Friday, December 20, 2024

పర్యావరణ పరిరక్షణ నిబంధనలన్నీ పాటించాలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దు, లేదా, అధీన రేఖకు వంద కిలోమీటర్ల లోపల చేపట్టే అన్ని రోడ్డు, హైవేల నిర్మాణ ప్రాజెక్టుల విషయంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన అన్ని ప్రభుత్వ ఏజన్సీలకు ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధి విధానాన్ని(ఎస్‌ఓపి) జారీ చేసింది. సొరంగాలను తవ్వే సమయంలో విపత్తుల నిర్వహణ ప్రణాళికలు, రిస్క్ అంచనా, పర్యావరణ దుర్బలత్వం లాంటి అధ్యయనాలు తప్పనిసరిగా నిర్వహించడంతో పాటుగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ నెల 6న జారీ చేసిన ఆ ఎస్‌ఓపిలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి కుంగిపోవడంతో అనేక నివాసాలకు పగుళ్లు ఏర్పడడం, దాదాపుగా ఊరునే ఖాళీ చేయించాల్సిన పరిస్థితి రావడం తెలిసిందే. ఇష్టారాజ్యంగా రోడ్లు, ప్రాజెక్టులు, భవనాలు లాంటి నిర్మాణాలను చేపట్టడమే ఈ కుంగుబాటుకు కారణంగా పర్యావరణ వేత్తలు పేర్కొంటున్న నేపథ్యంలో కేంద్రం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.

అంతేకాకుండా ఇలాంటి హైవే ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వడానికి ముందు ఇచ్చే మినహాయింపుల సమయంలో ఇతర చట్టాలు, నిబంధనలు, రెగ్యులేషన్ నోటిఫికేషన్ లాంటి కింద పొందాల్సిన అనుమతుల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వడానికి వీలు లేదని కూడా అన్ని కాలుష్య నియంత్రణ బోర్డులు, నిపుణుల అధ్యయన కమిటీలు, పర్యావరణ ప్రభావం అంచనా అథారిటీలు తదితర ఏజన్సీల చైర్ పర్సన్లకు జారీ చేసిన ఆఫీసు మెమోరాండంలో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రిస్క్ అంచనా సర్వేను ఏజన్సీలు నిర్వహించి విపత్తుల నిర్వహణ చట్ట ప్రకారం డిజాస్టర్ మేనేజిమెంట్ ప్రణాళికను రూపొందించాలని, దాన్ని సంబంధిత అథారిటీ ఆమోదించి అమలు చేయాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News