మన తెలంగాణ, హైదరాబాద్ : బస్తీ దవఖానాలు సిఎం కెసిఆర్ అద్భుత ఆలోచన అని పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో మెరుగైన వైద్య సధుపాయాల కోసం వాటిని ఏర్పాటు చేశామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయించుకునే స్థోమత లేని పేదల కోసం తీసుకొచ్చిన బస్తీ దవాఖానాలో 57 రకాల వైద్యసేవలు ఉచితంగా అందుతున్నాయని అన్నారు. ఇప్పుడు పేదలు సుస్థిని నయం చేసే దోస్తులుగా బస్తీ దవఖానాలు మారాయన్నారు. ఇప్పటి వరకు బస్తీ దవఖానాల ద్వారా కోటిమందికి పైగా ప్రజలు వైద్య సదుపాయం వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. బస్తీ దవఖానాల్లో ఉచితంగా లిపిడ్ ప్రోఫైల్, థైరాయిడ్ వంటి ఖరీదైన పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మార్చినాటికి 57 రకాల వైద్య పరీక్షలతో పాటు 158 రకాల మందులు ఉచితంగా అందిస్తామన్నారు.
ఆదివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పట్టణ ప్రాంతాల్లో బస్తీదవఖానాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో మొత్తం బస్తీ దవఖానాలు 496 ఉండగా వాటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 264, హెచ్‌ఎండిఎ పరిధిలో 36, ఇతర మున్సిపాలిటీలలో 45 ఉన్నాయన్నారు. వీటితో పాటు మరో 151 బస్తీ దవఖానాలను మార్చి నెలాఖరు నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే బస్తీ దవఖానాలలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో బస్తీ దవఖానాలను ఏర్పాటు చేయడం వలన ప్రముఖ ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో అవుట్ పేషెంట్ (ఒపి) సేవల భారం తగ్గిందన్నారు. ఈనెలాఖరు నాటికి జిహెచ్‌ఎంసి పరిధిలో 1540 ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. త్వరలో మేడ్చల్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. క్రమంగా అన్ని జిల్లాల్లో వైద్య కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు.