Thursday, December 19, 2024

ఇక్కడ దిక్కులేదు కానీ..దేశం మొత్తం కరెంట్ ఇస్తాడట: షర్మిల

- Advertisement -
- Advertisement -

రఘునాథపల్లి : రఘునాథపల్లి మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ఎదుట వరంగల్‌-హైదరాబాద్ జాతీయ రహదారిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల రాస్తారోకో నిర్వహించారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం 232వ రోజు సాగుతున్న పాదయాత్ర మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో గంటపాటు నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా వైఎస్.షర్మిల మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని, కేసీఆర్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. కరెంటు కోతలు లేకుండా పాలన అని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెబుతున్నారని అన్నారు.

రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్నాం కాబట్టి మేము పవర్‌లో ఉంటామని కేసీఆర్ దొంగల ముఠా చెబుతుందని అన్నారు. ఇందులో వాస్తవం ఉందో లేదో తెలంగాణ రైతాంగానికి అంతా తెలుసునని, అసలు విద్యుత్‌శాఖ అధికారులకు ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగు అవుతుందని, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ధర్నాలు చేస్తున్నారని అన్నారు. రైతులు ధర్నాలు చేస్తుంటే కేసీఆర్‌కి మాత్రం కనబడటం లేదా, అసెంబ్లీ వేదికగా పిచ్చి పిచ్చి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ కంటికి ఎందుకు రైతుల ఆందోళనలు కనిపించడంలేదని ప్రశ్నించారు.

ఇక్కడ దిక్కులేదు కానీ దేశం మొత్తం 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఇస్తాడట, ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని పిచ్చి మాటలు చెబుతున్నాడని, పిట్టలదొర లెక్క టోపీ పెట్టుకొని విమానాల్లో తిరిగి పిట్టల దొర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 24 గంటల కరెంటు ఇవ్వాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గౌరవబోయిన సమ్మయ్య, నియోజకవర్గం ఇన్‌చార్జ్ సంఘాల ఇర్మియ, జిల్లా అధ్యక్షులు ఊరటి శ్రీనివాస్, మండల అధ్యక్షులు ముసిపట్ల నరేష్, జిల్లా నాయకులు బక్క జంపన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News