ఫిబ్రవరి 14 ప్రేమికుల దినాన్ని ఆవుల ఆలింగనోత్సవంగా సంబరించుకొమ్మని భారత పశుసంవర్ధక శాఖ ఆదేశించింది. మాధ్యమాల్లో పెల్లుబికిన ప్రజల అసంతృప్తిని, నిరసనలను గమనించి ఈ ఆదేశాలను రద్దు చేసింది. మోడీ సర్కార్ ఆవుకు ఆపాదించిన అపోహలను, అవాస్తవాలను తెలుసుకుందాం. జీవులు తిన్న ఆహారాన్ని జీర్ణించుకుంటాయి. శారీరక, జీవావసరాలు తీర్చుకుంటాయి. వ్యర్థాలను విసర్జిస్తాయి. వ్యర్థాల్లోని ఆమ్లాలు, క్షారాలకు, ఔషధంగా పనికిరాని, కొంత ఔషధ గుణం ఉండచ్చు. విసర్జితాలు పశుపక్షులకు ఆహారంగా, వంటచెరుకుగా, ఎరువు గా ఉపయోగపడచ్చు. పశువుల, పక్షుల వ్యర్థాలకు, అవి తిన్న తిండిని బట్టి కొద్ది తేడాలతో, ఒకే గుణాలుంటాయి.
ఆవుల, ఎద్దుల, గేదెల, దున్నల వ్యర్థాల్లో తేడాలుండవు. ఏ జంతు వ్యర్థాలకూ ప్రత్యేకత, పవిత్రతలుండవు. ఆవు మలమూత్రాలు అద్భుత పదార్థాలని వెగటు పుట్టించే మూఢ విశ్వాసాలు ప్రచారంలో ఉన్నాయి. మోడీ బిజెపి ప్రభుత్వంలో ఈ ప్రచారం పెరిగింది. సంఘ్ ప్రచారకులు, ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు గోవిసర్జనల పవిత్రతల గురించి డబ్బా కొడుతున్నారు. శాస్త్రజ్ఞులను, విజ్ఞాన శాస్త్రాన్ని అవమానిస్తున్నారు. ఆవు పవిత్రమని హిందువాద ఆలోచన. ఆవులు పరిపుష్ట ఆహారమైన పాలిస్తాయి. మనుషులు, గేదెలు, మేకలు, గొర్రెలు, గాడిదలు కూడా పాలిస్తాయి. ఆవుపాలలో బంగారం ఉంటుందన్నది మూర్ఖత్వం. గోపవిత్రత అశాస్త్రీయం. ఇది శూన్యాకాశం తీపా, చేదా అన్నట్లుంది. సంప్రదాయాన్ని తర్కించి, పరీక్షించి, ప్రయోగించి నిజాలు నిర్ధారించాలి.
సంప్రదాయం పేరుతో ప్రచారం చేసిన అపోహలను, మత తాత్విక భావజాలాన్ని బయటపెట్టాలి. సంప్రదాయ విశ్వాసాలు, సామాజిక ఆచరణల అవాస్తవాలను విజ్ఞాన శాస్త్ర సత్యాలతో తుడిచేయ గల శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. దీనికి ఆధారమైన ప్రశ్న, వివేకం విద్యాలయాల ప్రాథమిక లక్షణాలు. కొందరు శాస్త్రజ్ఞులు సేంద్రియ వ్యవసాయానికి ఆవు పేడాపంచితాలే కావాలని ప్రచారం చేస్తారు. సంప్రదాయం, విశ్వాసాలలో ఆర్థిక, సామాజిక కొలమానాలు సమర్థనీయాంశాలు. సేంద్రియ వ్యవసాయంలోనూ ఇది వర్తిస్తుంది. సేంద్రియ సుస్థిర వ్యవసాయ పద్ధతులు గోమూత్ర ఉపయోగంపై విస్తార సంప్రదాయ విశ్వాసాన్ని ప్రచారం చేశాయి. గోమూత్రంలో విభిన్న పదార్థాలను, వివిధ పరిమాణాలలో, పద్ధతులలో కలిపి వృక్ష పోషకాలయిన ‘అమృతాలను’, వృక్ష సంరక్షక పదార్థాలయిన ‘అస్త్రాలను’ తయారు చేస్తారు. ఉదాహరణకు వేపాకు వంటి 5 విషపూరిత ఆకులను నియమిత కొలతలలో గోమూత్రంలో కలిపి ఉడికిస్తారు. దీన్ని పంచగవు అంటారు. ఈ కషాయ మిశ్రమాన్ని నీళ్ళు కలిపి పలచగా చేసి, క్రిమిసంహారిణిగా చెట్లు, పంటలపై చల్లుతారు.
గోమూత్రంలో ప్రత్యేకమైన, ఏకైక లక్షణాలను ఆపాదించే పదార్థాలుంటాయని సంప్రదాయవాదులు వాదిస్తారు. ఎద్దుల, గేదెల, దున్నల, ఆవు మూత్రాలకు ఒకే లక్షణం ఉంటుంది. నష్టదాయక వ్యవసాయంలో పశుల మేత తగ్గి పశువులే తగ్గిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆవుల సంఖ్య తగ్గింది. పట్టణాల్లో ఆవులు చెత్త కుండీల్లో చెత్త తిని అనారోగ్యం పాలవుతున్నాయి. రోడ్లపైనే తిరుగుతున్నాయి. పడుకుంటున్నాయి. ఆవులు మా మాతలని ప్రచారం చేసే ప్రవక్తలకు వీధి గోవులు కనిపించవు. గోహింస పుకార్లతో గోగూండాలు తోటి వారిని చంపుతున్నారు. అమృతాల, అస్త్రాల తయారి మానేస్తారు కానీ ఎద్దుల, గేదెల, దున్నల మూత్రాలతో వాటిని తయారు చేయరు. గ్రామీణ ‘వ్యాపారులు’ సంప్రదాయవాద రైతులకు గోమూత్రాన్ని అమ్ముతున్నారు. ఆవులు తగ్గిన నేటి పరిస్థితులలో వారికి డ్రమ్ముల కొద్ది గోమూత్రం ఎక్కడిది? ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ ఆధునీకరణ యంత్రాలను సేంద్రియ వ్యవసాయ శత్రువులుగా చూస్తారు.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో గోమూత్ర వ్యాపారం బాగా సాగుతోంది. మధ్యప్రదేశ్, బుర్హాన్పుర్ జిల్లా, ఖాక్నర్ బ్లాక్, సాతోడ్ గ్రామం మూత్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ఇక్కడ గోమూత్ర వ్యాపారం, సేంద్రియ వ్యవసాయం పెద్ద ఎత్తున సాగుతున్నాయి. లీటరు గోమూత్రం రూ. 10లకు అమ్మి గోమూత్ర వ్యాపారులు కోట్లు గడించారు. బర్వాణి జిల్లా బాలవాడి బ్లాక్ లో ఆవు ఉత్పత్తుల, ఎరువుల వ్యాపారం బాగా జరుగుతోంది. 3 నెల్ల పంట సీజన్‌లో ఒక వ్యాపారి సగటున 25 కిలోల ఎరువుల సంచులు 3,000 పైగా అమ్ముతాడు. రూ. 75,000 లు మించి సంపాదిస్తాడు. ఈ ఎరువు తయారి సమయంలో చాలా దుర్వాసన వస్తుంది. హిందువాద రైతులు కూడా ఈ దుర్వాసనను భరించలేరు. ఈ ఎరువును తయారు చేసుకోరు. వ్యాపారులు ఈ గోమలమూత్ర ఎరువుల తయారీలో మహిళలు, దళితులతో వెట్టిచాకిరి చేయించుకుంటారు. ఇక్కడ కూడా బహుళ జాతి సంస్థల స్థాయిలో పద్ధతులలో స్త్రీల, దళితుల దోపిడీ జరుగుతోంది. దేశీ ఆవుల మూత్రమే వాడాలని, దేశీ ఆవుల పాలే తాగమని విస్తృత ప్రచారం చేశారు. ఈ అనైతిక వ్యాపారంలో కొనలేనివారు సేంద్రియ వ్యవసాయం మానేశారు.
మనుష్య, పశుపక్ష విసర్జనలు కూడా ఆధారపడదగ్గ, నమ్మదగ్గ వనరులే. ఎరువులు, క్రిమిసంహారాల తయారీలో గోమలమూత్రాలకు బదులు ఎద్దుల, దున్నల, గేదెల, గొర్రెల, మేకల, గాడిదల, మనుషుల మలమూత్రాలను వాడాలి. అదే పద్ధతులలో అమృతాలు, అస్త్రాలు తయారు చేయాలి. ఇవి కూడా బాగా పని చేస్తాయని రుజువులున్నాయి. పంది పెంట మంచి ఎరువుగా పని చేస్తుంది. గుజరాత్ ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులు బయోగ్యాస్ ప్లాంట్లలో ఆవు పేడతో పాటు మానవ మలశేషాలనూ వాడుతారని, గిరిజన ప్రాంతాల్లో పని చేసిన ఒక సుప్రసిద్ధ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి, మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ అన్నారు. వ్యవసాయంలో గోమలమూత్ర ఉపయోగాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి, సముచిత శాస్త్రీయ ప్రయోగాలతో, పనులతో, మద్దతుతో ఆ ప్రక్రియలను వివరించాలి. ఇతర జంతువుల, పక్షుల, మనుషుల విసర్జనల ప్రత్యామ్నాయ ఉపయోగాన్నీ, ప్రయోజనాలనూ ప్రోత్సహించాలి.
వ్యవసాయ పరిశోధన భారతీయ మండలి (ఐసిఎఆర్)లో నినాదాలిచ్చిన మోడీ ఈ మండలిలో, ఈ రంగంలో అధ్యయనాలకు, పరిశోధనలకు అవకాశం కల్పించాలి. నిధులు కేటాయించాలి. భావజాల తాత్వికతల ఊగిసలాటలకు స్వస్తి పలకాలి. ఉత్తరప్రదేశ్, ఉత్తర బీహార్ ప్రాంతాల్లో, కోల్కత నగరంలో పేడ పిడకలను వంట చెరుకుగా వాడతారు. స్త్రీలు పేడ సేకరించి, పిడకలు చేసి ఎండ బెట్టి పిడకల బట్టీలు పేర్చుతారు. అనానుకూల కాలాల్లో వంట చెరుకు కోసం అనుకూల సమయాల్లో ఈ పనులు చేస్తారు. పిడకలను మంచి ధరకు అమ్ముకుంటారు. పిడకల తయారీలో ఆవు పేడ మాత్రమే కావాలని అనుకోరు. గేదెల పేడనే వాడతారు. పిడకల తయారి మన రాష్ట్రంలోనూ ఎక్కువే.స్వచ్ఛ భారత్ నేపథ్యంలోనూ గ్రామాల్లో నేటికీ బహిరంగ మలవిసర్జన జరుగుతోంది. ఈ వ్యర్థాలు పంటలకేకాక బయోగ్యాస్ ఉత్పత్తికీ ఉపయోగించవచ్చు. ఈ వంటగ్యాస్ ‘ప్రధాన మంత్రి ఉజ్వల’ పథకానికి సంపూరకం కాగలదు. దీపాలకూ ఉపయోగపడుతుంది. గ్రామాల్లో వంట గ్యాస్, విద్యుత్ కొరతలు, రైతుల వ్యవసాయ అవసరాలు తీరుతాయి. గ్రామా ల్లో సామూహిక మరుగుదొడ్ల వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో బయోగ్యాస్ ప్లాంట్లకు సరఫరా చేయచ్చు. ఉపాధి హామీ పథకంలో ఉపాధి కల్పించవచ్చు.
బెజవాడ విల్సన్, ఆసిఫ్ షేక్ వగైరాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా దళితులకు మానవ మలశుద్ధి పనులు తప్పలేదు. ఈ శ్రమజీవుల బతుకులు బాగుపడలేదు. మానవ వ్యర్థాల బయోగ్యాస్ పథకాలతో వీరికి కొంత ఊరట కలగవచ్చు. ‘మానవ మలశుద్ధి మానవులే చేయటం’ వారి పూర్వజన్మ కర్మ ఫలితమన్నమోదీపాలనలో ఇంత కంటే గొప్ప సౌకర్యం సమకూరదు. ఆధారపడదగ్గ, నమ్మదగ్గ వనరులను ప్రభావవంతంగా వాడితే సేంద్రియ వ్యవసాయం, సుస్థిర ప్రగతి సుసాధ్యం. పుక్కిటి పురాణాల, కట్టు కథల, మతమౌఢ్యం వదలాలి. విజ్ఞాన శాస్త్రాన్నే నమ్మాలి. విశ్వాసాలు, సంప్రదాయాలపై విచక్షణను కేంద్రీకరిస్తే మూఢ నమ్మకాల, దుస్సంప్రదాయాల నిర్మూలన సులభం.
సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545