తెలుగు విశ్వవిద్యాలయం 2020 సాహితీ పురస్కార గ్రహీతల చిట్టా లో ఓ మట్టిలో మాణిక్యం కనబడింది. ఈ గౌరవానికి ఎంపికైన తెల్ల బట్టల ప్రతిభావంతుల మధ్యన ఓ జిడ్డు మనిషి తళతళా మెరుస్తూ కనిపించాడు. ఆయనే నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్. ఆయన నవల ‘దుల్డుమ్మ’ ఉత్తమ రచనగా గుర్తింపు పొంది శ్రీనివాస్‌ను వీరి సరసన చేర్చింది. ఈ ఎంపికకు ముందుగా అవార్డు కమిటీకి అభినందనలు తెలపాలి. తెలంగాణ రాష్ట్ర సాధనతో క్రమంగా వెలుగులోకి వస్తున్న ఈ మట్టిలోని సాంస్కృతిక, సాహిత్య, కళావైభవానికి ఈ ఎంపిక ఓ మచ్చుతునక. కథకుడు, నవలాకారుడు అయిన నేరెళ్ల శ్రీనివాస్‌గౌడ్ ఓ సాధారణ కల్లుగీత కార్మికుడు. ఇప్పటికీ పుట్టిన పల్లెటూరులో ఉం టూ తాటి, ఈత చెట్లపై నుంచి కల్లు కుండలు దింపు, వంపి బతుకుతున్న వృత్తిజీవి. జగిత్యాల సమీపంలోని హనుమాజీపేట ఆయన నివాసం.
పేద కల్లుగీత కార్మికుల పెద్దకుటుంబంలో 1970లో పుట్టాడు. ఇంటికి పెద్ద బిడ్డ. తల్లి తండ్రి ఎంత కష్టపడినా వచ్చే ఆదాయం అందరి తిండికి సరిపోయేది కాదు. అలాంటి సమయంలో ప్రభుత్వం బడిలో మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టింది. ఆకలి తీరుతుందని బడిలో చేరి 7వ తరగతి వరకు చదువుకున్నాడు. తన ఒక్కడి కడుపును చూసుకుంటే ఫలితం లేదనుకొని, ఇంటి ఆర్థిక పరిస్థితులకు చేదోడు కావాలని 16వ ఏటనే పని కోసం బొంబాయి వెళ్లినాడు. అక్కడ కల్లు దుకాణంలో పనికి కుదిరాడు. కొంత కాలానికే అక్కడి పరిస్థితులు సరిపడక తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. కులవృత్తే జీవనగమనమని నమ్ముకొని తాటి చెట్లు, ఈత చెట్లు ఎక్కడం, కల్లు గీయడం నేర్చుకొని అందులోనే స్థిరపడ్డాడు. ఆ క్రమంలో శ్రీనివాస్‌కు జగిత్యాలలోని డిగ్రీ కాలేజీ గ్రంథాలయ అధికారిగా పని చేసే ఆంజనేయులు పరిచయమయ్యాడు.ఆయన శ్రీనివాస్ దగ్గరకు తరచుగా కల్లు తాగడానికి వస్తుండేవాడు. మాటల మధ్య శ్రీనివాస్‌కు చదువుపట్ల ఉన్న ఆసక్తిని గమనించిన ఆయన డిగ్రీలో ప్రవేశం కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష గురించి చెప్పాడు. అలా చదువు నిచ్చెనపై శ్రీనివాస్ మళ్ళీ కాలు మోపాడు. 1995లో బిఎలో చేరి పూర్తి చేశాడు. 2002లో కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య ద్వారా ఎంఎ తెలుగు పట్టా పొందాడు. 2021లో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీలోనే మానవ హక్కులపై పిజి డిప్లమో చదివాడు. ప్రస్తుతం అదే ఓపెన్ యూనివర్శిటీ లో ఎంఎ సామజిక శాస్త్రం చదువుతున్నాడు.
సాహిత్యంపై ఉన్న ఆసక్తితో పుస్తక పఠనంతో పాటు కథలు రాయడం ఆరంభించాడు. తొలి కథ కులవృత్తి. ఆ కథ 2000 లో విశాల సాహితీ కథా పురస్కారానికి ఎంపికైంది. తొలి రచనకే అప్పటి హైకోర్టు జడ్జి చేతుల మీదుగా శ్రీనివాస్ అవార్డును అందుకున్నారు. ఆ కథ సుప్రభాతం వారపత్రికలో ప్రచురింపబడింది. విశాల సాహితీ ద్వారా శ్రీనివాస్‌కు ప్రముఖ రచయిత బిఎస్ రాములు పరిచయమయ్యారు. ఆనాటి నుండి నగరానికి దూరంగా కులవృత్తిని చేస్తూ బతికే శ్రీనివాస్‌కు రచనలోనూ, ముద్రణలోనూ బిఎస్ రాములు సలహాలు, సహకారాలు అందుతున్నాయి. నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ మొదటి నవల ‘బతుకుతాడు’. తగిన ఆర్థికవనరులు లేక నవల ముద్రణ కోసం ఇబ్బందులు పడవలసి వచ్చింది.చివరకు 2004లో లభించిన తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయం పోను మిగితా సొమ్మును బిఎస్ రాములు స్వయంగా వెచ్చించి బతుకుతాడును పుస్తకంగా తెచ్చారు. అలా ప్రోత్సాహకరంగా మొదలైన శ్రీనివాస్ నవల రచన కొనసాగుతూనే ఉంది.
శ్రీనివాస్ కలంలోంచి 2006లో పేదోళ్ల బతుకులు, 2008లో మా బతుకులు, 2011 లో సర్పంచ్, 2015 రచ్చబండ అనే నవలలు వెలువడ్డాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో 2017లో దుల్దుమ్మ నవల, 2022లో కల్తీ బతుకులు కథా సంపుటి వచ్చాయి. 2022లో తన డిప్లమోలో భాగంగా ‘గౌడ వృత్తి హక్కులు -అభివృద్ధి’ పేరిట ప్రాజెక్టు రిపోర్ట్‌ను అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ మానవ హక్కుల విద్యావిభాగానికి సమర్పించారు. స్వీయ అనుభవాలను జోడించి గౌడవృత్తి అభివృద్ధి చెందడానికి ఉండవలసిన హక్కుల గురించి అందులో వివరం గా చర్చించారు. కాకతీయ యూనివర్శిటీకి చెందిన విద్యార్థిని శ్రీనివాస్ జీవితం సాహిత్యం అనే అంశాన్ని పరిశోధనకు ఎంచుకున్నారు. ఈ మధ్య కాకతీయ విశ్వవిద్యాలయం బతుకుతాడు నవలను ఎంఎ తెలుగు నాల్గవ సెమిస్టర్ సిలబస్‌లో చేర్చింది. కులవృత్తిపై బతుకుతున్న ఓ సాధారణ వ్యక్తి రాసిన పుస్తకానికి పాఠ్యాంశంలో చోటు లభించడం ఒక అరుదైన విషయమే.
రచయిత ప్రతిభకు దక్కిన అపురూప గౌరవంగా భావించాలి. బతుకుతాడు నవలలో శ్రీనివాస్ తల్లిదండ్రులే ప్రధాన పాత్రలు. కల్లు గీసే తండ్రి, బీడీలు చేసే తల్లి జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల కూర్పే దీని కథా వస్తువు. సాహిత్యానికి అరుదైన వస్తువును ఎంచుకొని సహజ సిద్ధంగా, పాత్రోచిత సంభాషణలతో రచయిత దీనిని తీర్చిదిద్దారు. గౌడ కుటుంబాల జీవితాలను ఉన్నదున్నట్లుగా ఆవిష్కరించిన నవల ఇది. కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి కులాల్లోంచి కూడా వృత్తిలో కొనసాగుతున్నవారు రచయితలుగా ఎదిగివచ్చి తమ జీవితాల్లోని కష్టసుఖాలను అందరికీ తెలియపర్చవలసిన ఆవశ్యకతను ఈ నవల నొక్కి చెబుతోంది.పురస్కారాన్ని ఎంపికైన నవల పేరు దుల్దుమ్మ. ఈ పదం కొత్తగా వింటున్నవారు కూడా ఉండవచ్చు. దుల్దుమ్మ పొద లాంటి చెట్టు పేరు. దాని ఆకులు శరీరానికి తగిలితే చాలాసేపు విపరీతమైన దురద కలుగుతుంది. తెలంగాణ విమోచనోద్యమం సమయంలో కాని, రైతాంగ పోరాటంలో ఇంకా ఇతర ఉద్యమాలలో సామాన్య ప్రజలకు ప్రకృతి ప్రసాదించిన ఆయుధంగా దుల్దుమ్మ ఉపయోగపడింది. ఆనా టి ఆ ఉద్యమ పరిస్థితులు ఇప్పుడు లేవు.
వ్యవస్థ మారింది. కానీ కొత్త సమస్యలు పుట్టుక వస్తున్నంత కాలం దుల్దుమ్మతో మనిషికి అవసరం ఉంటూనే ఉంటుంది అనే భావనతో రచయిత దీనిని నవల శీర్షికగా తీసుకున్నారు. రాత్రివేళ దొంగలబారి నుండి చెట్లపైనున్న కల్లు కుండలను కాపాడేందుకు గౌడులు దుల్దుమ్మను ఆయుధంగా ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారో ఈ నవలలో చూడవచ్చు. తన అనుభవాలతో పాటు రచయిత నెలల తరబడి పలు ఊర్లు తిరిగి చిన్న, పెద్దలను సంప్రదించి సేకరించిన సమాచారంతో సాహిత్యానికి దూరంగా ఉన్న గౌడు జీవితాలను అరుదైన కథలను మలిచారు. ఇప్పటికీ తాను పుట్టి పెరిగిన గుడిసెలోనే కులవృత్తిని కొనసాగిస్తూ సాధారణ జీవితాన్ని గడుపుతున్న నేరెళ్ల శ్రీనివాస గౌడ్ తెలుగులో ఒక అరుదైన రచయిత. ఆయన మరిన్ని రచనలు చేసి, ప్రజాదరణతో పాటు మరిన్ని పురస్కారాలు అందుకోవాలి. ఆయనను సత్కరించడమంటే తెలంగాణ కులవృత్తులను, తెలంగాణ మట్టిని గౌరవించుకోవడమే.
బి.నర్సన్
9440128169