2014 నుంచి దాదాపు దశాబ్ద కాలంగా అంగారక గ్రహంపై ప్రాణి మనుగడకు సంబంధించిన ఆధారాల కోసం నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ అనే మానవ రహిత వ్యోమనౌక పరిశోధనలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. అంగారక గ్రహంపై మౌంట్ షార్ప్ అనే గుట్టపైకి ఎక్కుతూ రోవర్ పరిశోధనలు నిర్వహిస్తోంది. అయితే ఇటీవల ఆశ్చర్యం కలిగించే పరిశోధనలు చేసింది. గ్రహం ఉపరితలంపై నీటి అలల తాలూకు శిలాజాల ఆకృతులను కనుగొన గలిగింది.
దీన్ని బట్టి అతిప్రాచీన కాలంలో సరస్సు ఉండేదని, ఇప్పుడు అది ఎండిపోయన మట్టి మచ్చల ఆనవాళ్లు మిగిలాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంగారక గ్రహంపై మొదట క్యూరియాసిటీ కాలు మోపి సల్ఫేట్ కలిగిన భాగం వద్దకు చేరుకున్నప్పుడు ఒకప్పుడు సరస్సు ఉండే ఆఖరి ఆనవాలుగా శాస్త్రవేత్తలు భావించారు. ఇప్పుడు రోవర్ మరింత స్పష్టంగా ఆనవాలును కనుగొనగలిగింది. ప్రాచీన సరస్సు లో ఏర్పడిన నీటి అలలే ఇప్పటి ఆనవాళ్లుగా స్పష్టత వచ్చింది.
కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతగా లోతు లేని సరస్సు చిలికిన అలలే సరస్సు అడుగున ఇప్పుడు అవశేషంగా రాళ్లలో మిగిలిందని, నాసా వెల్లడించింది. ఈ మిషన్‌లో మొదట బయటపడిన ప్రాంతాల కన్నా ఎండిన నేలలో శిలల పొరలు మొదట ఏర్పడ్డాయని నమ్మేవారు. ఈ ప్రాంతంలోని నీరు విచిత్రంగా ఎండిపోయిన తరువాత సల్ఫేట్లు, లవణ ఖనిజాలు, వెనుక మిగిలిపోయాయని శాస్త్రవేత్తలు అనుకునేవారు.