ఎలక్టోరల్ బాండ్ల పథకం గురించి నౌకాదళ మాజీ అధికారి కమొడోర్ లోకేష్ భాత్రా లేవనెత్తిన తీవ్రమైన ప్రశ్నలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు వరకు సమాధానం ఇవ్వలేదు. “జర్నలిస్టు గౌరీ లంకేష్ హిందూ అయినప్పటికీ హిందూత్వ సంస్థల సభ్యులే ఆమెను చంపేశారు. ఆమె ద్రోహి, జాతి వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి. ఆమె మృతి తరువాత మోడీ, ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలకు వ్యతిరేకంగా రాయడానికి ఎవరికైనా ధైర్యముందా? ఎవరు రాసినా వదిలే ప్రసక్తే లేదు. ముస్లింలు సహా ఈ ద్రోహులను నిర్మూలిస్తాం.” డ్బ్భై ఆరేళ్ళ నౌకాదళ మాజీ అధికారి కమొడోర్ లోకేష్ భాత్రాకు వచ్చిన అనేకానేక బెదిరింపులలో ఇదొక బెదిరింపు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద అనేక విషయాలను బయటపెట్టి పోరాడుతున్న ఈ యుద్ధ వీరుడు పారదర్శకంగా ఉండే సంఘ సేవకుడు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకం గురించి కొన్ని తీవ్రమైన ప్రశ్నలను ఆయన లేవనెత్తారు. గుర్తు తెలియని వ్యక్తుల బెదిరింపులు, హెచ్చరికలను లెక్కచేయని భాత్రా ఆర్‌టిఐ ద్వారా సంస్కరణలు తేవాలని భావిస్తున్నారు. “సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ప్రభుత్వ పాలనలో నాకు పాలు పంచుకునే అవకాశం కల్పిస్తోంది” అని ‘ద న్యూస్ మినిట్’ తో మాట్లాడుతూ అన్నారు.
భారత నౌకాదళంలోకి 1967 మే 22న ప్రవేశించిన భాత్రా హైడ్రోగ్రాఫర్ (సముద్రపు లోతును, అందులోని సొర చేపలను, శిథిలాలను పసిగట్టగల నిపుణుడు) గా 36 ఏళ్ళు సేవలందించారు. కమొడోర్ లోకేష్ భాత్రా 2002 డిసెంబర్‌లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఎలాంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర పదవీ చేపట్టరాదని నిర్ణయించుకున్నారు. “నేను ఏమనుకున్నానో అది చేయదలుచుకున్నాను కనుక, ఈ రోజు వరకు ఏ పదవీ బాధ్యతలు చేపట్టలేద”న్నారు. తాను చెప్పిన మాటపైన నిజాయితీగా నిలబడుతూ, 2005లో ఆర్‌టిఐ అమలులోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంలో పారదర్శకత కోసం ఒక ధర్మయుద్దం చేస్తున్నారు. ఫలితంగా ఆర్‌టిఐ హిందీలో వడమే కాకుండా, 2007లో 19 మంది హత్యకు గురైన నిథారి (నోయిడా) కేసు విచారణలో పోలీసుల అవకతవకలను బయట పెట్టింది. బైటపడని ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల ఖర్చు, ప్రధాని సహాయ నిధి, కరోనా సమయంలో చేపట్టిన సహాయ పునరావాస ప్రధాని నిధి(సిఎఆర్‌ఇఎస్) గురించిన అనేక విషయాలు బైటకొచ్చాయి. భారత దేశం వెలుపల జీవించే వారు కూడా ఎలక్ట్రానిక్ ఇండియన్ పోస్టల్ ఆర్డ్‌ర్ ద్వారా ఆర్‌టిఐ నుంచి సమాచారాన్ని పొందే అవకాశం కూడా వీరి పోరాటం ద్వారానే లభించింది.
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల వల్ల నిధులు ఇచ్చేవారు, నిధులు పొందే పార్టీల వివరాలు రహస్యంగా ఉండేవి. ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారనేది ఓటర్లకు తెలిసేది కాదు. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని 2017 బడ్జెట్‌లో నాటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. “ఆయన తొలి మాటలు నా చెవులకు సంగీతంలా వినిపించాయి. ఆ సమయంలో మొత్తం విన్నాక దాని మరొక రూపం తెలిసిపోయింది. అది నన్ను భయపెట్టింది” ఇదే దాని లోతుపాతులు తవ్వడానికి దారి చూపింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకం 2018లో బైటికొచ్చింది. ఏ మాత్రం పారదర్శకంగా లేని ఈ పథకం గురించిన వివరాలు వెలికి తీయడానికి కమొడోర్ భాత్రా ఆర్‌టిఐ కింద 80 వినతులు సమర్పించారు. పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన చేసిన పోరాటం వల్ల 2019లో ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన లొసుగులు బైటపడ్డాయి.
భారత రాజకీయ వ్యవస్థలోకి అనామక నిధులు వచ్చేలా మోడీ ప్రభుత్వం ఎలా చేసిందో సహేతుకమైన ఆరు భాగాలుగా వెల్లడించడంతో వాటి పట్ల రిజర్వ్‌బ్యాంక్, ఎన్నికల కమిషన్ కూడా అభ్యంతరాలు చెప్పే పరిస్థితి ఏర్పడింది. “దాత పేరు బహిర్గతం కాకుండా ఈ పథకాన్ని రూపొందించారు. దీనికి ఎన్నికల కమిషన్ అభ్యతరం చెప్పగా, అభ్యంతరాలు చెప్పడానికి ఈ వివరాలు చాలవని ఆర్‌బిఐ పేర్కొంది. ఈ పథకం కరెన్సీ నోట్‌లా ఉందే తప్ప, బాండ్ కొనుగోలు దారుడి పేరు కానీ, అమ్మకం దారుడి పేరు కానీ లేదు. దీన్ని నిర్వహించే భారత ప్రభాత్వానికి మాత్రమే ఆ విషయాలు తెలుస్తాయి.
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరు అధికారంలో ఉంటే వారికి నమ్మకంగా ఉంటుంది. ఎవరు ఎవరికి నిధులిస్తున్నారో కేంద్రానికి తెలిసిపోవడంతో, ప్రతిపక్ష పార్టీలకు నిధులు ఇచ్చేవారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి మనందరిపైనా ప్రభావం కలగచేస్తుంది” అని కమొడోర్ భాత్రా చెప్పారు. ఆర్‌టిఐ నుంచి సమాచారం తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడం, ప్రభుత్వ శాఖల నుంచి సమాధానం రాబట్టడంతో సరిపెట్టుకోకుండా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో అనేక ప్రభుత్వ విభాగాలతో పాటు, ఆర్‌బిఐ, ఇసిఐ వంటి స్వతంత్ర సంస్థల పాత్ర కూడా ఉంది. ఒక ప్రభుత్వ శాఖ నుంచి ఒక సమాచారం వస్తే, దానిలో ఏదో కొత్త విషయం ఉంటుంది కనుక మరింత సమాచారం కొరకు తొవ్వితీయాలి. ఎలక్టోరల్ బాండ్ల పథకం ఎక్కడి నుంచి ప్రారంభమైందో తవ్వితే, ఈ ఆలోచన అసలు ఏ విభాగం నుంచి ఈ పథకం పుట్టిందో ఆయన కనుకొనగలిగారు. “రెవెన్యూ విభాగం మౌనం దాల్చడం వల్ల ఈ ఆలోచన ఎక్కడి నుంచి పుట్టిందో వెల్లడి కాలేదు.
ఒక్కొక్కసారి ఇది ప్రభుత్వ పథకం కాదని, బైటనుంచి వచ్చిన ఆలోచన అని అనిపిస్తుంది. ఈ పథకం ఎవరి మానసపుత్రికో తెలియదు కానీ, రెవెన్యూ విభాగం నుంచే ఇది పుట్టుకొచ్చింది.” అని అన్నారు. ఈ యుద్ధవీరుడు ఎక్కడా వెనుకాడలేదు. ‘ద న్యూస్ మినిట్’ తో మాట్లాడుతూనే, ఈ పథకాన్ని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ఆర్‌టిఐ ద్వారా వచ్చిన సమాచారంతో లెక్కలేయడం మొదలు పెట్టారు. “ఎలక్టోరల్ బాండ్లు ముద్రించడానికి, బ్యాంకులకు ఇచ్చే కమీషన్లకు పన్ను చెల్లింపుదారాల నుంచి వచ్చిన దానిలో 10.23 కోట్ల రూపాయలను వెచ్చించారు. పన్నుల మినహాయంపుతో కోటీశ్వర్లు ఈ ఎలక్టోరల్ బాండ్లను కొంటున్నారు, రాజకీయ పార్టీలు తీసుకుంటున్నాయి” అని వివరించారు.
మార్చి 2018 నుంచి డిసెంబర్ 2022 వరకు 11,699,84 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను 24 దశల్లో అమ్మిన సమాచారాన్ని ఈ ఏడాది జనవరి 21న ఆర్‌టిఐ ద్వారా పొందినట్టు కమొడోర్ భాత్రా ‘ద న్యూస్ మినిట్’కు వెల్లడించారు. అత్యధిక ఎలక్టోరల్ బాండ్లు అమ్మిన నగరాలుగా హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా నమోదయ్యాయి. వీటిని ఎక్కువ సొమ్ము చేసుకున్న నగరాలలో న్యూఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా ఉన్నాయి. ఢిల్లీ 65,12 శాతం, హైదరాబాదు 12.17 శాతం, కోల్‌కతా 8.8 శాతం సొమ్ము చేసుకున్నాయి. వివిధ రాష్ట్రాలలో కేటాయించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలలోనే ఈ బాండ్లు లభిస్తాయి. ఈ బాండ్లు వెయ్యి, పది వేలు, లక్ష, పది లక్షలు, కోటి రూపాయల చొప్పునే లభిస్తాయి. ఒక్కొక్కటి కోటి రూపాయల విలువైన 20,734 బాండ్లను ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ నుంచే అమ్ముడుపోయాయని 2018లో ఆర్‌టిఐ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ఇచ్చింది.
కోటి రూపాయల విలువ చేసే బాండ్లు గరిష్ఠంగా ఢిల్లీ నుంచి 65.31 శాతం, హైదరాబాదులో 12.14 శాతం, కోల్‌కతాలో 8.54 శాతం కొనుగోలు చేశారు. పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు, వాటి గ్రూపులు మాత్రమే కోటి రూపాయల బాండ్లను కొనుగోలు చేశాయనేది బహిర్గతం. ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం 2018లో మొదలు పెట్టినప్పటి నుంచి బిజెపికే అత్యధికంగా 5,270 కోట్ల రూపాయల నిధులు సమకూరాయని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన సమాచారం ద్వారా బహిర్గతమైందని ఎన్‌డిటివి వెల్లడించింది. తరువాత స్థానంలో ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 964 కోట్ల రూపాయలు లభించాయి.
మూడవ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్‌కు 767 కోట్ల రూపాయలు లభించాయి. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే పెద్ద మొత్తంలో నిధులు ముడుతున్నాయని కమొడోర్ భాత్రా సేకరించిన సమాచారం వెల్లడిస్తోంది. ఎలక్టోరల్ బాండ్ల అమ్మకంలో 2018 నుంచి డిసెంబర్ 2022 వరకు వెయ్యి రూపాయల బాండ్లు కేవలం 0. 01 శాతం మాత్రమే కాగా, కోటి రూపాయల బాండ్ల అమ్మకం విలువ 94. 41శాతం. పెద్ద మొత్తం ఖరీదు గల బాండ్లను కార్పొరేట్ శక్తులే కొంటాయన్నది వేరే చెప్పనవసరం లేదు. పెద్ద మొత్తం ఖరీదు గల బాండ్లను ఇలా కొనే కార్పొరేట్ శక్తులు రాజకీయ పార్టీల నుంచి ఏం ఆశిస్తున్నాయనే ప్రశ్న ఉదయిస్తుంది. పారదర్శకత లేని ఈ ఎలక్టోరల్ బాండ్లను వ్యతిరేకించే రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు జోక్యం కోసం ఎదురు చూస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని సిపిఎం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థలు అనేకానేక పిటీషన్లలను సుప్రీంకోర్టులో వేశాయి.
గడిచిన జనవరి 31వ తేదీన సుప్రీంకోర్టు ఈ ఫిర్యాదులను మూడు భాగాలుగా విభజించడం ఒక ఆశను రేకెత్తిస్తోంది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించనుంది. కమెడోర్ భాత్రా ఆర్‌టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉంటంకిస్తూ పిటీషనర్లు ఈ పథకాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. భారత పాక్ యుద్ధంలో(1971) వీరోచితంగా పోరాడిన ఈ యుద్ధ వీరుడికి ఈ పథకంలో పారదర్శకత కోసం పోరాడడం అంత తేలికగా లేదు. ఈ మాజీ నౌకాదళాధికారికి హెచ్చరికలు, బెదిరింపులకు తోడు, ఆయన పేరుతో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారు. వారికి ఎదురైన సవాళ్ళ గురించి ప్రశ్నించినప్పుడు “కచ్చితంగా చెపుతున్నాను, పైనుంచి ఒత్తిడులున్నాయి. పైనుంచి అంటే బాగా పైనుంచే.
ఇలాంటి సమాచారం ప్రజలకు చేరడం వారికి ఇష్టం లేదు” అన్నారు కమొడోర్ భాత్రా. ఉన్నతోద్యోగం చేస్తూ ఉద్యోగ విరమణ చేశాక ఏదో ఒక పదవిని ఆశించే వారున్న ఈ రోజుల్లో, కమొడోర్ భాత్రా ఒకే ఒక్కడుగా పోరాడుతున్నారు. ఒక రాజకీయ పార్టీని బాగా పటిష్టం చేసి, భారతీయ వ్యవస్థలను బలహీనం చేయడం కోసం ఒక పథకం ప్రకారం రూపొందించిన ఈ పథకంలో పారదర్శకత కోసం ఆయన పోరాడుతున్నారు. ఈ బలమైన ప్రభుత్వంతో ఎందుకిలా పోరాడుతున్నారని అడిగిన ప్రశ్నకు “ఇది నా అభిరుచి. నౌకాదళంలో ఉన్నప్పుడూ ఇలాగే ఉన్నాను. వ్యవస్థలో మార్పులు తేవాలి. పరిపాలనలో పాలు పంచుకోదలిస్తే సమాచారం కావాలి. అది ఆర్‌టిఐ ద్వారా సేకరిస్తున్నాను. ఆర్‌టిఐ ద్వారా అనేక విషయాలు మారాయి. మిగతా వారు కూడా దీన్ని అనుసరించాలి” అని సమాధానం చెప్పారు యుద్ధ వీరుడు కమొడోర్ భాత్రా.
రాఘవశర్మ
9493226180