్త్రమును పైకెత్తి అవుసరాలు అంటించుకున్న భాగంలో పసపన పూస్తారు. వీరి తరువాత హక్కదారులైన మెంతబోయిన (పూజారులు) 5గురు వరుసగా ఒ లింగా…ఓ లింగా అని స్మరిస్తూ అవుసరాలను పైకెత్తి వీరు మాత్రం కడుపుకు ఇరువైపుల ఆనించుకుంటారు.
హంసరాలు ఎత్తుట (కటార్లు)
బైకాని వారు ముద్దెరపోలు ముందు తెల్లని వస్త్రమును పరిచి దాని పై పసుపు చక్రం ఆకారంలో ముగు వేస్తారు. ఈ ముగ్గు పై నూనె పూసి పసుపు, కుంకుమ బొట్టు పెట్టి అలంకరించబడిన రెండు హంసరాలను ఆకారంలో పెడతారు. వీటిని ముందుగా హక్కుదారులైన మున్న (రాజు) వారు 5గురు వరుసగా ఒ లింగా…ఓ లింగా అని స్మరిస్తూ హంసరాలను పైకెత్తి తమ చాతికి ఇరువైపుల ఆనించుకుంటారు.
జంతుబలి : ముద్దెర పోలు కార్యక్రమం తర్వాత లింగమంతుల స్వామి చౌడమ్మ తల్లి ఆలయం ఎదురుగా ఉన్న పోచమ్మ పోతరాజులు రాతి విగ్రహాల దగ్గర జంతుబలి కార్యక్రమం జరుగుతుంది.
బొట్టు స్థలం : తల్లికి ఎదురుగా నిలబెట్టి హక్కుదారులైన మున్న, మెంతబోయిన వారు తమ సాంప్రదాయ హంసరాలను గొర్రెలకు ఆనించి మొక్కుతారు. తర్వాత మూడు గొర్రెలను జడత పడతారు. జడత ఇచ్చిన వెంటనే చౌడమ్మ తల్లికి బలి ఇస్తారు.
జాగిలాల పోసుట : సోమవారం మధ్యాహ్నాం జాగిలాలకు పోసే కార్యక్రమం నిర్వహిస్తారు. మున్న వారు నిష్టతో ఉపవాసం ఉండి తెచ్చిన బద్దిపాల గొర్రెను చౌడమ్మ తల్లికి బలిస్తారు. ఈ విధంగా జాగిలాలవలె నటిస్తూ, మున్న వారు పోసిన అన్నమును తింటే తమ పశుసందప అభివృద్ధి చెందుతుందని మెంతబోయిన వారి నమ్మకం. దీనితో రెండవ రోజున కార్యక్రమాలు ముగుస్తాయి.