న్యూఢిల్లీ : దేశంలో మహిళలకు విపరీతంగా సంక్రమిస్తున్న గర్భాశయ క్యాన్సర్ నివారణకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన వ్యాక్సిన్ సెర్వావాక్ ( సిఇఆర్‌విఎసి) మార్కెట్‌లో ఈనెల లభ్యం కానున్నదని అధికార వర్గాలు వివరించాయి. రెండు డోసుల ఈ వ్యాక్సిన్ వయల్ గరిష్టధర (ఎంఆర్‌పి) రూ. 2000 గా నిర్ణయించారు. మొట్టమొదటి స్వదేశీ హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పివి) వ్యాక్సిన్‌ను సీరం సిఇఒ అదర్ పూనావాలా, ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ సమక్షంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జనవరి 24 న ఆవిష్కరించారు. ప్రైవేట్ మార్కెట్‌లో ఈ వ్యాక్సిన్ వయల్ ధర రూ. 2000 గా ఉంటుందని వివరిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు సింగ్ లేఖ రాశారు. ఇతర వ్యాక్సిన్ల కన్నా ఈ వ్యాక్సిన్ ధర తక్కువగా పేర్కొన్నారు. ఆస్పత్రులు, డాక్టర్లు, అసోసియేషన్లు సీరం సంస్థను ఈ నెల లోనే మార్కెట్ లోకి విడుదల చేయాలని కోరిన మీదట ఈ నెల నుంచే ఇది అందుబాటు లోకి వస్తోంది.
హెచ్‌పివి వ్యాక్సిన్ల కోసం ప్రస్తుతం విదేశాలపై ఆధారపడవలసి వస్తోంది. ప్రస్తుతం అమెరికా సంస్థ మెర్క్ గార్డసిల్ తయారీ హెచ్‌పివి వ్యాక్సిన్ సింగిల్ డోసు ప్రైవేట్ మార్కెట్‌లో రూ. 10, 850 కు లభ్యమౌతోంది. దేశంలో నేషనల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమం కింద జూన్‌లో 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఏప్రిల్‌లో గ్లోబల్ టెండర్ పిలవనున్నది. ప్రపంచం మొత్తం మీద మహిళల్లో 16 శాతం మంది భారత్ లోనే ఉన్నారు. వీరిలో నాలుగో వంతు మంది గర్భాశయ క్యాన్సర్ బాధితులవుతున్నారు. ప్రపంచం మొత్తం మీద గర్బాశయ క్యాన్సర్ మరణాల్లో మూడో వంతు భారత్ లోనే సంభవిస్తున్నాయి. మహిళల జీవిత కాలంలో ఈ క్యాన్సర్ పెరిగే రిస్కు భారత్‌లో 1.6 శాతం ఉండగా, మరణం సంభవించే ప్రమాదం 1 శాతం వరకు ఉంటోంది. ఇటీవలి అంచనా ప్రకారం ఏటా 80,000 మంది బాధితులవుతుండగా, భారత్‌లో ఏటా 35,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.