హైదరాబాద్ : నల్లగొండ జిల్లా దామరచర్లలో టిఎస్ జెన్‌కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్ధం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే ప్లాంట్‌ను ప్రారంభిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో అసెంబ్లీలో అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్లాంటు నుంచి కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నానని హరీష్ రావు తెలిపారు. భద్రాద్రిలో 1080 మెగావాట్ల సామర్థంతో 4 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు.
800 మెగావాట్ల సామర్థం కలిగిన కొత్తగూడెం విద్యుత్ ప్లాంట్‌లోనూ ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1200 మెగావాట్ల సామర్థంతో సింగరేణి నిర్మించిన విద్యుదుత్పత్తి కేంద్రంలోనూ ఉత్పత్తి ప్రారంభమైందన్నారు.దీనికి అదనంగా 8,085 మెగావాట్ల ఉత్పత్తి సామర్థం కలిగిన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని హరీష్ రావు తెలిపారు. కాగా అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని హరీష్ రావు గుర్తు చేశారు.