ముంబై: దేశ ఆర్థిక రాజధానిగా పేరు పొందిన ముంబై మహానగరం తాజాగా ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 తేదీల మధ్య నమోదైన కాలుష్యం ఆధారంగా ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ తయారు చసింది. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీని వెనక్కి నెట్టి ముంబై రెండో స్థానంలో నిలిచింది. భారత్‌లో అత్యంత కలుషిత నగరంగా ఇప్పటివరకు చెప్పుకునే ఢిల్లీని కూడా ముంబై నగరం అధిగమించడం గమనార్హం.
జనవరి 29న ఇదే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ముంబై, ఫిబ్రవరి 2న ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా తొలిస్థానానికి చేరుకుంది. తర్వాత ఫిబ్రవరి 8న మళ్లీ రెండో స్థానానికి చేరింది. ఫిబ్రవరి 13న, వాయు నాణ్యతలో ప్రపంచ వ్యాప్తంగా మూడో అత్యంత అనారోగ్యకరమైన నగరంగా నిలిచింది. గత ఏడాది నవంబర్‌తోపాటు ఈ ఏడాది జనవరి నెలల్లో ముంబైల్లో గాలి నాణ్యత ఎక్కువగా పూర్, వెరీ పూర్ కేటగిరిలోనే నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.