Friday, November 22, 2024

ఆరోసారి రెపో రేటు పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) వరుసగా ఆరోసారి వడ్డీ రేట్లను పెంచింది. ఈసారి రెపో రేటును స్వల్పంగా 25 బేసిస్ పాయింట్లు(0.25 శాతం) పెంచుతూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు గతంలో ఉన్న 6.25 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు గాను ఆర్‌బిఐ రెపో రేటును పెంచింది. ఈ పెంపుతో రుణాలు, ఇఎంఐలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. దీంతోపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మూడు రోజుల ఎంపిసి (ద్రవ్య విధనా సమీక్ష) సమావేశం వివరాలను ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆరుగురు సభ్యుల ఎంపిసి బృందంలో నలుగు రేటు పెంపునకు ఓటు వేయగా, ఇద్దరు సభ్యులు వ్యతిరేకించారు. రెపో రేటును పెంచడమే కాకుండా ఆర్‌బిఐ గవర్నర్ సమావేశంలో పలు కీలక ప్రకటనలు చేశారు.

ఆర్‌బిఐ గత సంవత్సరం రెపో రేటును 2.25 శాతం పెంచింది. 2023 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి 7 శాతంగా ఉండనుందని ఆర్‌బిఐ గవర్నర్ అంచనా వేశారు. అదే సమయంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం రేటు అంచనా 5.3 శాతంగా ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయని శక్తికాంత దాస్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, అయితే ప్రపంచ సవాళ్లు ముందున్నాయని ఆయన అన్నారు. ఆర్‌బిఐ ఎంఎస్‌ఎఫ్(మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ) రేటును 0.25 శాతం పెరిగింది.

ఇప్పుడు ఎంఎస్‌ఎఫ్ రేటు 6.50 శాతం నుంచి 6.75 శాతానికి పెరిగింది. 2023-24లో జిడిపి వృద్ధి మొదటి త్రైమాసికానికి 7.8 శాతం, రెండో త్రైమాసికానికి 6.2 శాతం, మూడో త్రైమాసికానికి 6 శాతం, నాలుగో త్రైమాసికానికి 5.8 శాతంగా అంచనా వేసినట్టు శక్తికాంత దాస్ తెలిపారు. 2022-23 ద్వితీయార్థంలో కరెంట్ ఖాతా లోటు తగ్గుతుందని అన్నారు. 2022, 2023లో ఇప్పటి వరకు ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే రూపాయిలో అస్థిరత తక్కువగా ఉందని గవర్నర్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెపో రేటును 0.25 శాతం పెంచడం సముచితమని దాస్ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2023-24లో జిడిపి వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని గవర్నర్ అన్నారు.

ఇఎంఐలు మరింత పెరగనున్నాయ్

రెపో రేటు పెంపుతో గృహ, వాహన రుణాల ఇఎంఐలు మరింత పెరగనున్నాయి. రెపో రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెరిగింది. ప్రభుత్వ-, ప్రైవేట్ బ్యాంకుల నుండి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వరకు గృహ రుణాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఇప్పటికే ఉన్న ఇఎంఐ ఖరీదైనవి కానున్నాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బిఐ 8.60 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్లపాటు రూ.25 లక్షల గృహ రుణం కోసం రూ.21,854 ఇఎంఐ చెల్లించాల్సి వచ్చిందనుకుంటే, తాజాగా రెపో రేటు పెంపుతో ఇఎంఐ రూ. 22,253 చెల్లించాల్సి వస్తుంది. అంటే ఇఎంఐ దాదాపు రూ.400 వరకు పెరుగుతుంది. 40 లక్షల గృహ రుణంపై ఇదే వ్యవధికి గాను ఇఎంఐ ప్రతి నెలా అదనంగా రూ.637 చెల్లించాల్సి ఉంటుంది.

అదానీ గ్రూప్‌తో బ్యాంకింగ్‌కు నో ఎఫెక్ట్

దేశంలో బ్యాంకింగ్ రంగం పటిష్టంగా ఉన్నందున అదానీ గ్రూప్ భారత బ్యాంకింగ్ వ్యవస్థను ప్రభావితం చేయలేదని శక్తికాంత దాస్ అన్నారు. అదానీ గ్రూప్‌పై క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు గవర్నర్ స్పందిస్తూ, భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉందని, ఏ కంపెనీ ప్రభావితం చేయదని అన్నారు. కంపెనీ మార్కెట్ విలువ ఆధారంగా కాకుండా ప్రాజెక్టుల ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇస్తాయని ఆయన అన్నారు. భారతీయ బ్యాంకుల క్రెడిట్ వాల్యుయేషన్ పద్ధతులు మెరుగుపడ్డాయని అన్నారు. అతని ప్రకారం, రెండేళ్ల క్రితం ఆర్‌బిఐ బ్యాంకులకు పెద్ద ఎక్స్‌పోజర్ నిబంధనలను హేతుబద్ధీకరించిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News